వైశాఖ పురాణం | Vaisakha Puranam – Day 21

Vaisakha Puranam – Day 21

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 21వ అధ్యాయం పాంచాల రాజు శ్రీహరి సాయుజ్యం పొందడం గురించి వివరిస్తుంది. నారదుడు పాంచాల రాజు కథను వివరిస్తాడు. ఒకప్పుడు శక్తివంతమైన రాజు అయినా గతంలో చేసిన పనుల వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు. పాపాల నుండి విముక్తి కోసం అడవుల్లో తిరుగుతూ, తపస్సు చేసి, మార్గదర్శకత్వం కోసం వెతుకున్నాడు. ఒక రోజు, తన గురువులను కలిశాడు. వారు పవిత్రమైన వైశాఖ వ్రతాన్ని ఆచరించమని ఆదేశించారు, ఇది విష్ణు భగవానుడికి అంకితమైన పుణ్య కార్యం. 

పాంచాల రాజు అ తిరుగులేని భక్తితో గురువుల మాటలు పాటించి, వైశాఖ వ్రతాన్ని పూర్తి నిష్టతో ఆచరించాడు. అతని చిత్తశుద్ధ భక్తి విష్ణు భగవానుడిని (Lord Vishnu) మెప్పించింది, ఆయన రాజు ముందుకు వచ్చి, కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం, అనంతమైన ధన, ధాన్యాలను ప్రసాదించడం, మరణానంతరం శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించడం వంటి అనేక వరాలను ఇచ్చాడు. నారదుడు వైశాఖ వ్రతం (Vaisakha Vrut) యొక్క ప్రాముఖ్యతను నొక్కి పలుకుతాడు, దీని శక్తి పాపాలను పరిహరించడం, భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అందించడం, చివరికి జనన మరణాల చక్రం నుండి విముక్తి కలిగించడం గురించి చెబుతాడు. చివరిగా, భక్తి యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, విష్ణు భగవానుడికి పాంచాల రాజు చలించని భక్తిని పోలి, ధర్మ మార్గంలో నడిచి పరిపూర్ణ సంతృప్తిని సాధించాలని శ్రోతలను కోరుతూ ముగిస్తాడు. వైశాఖ పురాణం – 21వ అధ్యాయం (Vaisakha Puranam – Day 21) నందు ఈ క్రింది విధముగా . . .

నారదుడు (Narada Muni) అంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుత దేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి (Sri Hari) నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగా నది (Ganga River) పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేని వాడునగు శ్రీమహావిష్ణువును ఇట్లు స్తుతించెను.

అని స్తుతించెను.

పాంచాలరాజు చేసిన ఈ స్తుతి అర్ధవంతము శక్తిమంతము అగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాల రాజువలె పూర్వ కర్మను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు, పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వ సుఖములనంది పాంచాల రాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని ఈ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు / శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములు ఉన్న ఈ స్తోత్త్రము సాభిప్రాయమైనదే. 

01 స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవు కావు ఏదియు అంటనివాడవు. సృష్టి కర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్త్వవేత్తలును సృష్టి కర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.

02 తత్త్వ విదులును మాయా చరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.

03 స్వామీ! నీవు కోరికలన్నియు తీరిన వాడవు అయినను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.

04 తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజో గుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవ వశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభ యోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.

05 స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.

06 నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాద భక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.

07 ఇందువలన శత్రువులు నా రాజ్యము నాక్రమింపగా వన వాసినై నా గురువులను స్మరించితిని. ఆర్త బంధువులగువారు నా వద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.

08 ధర్మార్థ కామమోక్షములను, స్వర్గమును (Heaven) కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖ ధర్మముల నాచరించితిని.

09 అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వానిని సేవింపలేదు.

10 నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి అన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును.

11 స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యా పుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వానియందు ఆసక్తుడనైతిని.

12 మొట్ట మొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాద పద్మములుండగా నేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.

13 స్వామీ! ఎచటను సుఖ నిద్రలేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వ పురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.

14 నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాద పద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.

15 స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయునని ఉన్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వ శక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.

16 సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగు నీయందు భక్తి భావము కలుగును.

17 ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.

18 స్వామీ! అచ్యుతా! నీ పాద పద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాద పద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.

19 కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.

20 జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాద పద్మ స్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యా పుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.

21 ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ (Lord Sri Krishna) పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.

22 నా ముక్కు నీ పాద పద్మ గంధమునే (Sandal Paste) వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.

23 నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగు గాక. 24 నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచు గాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచు గాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.

25 ప్రభూ! బ్రహ్మ పదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాద సేవను మాత్రము కోరుదును. నీ పాద సేవను లక్ష్మీదేవి (Lakshmi Devi) బ్రహ్మ (Lord Brahma) మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాద సేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.

ఇట్లు పాంచాల రాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు (Srimannarayana)వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘ గంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషము లేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తి నందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని యిత్తును. సందేహములేదు.

నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయా (Akshaya Tritiya) తిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తి పూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటము వలననో ఏదోయొక కారణమున వైశాఖ స్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును. ఈ అక్షయతృతీయ యందు పితృ దేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయా తిధి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములనిచ్చును. కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభ దానమును చేసినవానికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును.

వైశాఖ వ్రతమును దాన ధర్మములను యధా శక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవ మాసమని (Madhava Masam)పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.

వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞ యాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖ వ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.

పాంచాల మహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతి పాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి అ నుగ్రహమునకు మిక్కిలి ఆనందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యా పుత్రాదుల కంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యా పుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వ సుఖ భోగములను అంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వ పాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.

Credits: @BharatiyaSamskruthi

Read more Puranas:

Leave a Comment