వైశాఖ పురాణం – 17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 17వ అధ్యాయం యమధర్మరాజు యొక్క లోలో ఆవేదనను వివరిస్తుంది. 16వ అధ్యాయంలో ఓడిపోయిన యమధర్మరాజు, తన పాత్ర తగ్గిపోతుందే భయంతో ధర్మబద్ధంగా పాలించిన రాజుపై యుద్ధం చేసి ఓడిపోవడం వల్ల మనస్తాపం చెందుతాడు. తన దుఃఖాన్ని పోగొట్టడానికి చిత్రకూట మహర్షిని దర్శిస్తాడు.
చిత్రకూట మహర్షి యమ ధర్మరాజుకు (Yama Dharmaraja) ధర్మం గురించి వివరిస్తాడు. మరణం అనేది ప్రకృతి నియమం, అందరూ ఒకప్పుడు చనిపోతారని, వారు ధర్మం ఆచరించడం ద్వారా మరణానంతర శాంతిని పొందుతారని తెలియజేస్తాడు. మహర్షి యొక్క బోధనలతో యమధర్మరాజుకు ధైర్యం వస్తుంది. తన ధర్మాన్ని సక్రమంగా నిర్వహించడానికి, ప్రజలకు న్యాయం అందించడానికి మరింత కృషి చేస్తాడు అని ఈ అధ్యాయం చెబుతుంది. వైశాఖ పురాణం – 17 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 17) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 17
వైశాఖ పురాణం – 17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
నారదుడు (Narada Muni) అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహా రాజునకు శ్రుత దేవుడు తరువాతి కథని ఇట్లు వివరించెను. వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను.
స్వామీ! సర్వలోక పితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతి తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలకాలముండి కాకి (Crow) మున్నగు జన్మలనెత్తును.
తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు ఎలుక జన్మనెత్తి మూడు వందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక ఇంటియందూరక నుండు వాడు పిల్లిగా జన్మించును. ప్రభూ! మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర (Dharma Shastra) నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాతించలేని స్థితిలోనున్నాను.
కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్యమును నిర్వర్తింపలేకున్నను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస (Vaisakha Masam) వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగ సాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము (Pranayama) చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరి ఇంకను పెక్కు పాపములను చేసినవారు అట్టి వారందరును వైశాఖమాస వ్రత (Vrut) ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణు లోకమును చేరుచున్నారు.
వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టిక లోని యమ పాపములను తుడచి వేయునట్లు చేసి విష్ణు లోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లి వైపువారు మొత్తము ఇరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. వీరుకాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు.
ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము ఇరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ (Prayag) పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించిన వారు, భృగుపాతము చేసినవారు, కాశీ (Kasi) క్షేత్రమున మరణించిన వారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖ వ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము.
వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణు (Lord Vishnu) పూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును (Vishnu Loka) చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారు వీరు అన నేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.
సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవ బడిన ఈ పాప పట్టిక యమ దండము వీనిని నీ పాదముల కడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎండులకు ఎట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము.అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.
కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడుకదా! ఇట్లు నా వ్రాత నెవరును యింతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు (Lord Brahma) వివరించెను.
వైశాఖ పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం.
Read more Puranas: