వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 27

వైశాఖ పురాణం – 27వ అధ్యాయం – కలి ధర్మములు – పితృ ముక్తి

Vaisakha Puranam - Day 27

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 27వ అధ్యాయం కలి యుగంలోని ధర్మాలు, పితృదేవతల ముక్తి గురించి వివరిస్తుంది. నారదుడు ఈ విషయాలను అంబరీషుడికి వివరిస్తాడు. కలి యుగంలో (Kaliyug) ధర్మాలు తక్కువవుతాయి, అధర్మాలు ఎక్కువవుతాయి. ప్రజలు సత్యం, దయ, క్షమ వంటి మంచి లక్షణాలను వదులుకుని, అహంకారం, ద్వేషం, లోభం వంటి చెడు లక్షణాలను పెంచుకుంటారు. దీనివల్ల పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు (Pinda Pradanam) వంటివి సరిగ్గా జరగక, వారి ముక్తి కష్టమవుతుంది.

కానీ కొన్ని పద్ధతుల ద్వారా కలి యుగంలో కూడా పితృ ముక్తి సాధ్యమే. అమావాస్య (Amavasya), పితృ పక్షం (Pitru Paksha) వంటి రోజుల్లో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. మరణించిన వారి పదవ రోజున పిండ ప్రదానం చేయడం కూడా వారికి శాంతిని ఇస్తుంది. గోదానం (Godanam) చేయడం, పితృ యజ్ఞాలు చేయడం, పేదలకు, అనాథలకు దానాలు చేయడం వంటివి కూడా పితృ ఋణ తీర్చుకోడానికి, పితృ దోషాలు పోవడానికి సహాయపడతాయి. వైశాఖ పురాణం – 27వ అధ్యాయం (Vaisakha Puranam – Day 27) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 27

వైశాఖ పురాణం – 27వ అధ్యాయం – కలి ధర్మములు – పితృ ముక్తి

నారద మహర్షి (Narada Muni) అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి ‘మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.

అప్పుడు శ్రుత దేవుడు శ్రుతకీర్తి మహారాజా! సూర్యుడు మేషరాశి (Mesha Rasi) యందుండగా వైశాఖ మాసమున (Vaisakha Masam) వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని ఏకాదశినాడు (Ekadashi) చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్య ప్రదమైన దానమును చేయుట వలని ఫలితము, అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము (Harikatha) ఇవన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేని వాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.

పవిత్రమగు వైశాఖ (Vaisakha) మందలి దినములను జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపము నందును. శరీరారోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వ పుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని (Sri Hari) సేవింప వారెవరుందురు? ఎవరును ఉండరని భావము.

దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు( భార్యలేనివారు), స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధా శక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వ ధర్మకార్య ఫలప్రాప్తికిని మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను స్నాన దానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖ మాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరక లోకములను పాపాత్ములై చేరుదురు, సందేహము లేదు. 

పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వ పుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశి యందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృ దేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును. ఆ తిధి నాడు పితృ దేవతలకు తర్పణాది శ్రాద్ధమును (Tarpan Shraddha) చేసిన గయలో (Gaya) కోటి మార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరక లోకమున పితృ దేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.

ముప్పది కలి యుగములు (Kali Yuga) గడచిన తరువాత సర్వ ధర్మవిహీనమగు ఆ నర్త దేశమున ధర్మ వర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పది ఒకటవ కలి యుగమున ప్రధమ పాదమున ప్రజలందరును వర్ణ ధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌన వ్రతముతో మునులు సత్ర యాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచటికి చేరెను.

అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృత యుగమున సంవత్సర కాలమున నియమ నిష్ఠలతో భక్తి శ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున (Dwapara Yuga) ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పది రెట్ల పుణ్యము కలి యుగమున శ్రీమహావిష్ణువును (Lord Vishnu) స్మరించినవచ్చును. కావున కలి యుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయా పుణ్యములు, దాన ధర్మములులేని యీ కలి యుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్య లోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.

ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయ సాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలి యుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలి యుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషమును ఆపుకొనలేక పోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. 

కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు ఇట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమయినది. కావున మీరీ దేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకు ఇష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.

ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు అతడు దండ కమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడ తలచి భూలోకమునకు వచ్చెను.

భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథా ప్రాయములైనవి. శుభక్రియలు సామాన్య క్రియలైనవి. భూత ప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పు వారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. 

మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు (Brahmin) దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. 

పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది (Surya Grahan)సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయ పడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్ది లోనున్న వారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువ జాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.

జలగ స్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సార హీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. 

అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణు సేవ, శాస్త్ర చర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దాన ధర్మములు కలి యుగమున ఎచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగ నుండెను.

ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశ నాశమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్ట తరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమ పడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక ఎలుక పితృ దేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేసెను. గడ్డి పరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికి వేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.

ధర్మవర్ణుడును దీనులైయున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్స గోత్రీయులము (Srivatsa Gothram). భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. 

ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచటను ఇది ఓకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృ లోకముననున్న మాకును ఈ గడ్డి పరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేక పోవుట వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక (Rat) ఈ గడ్డిని ప్రతి దినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ ఎలుక మిగిలిన ఈ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.

కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికి ఈ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు ఇందు పడగలవు. కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశ వృద్దిని చేసి మమ్ము నూతిలో (Well) పడకుండ రక్షింపుమని చెప్పుము. 

పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండ ప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగునవి చేయవచ్చును. ఇందు వలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగు అవకాశమున్నది. మా వంశము వారిలో నెవడైన పాపనాశినియగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును.

తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మ విహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.

ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై ఇట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసిన వాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలి యుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణు (Vishnu) భక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలి యుగమున పాప భూయిష్ఠులగు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున నివసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. 

నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధలు కలుగకుండ సంసార బాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.

ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డి పరకను పట్టుకొని ఎట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణు కథలయందనురక్తి, స్మరణము, సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిలగాని, భారతము గాని ఇంటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘ స్నాన (Magha Snan) వ్రతము, కార్తీక దీపదానము (Karthika Deepam)పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తి ప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. 

ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జల పూర్ణమగు కలశము నిచ్చి పిండ ప్రదానము చేసినచో గయా క్షేత్రమున చేసిన దానికి కోటి రెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు (Chaitra Amavasya/ Somvati Amavasya) శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయమును ఇచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును. ఆనాడు కలశ దానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభ దానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోష పెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.

ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతః కాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జల కలశ దానము శ్రాద్దము (Shraddha) మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.

వైశాఖ పురాణం  27 వ అధ్యాయం సంపూర్ణం.

Read more Puranas:

Leave a Comment