వైశాఖ పురాణం – 24వ అధ్యాయం – వాయు శాపము
వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 24వ అధ్యాయం ధర్మరాజు అయిన అంబరీషుడి కథను వివరిస్తుంది. అంబరీషుడు ఎంతో ధార్మికంగా, న్యాయంగా పాలించే రాజు. ఒకసారి, కఠినమైన వైశాఖ వ్రతాన్ని(Vaisakha Vrut) ఆచరించాలని నిర్ణయించుకుంటాడు. ఈ వ్రతంలో భాగంగా నెల రోజులు ఉపవాసం, జాగరణలు, స్నానాలు వంటి క్రతువులు పాటించాలి.
అంబరీషుడి భక్తిని పరీక్షించాలని వాయుదేవుడు నిర్ణయించుకుంటాడు. రాక్షసులను పంపించి రాజును బాధించమని ఆదేశిస్తాడు. కానీ, రాజు యొక్క శక్తి, భక్తి ముందు రాక్షసులు ఓడిపోతారు. చివరికి, స్వయంగా వాయుదేవుడు (Vayu deva) రాజును పరీక్షించడానికి వస్తాడు. రాజు యొక్క ధైర్యం, భక్తి చూసి మెచ్చుకున్నా, రాజు తన రాజ్యంలోని ప్రజలందరికీ ఒకేసారి అన్నం పెట్టాలని శాపం ఇస్తాడు. రాజ్యంలో ఎక్కువ మంది ప్రజలు ఉండటంతో ఇది చాలా కష్టమైన పని.
ఈ శాపం నుండి విముక్తి పొందడానికి అంబరీషుడు ఎంతో ఆందోళన చెందుతాడు. తన గురువులను సంప్రదించగా, వారు మరింత కఠినంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించమని సలహా ఇస్తారు. రాజు వారి మాట విని, పూర్తి నిష్టతో వ్రతాన్ని పాటిస్తాడు. అంబరీషుడి భక్తికి మెచ్చిన విష్ణు భగవానుడు (Lord Vishnu), లక్ష్మీదేవిని (Lakshmi Devi) పంపించి రాజుకు సహాయం చేస్తాడు. లక్ష్మీదేవి రాజ్యంలో అవసరమైన అన్ని పదార్థాలను సృష్టిస్తుంది. దాంతో అంబరీషుడు అందరికీ అన్నం పెట్టి వాయు శాపం నుండి విముక్తి పొందుతాడు. వైశాఖ పురాణం – 24వ అధ్యాయం (Vaisakha Puranam – Day 24) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 24
వైశాఖ పురాణం – 24వ అధ్యాయం – వాయు శాపము
అంబరీషునితో నారదుడు (Narada Muni) ఈ విధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను…
శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయ ఉంచి చెప్పగోరును అని శంఖ మహాముని సవినయముగ నడిగెను.
శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాప రహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మ (Lord Brahma) మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు. చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి (Sri Hari) స్థానము పోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధ మోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మ వలననే జరుగును.
ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మ యగు శ్రీమన్నారాయణుని (Srimannarayana) అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వ వ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు (Veda), స్మృతులు, పురాణములు (Purana), ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము (Bharata) మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరు విధములచే తెలిసికొనజాలము.
కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేద వేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని ఇంద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొన శక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వ శక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.
బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఏరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులు ఉండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు (Gandharva) నూరు రెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వుల కంటె నూరు రెట్లు గొప్పవారిని ఎఱుగుము. అట్టి దేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షుల (Saptarshi) కంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు (Lord Sun), సూర్యుని కంటె గురువు (Teacher), గురువు కంటె ప్రాణము, ప్రాణము కంటె ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.
ఇంద్రుని కంటె గిరిజాదేవి (Girija Devi), ఆమె కంటె జగద్గురువగు శివుడు (Lord Siva), శివుని కంటె మహాదేవి యగు బుద్ది, బుద్ది కంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారము అని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును.
ఆ లక్ష్మీదేవి (Lakshmi Devi) శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయ చేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువు కంటె గొప్పది సమానమైనది ఏదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటి కంటె గొప్పదో, ప్రాణము కంటె విష్ణువు గొప్పవాడో వివరింపుము అని శంఖమునిని ప్రార్థించెను.
అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగ ఇంద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి.
కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియు అనక మౌనముగ ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.
అప్పుడు శ్రీహరి నవ్వుచు “విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.
స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవము నుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచు నుండెను తరువాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్త హీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను కాని వినుట మున్నగు వానిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు.
పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు గాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.
శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.
ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది ఇదియును లేదు. ప్రాణము కంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణ దేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహు స్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.
ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరి వశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు (Rudra), ఇంద్రుడు (Lord Indra) మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశ వహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.
అప్పుడు శంఖ మహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదుల యందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగముల చేసి సేవింపదలచి గంగా తీరమునకు బోయెను.
నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతి యుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.
ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండనున్న వానిని ఇట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.
వైశాఖ పురాణం 24 వ అధ్యాయం సంపూర్ణం.
Read more Puranas: