వైశాఖ పురాణం – 23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
వైశాఖ పురాణం (Vaisakha Puranam) 23వ అధ్యాయం ఆధ్యాత్మిక జీవితంలో పశ్చాత్తాపం, మార్పు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ప్రశాంతమైన ముని శంఖుడు అడవిలో నివసిస్తూ ఉండేవాడు. ఒక రోజు అతను దుష్ట స్వభావం కలిగిన కిరాతుని కలుస్తాడు. తన జీవితంలోని అసంతృప్తి గురించి కిరాతుడు శంఖుడితో ఫిర్యాదు చేస్తాడు. శంఖుడు కిరాతునికి అతని దుస్థితికి కారణం వివరించాలని నిర్ణయించుకుంటాడు.
కిరాతుని పూర్వజన్మ (Rebirth) వివరాలను శంఖుడు తెలియజేస్తాడు. గత జన్మలో కిరాతుడు రాజు. అహంకారంతో, దుర్మార్గాలతో నిండి ఉండేవాడు. ఎన్నో పాపాలు చేసి, చివరికి యుద్ధంలో మరణించాడు. పాపాల ఫలితంగా ఈ జన్మలో కిరాతుని జన్మ ఎత్తాల్సి వచ్చింది. తన దుస్థితికి తానే కారణమని కిరాతుడు తెలుసుకుంటాడు. శంఖుడి బోధనలకు కదిలి, తన తప్పులను గుర్తించి పశ్చాత్తాప పడతాడు. జీవితాన్ని మార్చుకునేందుకు కిరాతుడు నిర్ణయించుకుంటాడు. శంఖుడి శిష్యుడై వైశాఖ వ్రతాన్ని (Vaisakha Vrut) ఆచరించడం ద్వారా మంచి మార్గంలో నడవడం ప్రారంభిస్తాడు. వైశాఖ పురాణం – 23వ అధ్యాయం (Vaisakha Puranam – Day 23) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 23
వైశాఖ పురాణం – 23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
నారదుడు (Narada Muni) అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించెను.
కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములగు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనుల తోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని.
నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూత దయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదము ఉండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!
గంగానది (Ganga River) జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయ జూపుము అని కిరాతుడు బహు విధముల శంఖుని ప్రార్థించెను.
శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖ మహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.
కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖ (Vaisakha) ధర్మములను ఆచరింపుము. ఈ ఎండా నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడ యందుండి సర్వ పాపనాశకమైన విష్ణు (Lord Vishnu) ప్రియకరమైన వైశాఖ మహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.
అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఇన్నియో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును (Lake) జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు (Swans) మున్నగు జల పక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు (Bamboo Trees) గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు (Turtles), చేపలు మున్నగు జల ప్రాణులతో నా సరస్సు కూడి ఉండెను. కలువలు, తామరలు (Lilies and lotuses) మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను.
వివిధములగు పక్షులచట వ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేద తీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి (Sri Hari) నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకి ఇచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల చూచి ఇట్లనెను.
నాయనా కిరాతా! ధర్మ తత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస (Vaisakha Masam) ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానిని ఆచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభ లాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.
అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.
ఓయీ! నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్సస గోత్రుడవు (Srivatsa Gotra) . వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతి అగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.
ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది. ఓయీ కిరాతా! ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి.
నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతి అగు భార్యను సుఖ పెట్టలేని వాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని అనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు ‘నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధన హీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది.
వ్యాధి గ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో (Buffalo Yogurt) సమర్పింతును. గణేశునకు (Lord Ganesha) కుడుములను నివేదింతును. పది శనివారములు ఉపవాసమును చేయుదును. మధుర ఆహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహు విధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.
ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములనిన ఇష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీ అనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి.
నీవు మరణించుచు నిన్ను విడిచి పోయిన వేశ్యను పలు మార్లు తలుచుకొంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.
నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణు లోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమును ఇచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడు అనుకోనియు పానకమును ఇచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది.
దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో ఈ విధముగ సాంగత్యము చేయు అవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలిసికొనవలయునని ఉన్నదో దానిని అడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.
వైశాఖ పురాణం 23 వ అధ్యాయం సంపూర్ణం.
Read more Puranas: