వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 8

వైశాఖ పురాణం – 8 వ అధ్యాయం – పిశాచ మోక్షము

Vaisakha Puranam - Day 8

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క ఎనిమిదవ అధ్యాయం ఒక పిశాచ మోక్షం పొందిన కథను వివరిస్తుంది. ఈ కథ ప్రకారం, రేవా నది ఒడ్డున మైత్రుడనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను అన్ని విద్యలను నేర్చుకున్నాడు, అన్ని తీర్థాలలో స్నానం చేశాడు, సర్వదేవతలను సేవించాడు. కానీ, వైశాఖ మాసంలో (Vaisakha Masam) అన్నదానం చేయలేదు. దీనివల్ల అతను మరణానంతరం పిశాచ రూపంలో జన్మించాడు.

ఆ పిశాచం ఆకలి, దాహంతో బాధపడుతూ, తన మాంసాన్ని తినడం ప్రారంభించింది. ఒకరోజు, శ్రుతదేవుడు అనే ఒక సాధువు ఆ ప్రాంతానికి వచ్చి, ఆ పిశాచాన్ని చూసి భయపడ్డాడు. కానీ, ఆ పిశాచం తన కథను చెప్పి, తనను శాపం నుండి విముక్తి చేయమని వేడుకుంది.

శ్రుతదేవుడు ఆ పిశాచానికి (Vampire) సలహా ఇచ్చాడు. వైశాఖ మాసంలో అన్నదానం చేయడం వల్ల ఆ పిశాచం మోక్షం పొందుతుందని చెప్పాడు. శ్రుతదేవుడు ఆ పిశాచం కోసం అన్నదానం చేసి, దానికి మోక్షం కలిగించాడు. ఈ కథ ద్వారా వైశాఖ మాసంలో అన్నదానం చేయడం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. ఒక చిన్న పుణ్యం కూడా మనకు జన్మ – మరణ చక్రం నుండి విముక్తి కలిగించగలదని ఈ కథ తెలియజేస్తుంది. వైశాఖ పురాణం – 8 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 8) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 8

వైశాఖ పురాణం – 8 వ అధ్యాయం – పిశాచ మోక్షము

పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తాను తినుచు శుష్కించిన శరీరముతో నీడ లేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికల చేత బాధ పడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రము ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాల కూట విషమువలె బాధించుచుండెను. నేను గంగా (Ganga River) యాత్ర చేయవలెను అను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడ లేని బూరుగు చెట్టు పైనుండి ఆకలి దప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖ భారమున కంఠ బాధను అనుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి అద్భుతమా యని అనుకొంటిని.

పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్ని ఏమియూ చేయజాలక పోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ! భయపడకుము. నీకు నావలన ఏ భయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన ఈయలేదు. 

కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచ రూపము నందితిననియు, నేనిట్లు బాధ పడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున (Narmada River) పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జల తర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు (Lord Vishnu) సాన్నిధ్యమును అందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. 

నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలము ఉంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ ! ఎన్ని కర్మలను చేసినను పితృ దేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.

అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందు (Mesha Rasi) ఉండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.

నేనును నా తండ్రి యజ్ఞమును అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చితిని. మాధవునకు (Sri Hari)  ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృ భక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితినందెను.

కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును ఇదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మ సారమే అన్నదానము. మహారాజా ! నీకు ఇంకా ఏమి కావలయునో అడుగుము చెప్పెదను అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.

ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.

వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం.

Read more Puranas:

Leave a Comment