అమ్మ అనుగ్రహం కోసం ఆచరించే వరలక్ష్మీ వ్రతం

Varalakshmi Vratha Kalpam – వరలక్ష్మీ వ్రతకల్పమును లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు పాటించే ముఖ్యమైన పూజలలో వరలక్ష్మీ వ్రతం -Varalakshmi Vratam ఒకటి. ఈ పండుగను భారత దేశంలో కల మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల అష్టలక్ష్ములు అనుగ్రహించి ధన, ధాన్య, సౌభాగ్యాలను ప్రసాదిస్తారని నమ్మకం. ఈ వ్రతంలో ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, తోరణాలు కట్టి అలంకరిస్తారు. కలశాన్ని (Kalasham) ఏర్పాటు చేసి, అందులో లక్ష్మీదేవిని (Goddess Lakshmi Devi) ఆవాహన చేస్తారు. పసుపుతో చేసిన గౌరీదేవిని (Goddess Gauri Devi) కూడా పీఠంపై ఉంచి పూజ చేస్తారు. ఈ పూజలో అమ్మవారిని 16 రకాల ఉపచారాలతో పూజిస్తారు, స్తోత్రాలు పఠిస్తారు.
వరలక్ష్మీ వ్రతంలో భాగంగా, వ్రతం చేసే మహిళలు పూజా సంకల్పం చెప్పుకొని, కలశంలో బియ్యం, నాణేలు, పసుపు, కుంకుమ మొదలైనవి ఉంచుతారు. అమ్మవారిని ఎరుపు, తెలుపు రంగు పూలతో అలంకరిస్తారు. పూజ పూర్తయిన తర్వాత, నైవేద్యంగా పాయసం, గారెలు, పులిహోర వంటి పిండి వంటలు సమర్పిస్తారు. వ్రతానికి ముఖ్యమైనది తొమ్మిది దారాలతో చేసిన తోరం. ఈ తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజించి, వ్రతం పూర్తయ్యాక చేతికి కట్టుకుంటారు. ఈ వ్రతం ఆచరించిన మహిళలకు సకల సంపదలు, సౌభాగ్యం, మంచి ఆరోగ్యం, సత్సంతానం కలుగుతాయని విశ్వాసం. వ్రతం తర్వాత, ముత్తయిదువులకు వాయనం ఇచ్చి, వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ పండుగలో ఒక భాగం.
భక్తితో వేడుకుంటే వరాలనిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ప్రత్యేకమైన నిష్ఠలు, కఠినమైన నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. వివాహిత స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి.
లక్ష్మీదేవి (Lakshmi Devi )సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద వంటి అనేక రకాల సంపదలను అమ్మవారు మనకు ప్రసాదిస్తారు.
Varalakshmi Vratha Kalpam Telugu
వరలక్ష్మీ వ్రతకల్పము తెలుగు
పూజా సామగ్రి:
పసుపు (Turmeric), కుంకుమ, పండ్లు, విడిపూలు, పూల మాలలు, తమలపాకులు (Betel leaves), అగరువత్తులు, వక్కలు, ఖర్జూరాలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరి కాయలు, కలశము (Kalasham), కలశ వస్త్రము (రవికల గుడ్డ).
అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము
పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార
తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.
పసుపు ముద్దతో వినాయకుడిని (Vinayaka) చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ (Coconut) ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
పూజావిధానం:
గణపతి పూజ (Vinayaka Puja)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
దీపము వెలిగించాలి.
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్’ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.
ఆచమ్య:
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..
శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!
(అని అక్షతలు వాసన చూచి తమ ఎడమ ప్రక్కన పడవేయవలెను.)
మామోపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే. . . సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహరికే చాంద్రమానేన …….సంవత్సరే ….ఆయనే…..ఋతౌ…మాసే…..పక్షే….తిథౌ…..వాసరే శుభ నక్షత్ర శుభ యోగ శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలా వాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశ పూజాం కరిష్యే!
కలశ పూజ – Kalasha Puja
అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.
శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!
అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!
ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!
కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!
(కలశములోని ఉదకమును పుష్పముతో అమ్మవారిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)
కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!
యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!
(అని ప్రార్థించి అమ్మవారిపై పుష్పమును ఉంచవలెను)
అథ ధ్యానమ్:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!
లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!
ఆవాహనం:
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!
ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆవాహయామి!
ఆసనమ్:
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!
సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.
( ఆసనం చూపి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు దేవిపై చల్లాలి)
పాద్యమ్:
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!
(అని కాళ్లు కడుగు కొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్దరిణితో పంచపాత్రలోని జలాన్ని వేరొక పాత్రలోనికి వదలాలి)
అర్ఘ్యమ్:
శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!
(అని చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్ర లోని జలాన్ని పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి, అర్ఘ్యం పాత్రలో రెండుచుక్కలు వదలాలి)
ఆచమనీయం:
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!
గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి
(ముఖం శుభ్రం చేసుకొడానికి నీళ్లు ఇచ్చునట్లు భావిస్తూ జలాన్ని వేరొక పాత్రలోనికి వదలాలి.)
పంచామృత స్నానం:
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి
(నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పంచదారను విడివిడిగా దేవిపై ఉద్దరిణితో చల్లాలి.)
శుద్ధోదక స్నానం:
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!
శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి
(అని పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవిపై చల్లవలెను.)
వస్త్రం:
సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం:
తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి
(వత్తిపత్తిను మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యజ్ఞోపపవీతం దేవికి సమర్పించుకోవాలి)
గంధం:
కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి
(అని అక్షతలు దేవిపై చల్లాలి.)
అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!
హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి
ఆభరణం:
కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి
శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి.
(బంగారం లేదా వెండి మీ శక్తానుసారం దేవికి ఆభరణం సమర్పించాలి.. లేదా అక్షంతలు వేసి నమస్కరించాలి.)
పుష్పం:
మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి
అథాంగపూజా!
ఓం చంచలాయై నమః – పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః – జానునీ పూజయామి
ఓం పీతాంబదధరాయై నమః – ఊరుం పూజయామి
ఓం కమలవసిన్యై నమః – కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః – నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః – స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః – భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః – కంఠం పూజయామి
ఓం సునాసికాయై నమః – నాసికాం పూజయామి
ఓం సుముఖ్యై నమః – ముఖం పూజయామి
ఓం శ్రియై నమః – ఓష్ఠౌ పూజయామి
ఓం సునేత్రే నమః – నేత్రం పూజయామి
ఓం రమాయై నమః – కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః – శిరః పూజయామి
ఓం వరలక్ష్మ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే
అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.
Lakshmi Ashtottara Shatanamavali
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి
(అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను)
దీపం
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి
(దీపము చూపవలెను)
నైవేద్యం
నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి
(రకరకములైన పిండి వంటలు, రకరకములైన పండ్లును మరియు టెంకాయలను నైవేద్యముగా నివేదనము చేసి నీటిని వదలవలెను.)
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి
మంగళ హారతి – Mangala Harathi
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి
(నెయ్యి వత్తులతోను, కర్పూరంతోనూ మంగళహారతిను ఇవ్వవలెను)
నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి
పుష్పము అక్షతలు ఉంచవలెను.
నమస్కారం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!
నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి
తోరగ్రంథి పూజా!
ఓం కమలాయై నమః – ప్రథమ గ్రంథిం పూజయామి
రమాయై నమః – ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రే నమః – తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యై నమః – చతుర్థ గ్రంథిం పూజయామి
వరలక్ష్మీ నమః – పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ధి తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమ గ్రంథిం పూజయామి
చంద్ర సహోదర్యై నమః – అష్టమగ్రంథిం పూజయామి
వరలక్ష్మ్యై నమః – నవమ గ్రంథిం పూజయామి
ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.
శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే.
వరలక్ష్మీ వ్రత కథ – Varalakshmi Vrata Katha
సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీ దేవికి (Parvati Devi) జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబు నందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు ఏ వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె.
ఓ మనోహరీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు గలుగంజేయు వరలక్ష్మీ వ్రతంబను ఓక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు (Purnima) ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము.
మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల ఇండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులను చేసియు ఇంటి పనులను చేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను.
ఇట్లుండ ఆ మహా పతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీ యందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి
“నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే”
అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున మీ పాద దర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు చెంది, చారుమతికి అనేక వరములిచ్చి అంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమము అయినదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ చేయవలసిందని జెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి.
ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం ఏర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచేత కలశంబేర్పరచి అందు వరలక్ష్మీ దేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణ హస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి.
ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీ దేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను.
పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీ దేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు బోయిరి.
పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధన కనక వస్తు వాహనముల తోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను విను వారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.
వాయన దానము:
శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!
శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!
వి. సూ : శ్రీ వరలక్ష్మి వృతం చేయు విధానములు ప్రాంతాల అనుసారముగా క్రొద్దిపాటి మార్పులు ఉండగలవు.
శ్రీ వరలక్ష్మి వృతం చేయు స్త్రీలు శుద్ధిగా, అందముగా అలంకరించుకొని పూజ చేయు పరిసరమును శుద్ధి చేసుకొని ప్రారంభించవలెను. కలశాన్ని నూలు చుట్టి అమ్మవారి ముఖమును అలంకరించి అందముగా పట్టు వస్త్రమును అలంకరించవలెను.