వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 2

వైశాఖ పురాణం – 2 వ అధ్యాయం

Vaisakha Puranam - Day 2

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క రెండవ అధ్యాయం “వైశాఖ మాసంలో చేయవలసిన వివిధ దానాలు, వాటి ఫలితాలు”  గురించి వివరిస్తుంది. ఈ మాసంలో చేసిన దానాలు చాలా పుణ్యప్రదమైనవి, శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. జలదానం, అన్నదానం, గోదానం, వస్త్రదానం వంటి వివిధ రకాల దానాల గురించి ఈ అధ్యాయం వివరిస్తుంది. ప్రతి ఒక్క దానం యొక్క ప్రాముఖ్యత, దాని ఫలితాలను కూడా వివరిస్తుంది. జలదానం వల్ల పాపాలు తొలగిపోతాయని, అన్నదానం వల్ల పుణ్యం పెరుగుతుందని, గోదానం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతుంది.

ఈ అధ్యాయం చివరిలో, వైశాఖ మాసంలో (Vaisakha Masam) దానాలు చేయడం యొక్క మహాత్మ్యం గురించి నారదుడు (Narada Muni) అంబరీషుడికి వివరిస్తాడు. దానం చేయడం వల్ల శ్రీ విష్ణువు (Lord Vishnu) సంతోషిస్తాడని, దాతకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతాడు. వైశాఖ పురాణం – 2 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 2) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 2

వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు – వాని ఫలితములు

“వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ ।

శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥”

నారదమహర్షి (Narada Muni) అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో (Vaisakha Masam) సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదం (Veda) సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు(Ganga Jal) సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.

నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనం తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానము అగు అభివృద్ధి, శ్రీమహావిష్ణు (Lord Vishnu) సమానమైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.

శేషశాయియగు శ్రీమహా విష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇటువంటి మాసమును వ్రతమును పాటించక వ్యర్థముగ గడపిన వాడు ధర్మ హీనుడగుటయే కాదు, పశు పక్ష్యాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపని వాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞ యాగాదులను చేయుట మున్నగు వాటిని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును (Vrut) పాటించువానికి మాధవ అర్పితములను కావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కావున నియమ పూర్వకమైన వైశాఖ మాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను (Reincarnation) పోగొట్టును అనగా ముక్తిని ఇచ్చును.

అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వ తీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జల దానము చేసిన అంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకుండా ఉన్నచో అట్టి శక్తి కల మరి ఒకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానమును అన్నిటిని ఒక వైపునను జల దానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది యగును.

బాటసారుల దప్పిక తీరుటకై మార్గమునందు చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో అతని కులములోని వారందరును పుణ్య లోకములను అందుదురు. జల దానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వ దేవతలు, పితృ దేవతలు అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములను ఇచ్చుదురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడినవాడు నీడను కోరును. చెమట పట్టినవాడు విసురు కొనుటకు విసన కఱ్ఱను కోరును.

కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును (నీరుకల కలశమును), గొడుగును, విసన కఱ్ఱను దానము ఇవ్వవలెన. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షియై (చాతకమను పక్షి) భూస్పర్శ కల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు జన్మించును.

దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసిన అంత  పుణ్య ఫలము కలుగును. ఎండకు డస్సిన వానికి విసన కఱ్ఱతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై  త్రిలోక సంచార లాభము అందును. అట్లు జలము ఇవ్వని వారు బహు విధములైన వాత రోగములతో  పీడితులగుదురు. ఎండకు డస్సినవానికి విసురుటకు విసన కఱ్ఱ లేనిచో పై బట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుజ్యము నందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసన కఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టు నట్టి విసన కఱ్ఱను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.

గొడుగును (Umbrella) దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానము ఇచ్చినవాడు యమ దూతలను తిరస్కరించి విష్ణు లోకమును చేరును మరియు ఇహ లోకమున బాధలను పొందడు, సర్వ సుఖములనందును. చెప్పులు లేక బాధ పడువానికి, చెప్పులు లేవని అడిగినవానికి చెప్పులను దానము చేసిన వాడు బహు జన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిధిగ వచ్చిన వానిని ఆహారము ఇచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును.

అంబరీష మహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగ కుశలమడిగి యాదరించినవానిని పుణ్యము అనంతము. ఆకలి కల వానికి, భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి ఇష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్న దానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి జల దానము, చత్ర దానము, వ్యజన దానము, పాదుకా దానము, అన్నదానము మున్నగున వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థలను పొందుదురు.

కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని (Parents) తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్న దానము చేసి జీవితమును నిలిపిన వాడు తల్లిదండ్రుల కంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు (వాటిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు (వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు (అన్ని ధర్మములను ఆచరించిన ఫలము) కలుగునని బావము. 

 వైశాఖ పురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం|

Read more Puranas:

Leave a Comment