వైశాఖ పురాణం – 5 వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
వైశాఖ పురాణం (Vaisakha Puranam) లోని ఐదవ అధ్యాయం వైశాఖధర్మ ప్రశంస గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం వైశాఖ మాసంలో చేయవలసిన పుణ్యకార్యాలను, వాటి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వైశాఖ మాసం చాలా పుణ్యమైన మాసం. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు, స్నానాలు, దానాలు, జపాలు చాలా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ మాసంలో గంగా స్నానం చేయడం చాలా పుణ్యకరం. గంగా నదిలో (Ganga River) స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
అంతేకాకుండా వైశాఖ మాసంలో దానం చేయడం కూడా చాలా పుణ్యకరం. ముఖ్యంగా బియ్యం, నెయ్యి, పెరుగు, శనగపప్పు, బెల్లం వంటి వాటిని దానం చేయడం మంచిది. ఈ మాసంలో లక్ష్మీదేవిని (Lakshmi Devi) పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. వైశాఖ పురాణం – 5 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 5) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 5
వైశాఖ పురాణం – వైశాఖ ధర్మ ప్రశంస
నారద మహర్షిని (Narada Muni) అంబరీష మహారాజు “మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటు కొని చేయు అభ్యంగ స్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచు పాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని ఉద్దేశ్యము కాదు. వ్రతమును ఆచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీ అకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకుల యందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు – బంగారు, వెండి పాత్రలలోను, సామాన్యులు కంచు పాత్రలలోను ప్రాత కాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహ స్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి (Onion)మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. రెండు మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.
వైశాఖ మాస వ్రతమును పాటించు వాడు తామరాకున (Lotus Leaf) భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాస వ్రతము పాటించువారు, ఎండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా (Lord Vishnu) భావించి అతని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై జల్లు కొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లు కొనిన గంగ మున్నగు సర్వతీర్థముల నందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.
విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకుల యందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున బుట్టి తరువాత జన్మయందు కంచర గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహ స్నానము చేసినచో నీచ జన్మనందును. వైశాఖమున బహి స్నానము నదీ/తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక (Dog) జన్మము పొందును. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖ మాస వ్రత ఆచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాప దుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము.
శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానము ఆచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున (Early Morning) సముద్ర స్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి (Saraswati River), కావేరి (Kaveri River), నర్మద (Narmada River), కృష్ణవేణి అని గంగానది (Ganga River) ఏడు విధములుగ ప్రవహించి సప్త గంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్త గంగలలో ప్రాతఃకాల స్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతః కాలమున చేసినవారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున (లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వ తీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని అందు స్నానమాడవలెను.
రస ద్రవ్యములలో క్షీరము (Milk) ఉత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగు కంటె నెయ్యి (Ghee) ఉత్తమము. నెలలలో కార్తిక మాసము (Karthika Masam) ఉత్తమము. కార్తికము కంటె మాఘమాసము (Magha Masam) ఉత్తమము. మాఘము కంటె వైశాఖము (Vaisakha Masam) ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వట వృక్షము వలె మరింతగా పెరుగును.
కావున నిట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధా శక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధా శక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యము అనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రత దానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధా శక్తిగ దానము చేయుట ఏట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్న వారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో ఎన్ని అలంకారములు ఉన్నను పైకప్పు లేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖ వ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖ మాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్త ప్రేమను కలిగియున్నను, వైశాఖ వ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము.
అనగా సర్వ శుభలాభములనంది యువతులును వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ వ్రతము ఏన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచో అన్నియు వ్యర్థములగును సుమా! శాక సూపాదులు (కూర పప్పు) యెంత ఉత్తమములైనను, ఎంత బాగుగ వండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను.
సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాప క్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థ యాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, ఇంద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖ స్నానమాత్రముననే సర్వ దోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.
వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |
ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||
పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము ఈయవలయును.
వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |
అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||
గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||
ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||
అని ప్రార్థించి అర్ఘ్యములను ఇచ్చి స్నానమును ముగించు కొనవలెను. పిమ్మట మడి / పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను / చదవవలెను. ఇట్లు చేసినచో మును జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోక వాసులైనను, పాతాళలోక వాసులైనను ఏచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భ వాసము స్తన్య పానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.
వైశాఖమున కంచు (Brass) పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.
తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన ఆధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడ వీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి ‘హరి’ యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్నా శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని ‘శవము’ వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఏట్లైనను సేవింపనివాడు పంది జన్మనెత్తును.
పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీ దళములతో శ్రీమహావిష్ణువు అర్చించి విష్ణు కధా శ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.
వైశాఖ పురాణం పంచమ అధ్యాయము సంపూర్ణం.
Read more Puranas: