వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 22

వైశాఖ పురాణం – 22వ అధ్యాయం – దంతిల కోహల శాప విముక్తి

Vaisakha Puranam – Day 22

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 22వ అధ్యాయంలో దుష్టశక్తి కలిగిన రాక్షసుడు దంతిల కోహల గురించి వివరించారు. తన దుర్మార్గాలతో ప్రజలను భయపెట్టేవాడు. అతని అకృత్యాలకు కోపించిన ఒక ఋషి దంతిల కోహలకు భయంకరమైన రోగం వచ్చేలా శాపం పెట్టాడు. ఆ శాపం నుండి విముక్తి పొందడానికి దంతిల కోహల పవిత్రమైన వైశాఖ వ్రతాన్ని ఆచరించాడు. ఒక నెల పాటు విష్ణు భగవానుడిని (Lord Vishnu) పూజించి, ఉపవాసం, జాగరణలు, స్నానాలు వంటి క్రతువులను పాటించాడు. 

అతని చిత్తశుద్ధ భక్తితో విష్ణు భగవానుడు మెచ్చి, దంతిల కోహల శాపం నుండి విముక్తి కలిగించి, అనేక వరాలను కూడా ప్రసాదించాడు. ఈ కథ ద్వారా వైశాఖ వ్రతం (Vaisakha Vrut) యొక్క గొప్పతనాన్ని, దాని శక్తిని తెలిపింది. పాపాల నుండి విముక్తి, భౌతిక, ఆధ్యాత్మిక సుఖాలు, జన్మ-మరణాల చక్రం నుండి విడుదల వంటి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. అంతేకాకుండా భక్తి ప్రాముఖ్యతను కూడా ఈ అధ్యాయం నొక్కి చెబుతుంది. ఎంతటి దుష్టశక్తి కలిగిన వారైనా భక్తి ద్వారా విముక్తి పొందవచ్చు, విష్ణు అనుగ్రహం పొందవచ్చు అని తెలియజేస్తుంది. వైశాఖ పురాణం – 22వ అధ్యాయం (Vaisakha Puranam – Day 22) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 22

వైశాఖ పురాణం – 22వ అధ్యాయం – దంతిల కోహల శాప విముక్తి

నారదమహర్షి (Narada Muni) అంబరీష మహారాజునకు వైశాఖమాస (Vaisakha Masam) మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను. మహామునీ ఇహపర సౌఖ్యముల నిచ్చు వైశాఖ మహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్ర శ్రవణము యెంత విన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వ జన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి ఇంకను శ్రీహరికి (Sri Hari) ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదును వినుము.

పంపా తీరమున (Pampa River) శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి (Simha Rasi) యందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీ నదిని (Bhimarathi River) దాటి ముళ్లు రాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను.

అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్న కుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.

శంఖుడును అచటి నుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్ల నీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.

శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున (Vaisakha) ఇట్టి బుద్ధి కలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని ఆశీర్వదించెను.

కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతుడు నీవు ఇట్లు నా నుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను ఎండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాటి ఫలము జన్మాంతరమున కలుగును. 

కాని వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవ వశమున నీకు ఇట్టి బుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికి ఇష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటిలేదు. వైశాఖ ధర్మముల నాచరించినచో గయకు (Gaya), గంగానదికి ప్రయాగకు (Prayag), పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణా నదికి సేతువునకు ఇచటికిని ఏ పుణ్య క్షేత్రమునకు పవిత్ర నదికి ఎచటికిని పోనక్కరలేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది (Ganga River) కంటె పవిత్రమైనది. 

ఈ నదిలో స్నానము చేసినవారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తి పూర్ణములగు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రము ఐన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని (Madhava Masam) పేరు వచ్చినది. పాదుకలను ఇచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగ పోవుచు మార్గ మధ్యమున కనిపించిన మహా గజముపై బడెను. 

సింహమునకు, గజమునకు (Elephant) భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజ సింహ రూపములను విడిచి దివ్య రూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.

కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజ సింహములుగా నున్న మీకీ దివ్య రూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములో ఉన్న మా ఇద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి ‘నాయనలారా! విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసన కఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకు ఇచ్చి వారి అలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరి కథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. 

ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా ఆ వినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మ విముఖుడైన పుత్రుని, వ్యతిరేకమునబలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నరకముననుందురు. 

కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంత కాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప విముక్తి, ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించెను. 

శాపవి ముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ చూచితివి గదా ! వైశాఖ మహిమను వినుట వలననే దంతిలకోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసా బుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.

వైశాఖ పురాణం 22 వ అధ్యాయం సంపూర్ణం.

Read more Puranas:

Leave a Comment