వసంత పంచమి | Vasant Panchami

వసంత పంచమి

Vasant Panchami
Vasant Panchami

జ్ఞానదేవి ఆగమనం: వసంత పంచమి

మాఘమాసం వచ్చిన ఐదో రోజున పంచమి నందు మనం జరుపుకునే మరో శుభదినం ఈ వసంత పంచమి (Vasant Panchami). దీనినే శ్రీ పంచమి (Sri Panchami) అని, సరస్వతి పంచమి (Saraswati Panchami) అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమి  రోజే చదువులతల్లి సరస్వతీ దేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త  పురాణం చెపుతోంది. దేవీ భాగవతం (Devi Bhagavatam) నందు శ్రీమన్నారాయణుడు నారద మునికు వసంత పంచమ నాడు ఆచరించదగ్గ విధి విధానాలను వివరించినట్టు కలదు.

సరస్వతీ పూజ విశేషాలు

అన్ని విద్యలకూ ఆధారం వాగ్దేవి (Vagdevi) అయినా సరస్వతి (Saraswati) కనుక అందరు పుస్తకాలను, కలాలను అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున పూజిస్తారు.  సంగీతం మరియు నృత్య సాహిత్యములకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని సంగీత నృత్యంతో పూజిస్తారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విధ్యావంతులు అవుతారనే నమ్మకం ఉంది. అందుకే చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలకి మొట్టమొదటి అక్షరాభ్యాసం చేయిస్తారు. 

Aksharabhyasam

ఆదిశంకరుడు తాను అపారమైన తత్వ జ్ఞానాన్ని సరస్వతి దేవి (Saraswati Devi) కటాక్షముతో పేర్కొన్నాడు. అంతేకాకుండా శారదాదేవి అనుగ్రహం వలన అందరమూ సమగ్రమైన జ్ఞానంతో ఎదగగలమని చాటి చెప్పారు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారదాదేవి. అందుకే వసంత పంచమి (Vasant Panchami) నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారన్న నమ్మకం అనాది నుండి ఉన్నది.

Aksharabhyasam

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి నెమలి వాహనం మీద దర్శనం ఇస్తుంది. జ్ఞానకాంతిని పొంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. సరస్వతిని తెల్లని పుష్పలతో, తెల్లటి వస్త్రాలతోను, శ్రీగంథముతో అలంకరిస్తారు. పసుపు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితోకూడిన వంటలను నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. విద్యార్థులు, కళాకారులు, రచయితలు చదువుల తల్లియైన సరస్వతి పూజ (Saraswati Puja) చేస్తారు. ఆమె అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు.

Saraswati Puja

సరస్వతి దేవి యొక్క సహస్రనామాలలో అత్యున్నతమైన ద్వాదశ నామాలు

1. భారతి2. సరస్వతి3. శారద
4.హంసవాహిని5. జగతీఖ్యాత6. వాగీశ్వర
7. కౌమారి8. బ్రహ్మచారిణి9.బుద్ధి ధాత్రి
10. వరదాయిని11. క్షుద్ర ఘంట12. భువనేశ్వరి

పురాణ కథలలో వసంత పంచమి

Saraswati Devi

వసంత పంచమి పండుగ వెనక అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. 

  • పురాణాల ప్రకారం, దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మథనం నందు లభించిన అమృతాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. ఈ మథనం చాలా శక్తివంతమైనది, అందు నుండి అనేక అద్భుతమైన వస్తువులు మరియు జీవులు ప్రత్యక్షమైనాయి. వాటిలో ఒకటి సరస్వతీ దేవి కూడా. ఆమె చేతియందు (Veena) వీణతో, తెలుపు రంగు వస్త్రాలు ధరించి, నెమలి వాహనం మీద వెలసిందని, ఆమె ఆగమనంతో ప్రకృతి అలంకరించుకుందని వివరిస్తుంది.
  • మన్మథుడు లేదా కాముడు, ప్రేమ దేవుడు, శివుడి (Lord Shiva) కోపానికి గురై భస్మమయ్యాడు. కానీ, వసంత పంచమి రోజున, పుష్పబాణాలతో సాయుధుడై పునర్జన్మించాడని, ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగ రోజున అతను తిరిగి వచ్చాడని మరొక కథనం ఉంది.
  • సత్యవాన్ మరణించినప్పుడు, యమధర్మరాజు వద్దకు వెళ్లి, తన భర్తను తిరిగి పొందేందుకు వాదించిన సావిత్రి, వసంత పంచమి రోజునే తన భర్తను తిరిగి పొందిందని ఒక ప్రసిద్ధ జానపదమున ఉన్నది.

సరస్వతీ దేవికి నైవేద్యాలు

Naivedyam

వసంత పంచమి పండుగ రోజున ప్రత్యేక ఆహార పదార్థాలు భక్తితో నైవేద్యం చేస్తారు. పసుపు రంగుకు ప్రాధాన్యత ఉండడంతో, పసుపు కందిపప్పు, పులిహోర, శనగపిండి వంటి వంటకాలు ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా, మామిడిపండు, బెల్లం వంటి వాటితో తయారు చేసిన మిఠాయిలు కూడా ఈ పండుగకు ప్రత్యేకత. అమ్మవారికి కేసరి ప్రసాదం నైవేద్యం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు

Kanaka Durga

తెలుగు రాష్ట్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలసి కనకదుర్గమ్మకు (Kanaka Durga)వసంత పంచమి సందర్భంగా అత్యంత సుందరముగా సరస్వతీ దేవి అలంకారం చేస్తారు. తెలంగాణ నందుకల ప్రసిద్ధ (Basara) బాసర సరస్వతి ఆలయమునందు ఈ ఉత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్లనుండి బాసర ఆలయంకు వచ్చి ఎంతోమంది తల్లి తండ్రులు తమ పిల్లలకి మొదటి అక్షరాభ్యాసాలు (Aksharabhyasam), అన్నప్రాసనలు (Annaprasana) ఈ రోజున చేస్తారు. బలపం, పలక, పుస్తకాలకు గణపతి పూజ మరియు జ్ఞాన సరస్వతి దేవికి పూజించి పిల్లల చదువుకు శ్రీకారం చుడతారు. పిల్లలను కొత్త బట్టలు కట్టించి, వారికి తీపి పదార్థాలు తినిపించి, వారి భవిష్యత్తు విద్యకు, జ్ఞానానికి బంగారు నాంది పలికేలా వేడుకొంటారు. పలు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి (Saraswati Puja) అధిక ప్రాధాన్యతతో  తమ ఇంటియందు కాకుండా పాఠశాలలు మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, వసంత పంచమి నాడు ‘సంధ్యా వందనం’ అనే ఆచారాన్ని కూడా పాటిస్తారు. సాయంత్రం వేళ ఇళ్ల ముందు మంటలు పెట్టి, వాటి చుట్టూ పూజలు చేస్తారు. ఈ మంటలు చీకటిని పారద్రోలడమే కాకుండా, కొత్త జీవితానికి, జ్ఞానానికి దారి చూపించే వెలుగులను సూచిస్తాయి.

ఉత్తరాదిన వసంత పంచమి వేడుకలు

Saraswati Temple Gujarat

ఉత్తర భారతదేశం నందు “బసంత పంచమి” (Basant Panchami)గా కూడా పిలుచుకొంటారు. పశ్చిమ బెంగాలులో సరస్వతి విగ్రహానికి మూడు రోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో నిమజ్జనం చేసారు. పంజాబ్, బిహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలని ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి అన్ని వయసులవారు గాలిపటాలని  ఎగరేస్తారు. పంజాబ్‌లోని సిక్కు సమాజం గురుద్వారాలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు, మరియు సంగీతకారులు బసంత్ రాగాన్ని ప్రదర్శిస్తారు. పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో, ఈ రోజున ఉత్సవాలు జరుగుతాయి. గురు గోవింద్ సింగ్ వివాహం ఈ రోజున జరిగింది, అందుకే దీనిని సిక్కు సమాజం జరుపుకుంటారు.

పసుపు వెలుగులో వెలిగిపోయే వసంత వేడుకలు

వసంత పంచమి వేడుకలు కేవలం పూజలకే పరిమితం కావు. పసుపు రంగుకు ఈ పండుగలో ప్రత్యేకత ఉంది. పసుపు రంగు జ్ఞానం, శ్రేయస్సు, సంతోషాన్ని సూచిస్తుంది. ఇళ్లలో, పాఠశాలలు, దేవాలయాలలో పసుపు, తెలుపు రంగుల అలంకరణలు చేస్తారు. ముఖ్యంగా ఇళ్ల ముందు మామిడి, వెలగపండు, తుమ్మి, నేరేడు వంటి కాలానికి తగిన పండ్లతో తోరణాలు కట్టి ముంగిళ్లను వేలాడదీస్తారు. పసుపు, తెలుపు రంగుల పూలతో ఇళ్లను అలంకరించడం కూడా ఆనవాయితి.

ముగింపు

వసంత పంచమి కేవలం పండుగే కాదు. ఇది జ్ఞానం, సంస్కృతి, సంబరాల అద్భుతమైన సంగమం. ప్రకృతి పునర్జన్మించే వసంత ఋతువులో, జ్ఞాన దేవతైన సరస్వతి దేవిని స్తుతించి, విద్యారంభానికి శ్రీకారం చుట్టే ఈ పండుగ,మనందరి జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపాలని కోరుకొందాము.

Vasant Panchami 2024

వసంత పంచమి 2024

Vasant Panchami 2024

వసంతకాల రాకను సూచించే, మాఘమాస శుక్ల పక్షంలో ఐదవ రోజు జరుపుకునే శుభోదయక పండుగైన వసంత పంచమికి భారతదేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం, వసంత పంచమి ఫిబ్రవరి 14, 2024 బుధవారం నాడు వస్తుంది. కొన్ని ప్రాంతాలు ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం పంచమి తిథి ప్రారంభాన్ని బట్టి పండుగను జరుపుకుంటాయి, అయితే చాలా ప్రాంతాలు ఫిబ్రవరి 14వ తేదీ మొత్తం రోజు శుభప్రదంగా భావిస్తారు.

వసంత పంచమి శుభాకాంక్షలు

Read More about other Festivals

Leave a Comment