వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 20

వైశాఖ పురాణం – 20వ అధ్యాయం – పాంచాల రాజు రాజ్య ప్రాప్తి

Vaisakha Puranam – Day 20

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 20వ అధ్యాయం ధర్మం యొక్క మహిమను చాటిచెప్పే కథ. పూర్వం పాంచాల దేశంలో పురుయశుడు అనే రాజు ఉండేవాడు. ధర్మనిష్ఠ, శక్తితో తన రాజ్యాన్ని పాలించేవాడు. కానీ పూర్వజన్మ దోషాల వల్ల రాజు సంపద, బలం కోల్పోయి, రాజ్యం కూడా శత్రువుల ఆధీనమైంది. భార్య శిఖితో కలిసి రాజు అడవిలో దాగుకొన్నాడు.

ఈ కష్టాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజు తన గురువులను తలచుకున్నాడు. వారిద్దరూ రాజు స్మరణతో వచ్చి, రాజుకు గత జన్మాలలో చేసిన పాపాల గురించి చెప్పారు. రాజు కిరాతుడిగా జన్మించి, ధర్మం వ్యతిరేకంగా పాపాలు చేసినందున ఈ కష్టాలు వచ్చాయని తెలిపారు.

రాజు తన పాపాలకు పరిహారం కోసం వైశాఖ వ్రతాన్ని (Vaisakha Vrut) ఆచరించమని గురువులు సలహా ఇచ్చారు. రాజు వైశాఖ శుద్ధ తదియ (Vaisakha Suddha Tadiya) నాడు ఒక ఆవును దూడతో సహా దానం చేసి, వైశాఖ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు.

వైశాఖ వ్రత ప్రభావంతో రాజుకు పూర్వపు సంపద, రాజ్యం తిరిగి వచ్చాయి. శత్రువులు ఓడిపోయారు. రాజుకు ఐదుగురు పుత్రులు జన్మించారు. రాజు తన జీవితాంతం వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ, ధర్మం, దానం చేస్తూ సుఖశాంతులతో రాజ్యం పాలించాడు. ఒకరోజు వైశాఖ శుద్ధ తృతీయ (Tritiya) నాడు శ్రీహరి రాజుకు ప్రత్యక్షమై, రాజు భక్తికి మెచ్చి వరాలను అందించాడు. వైశాఖ పురాణం – 20వ అధ్యాయం (Vaisakha Puranam – Day 20) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 20

వైశాఖ పురాణం – 20వ అధ్యాయం – పాంచాల రాజు రాజ్య ప్రాప్తి

నారదమహర్షి (Narada Muni) అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజా! వినుము. శ్రీహరికి (Sri Hari) మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము.

పూర్వము పాంచాల దేశమున (Panchala Kingdom) పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహా వీరుడు తన శక్తి యుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు (Horses), గజములు (Elephants) మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండు వలె సార విహీనములయ్యెను.

వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వత గుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. “నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, ఇంద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలము ఉండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.

రాజు వారిద్దరికి నమస్కరించి యధా శక్తిగ ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనుల గావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనో విచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మ ప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశమున ఉన్న వారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.

బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువుల ఆధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.

నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులగు ఇద్దరు వైశ్యులు (Vysya) కర్షణుడనుముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు, ఎండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.

అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజ భటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లని గాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.

నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖ శుద్ద తదియ యందు ఒకసారి ఈనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము.

నీవు భక్తి శ్రద్దలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారు ఇద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.

రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్దలతో నాచరించెను. యధా శక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనంద పూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామి యంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజాను రక్తులై ఉండిరి.

రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయ తృతీయనాడు (Akshaya Tritiya) ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖ చక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో (Lakshmi Devi) గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనంద పరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనంద పరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.

వైశాఖ పురాణం 20వ అధ్యాయం సమాప్తం.

Read more Puranas:

Leave a Comment