వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 10

వైశాఖ పురాణం – 10 వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము కామదహనము

Vaisakha Puranam - Day 10

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క పదివవ అధ్యాయం దక్షయజ్ఞ నాశం, కామదహనం గురించి వివరిస్తుంది. సతీదేవి యజ్ఞ వేదికలో తన ప్రాణాలను కోల్పోవడం తో కోపోద్రిక్తుడైన శివుడు(Lord Siva), వీరభద్రుడు అనే రుద్రుడిని సృష్టించి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు భయంకర రూపంతో యజ్ఞ శాలకు (Yagna Shala) వెళ్లి, అక్కడ ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులను చంపడం ప్రారంభిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు (Lord Indra) వంటి దేవతలు కూడా వీరభద్రుడి శక్తికి భయపడి పారిపోతారు.

చివరగా, బ్రహ్మ (Brahma), విష్ణువులు (Lord Vishnu) శివుడి వద్దకు వెళ్లి వేడుకుని, వీరభద్రుడిని శాంతపరుస్తారు. దక్షుడిని బ్రహ్మ మేక ముఖంతో పునర్జీవితం చేస్తాడు. కామదేవుడు సతీదేవి మరణంతో తన శక్తిని కోల్పోతాడు. దక్షయజ్ఞ నాశం, కామదహనం చాలా ధాటిగా, ఉద్వేగభరితంగా సాగే ఈ అధ్యాయం పురాణాలలో చాలా ప్రసిద్ధి చెందింది. వైశాఖ పురాణం – 10 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 10) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 10

వైశాఖ పురాణం – 10 వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము కామదహనము

రుద్రుడు (Rudra) ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకర ఆకారుడై వేయి బాహువులుకల మహా బలశాలి యగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడును (Lord Parameshwara) నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూత సంఘములను వీరభద్రుని వెంట పొండని పంపెను.

ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు (Veerabhadra), వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞ శాలను చేరి అచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహా వీరులను అందరను కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీ దేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము కావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞ శాలలోని వారిని భంగ పరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.

బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రదికింపజేసెను, శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము (Goat) నమర్చి బ్రదికించెను, మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.

యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున (Ganga River) పున్నాగ వృక్షము క్రింద తపము ఆచరించు కొనుచుండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.

ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వర గర్వితుడై సర్వలోకములను, సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను, తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.

దేవతలు వాని వలని బాధలను భరింప జాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపుమని బహు విధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్ర పత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఎప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను (Parvati) పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానమును ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపెను. దేవతలు అందరును ఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును, మనధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.

ఇంద్రుడు – నారదుని జూచి నారదమహర్షీ (Narada Muni)! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వ జన్మలో పరమ శివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వ జన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని వద్దకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి (Parvati Devi)వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.

నారదుని పంపిన తరువాతఇంద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలు అయినప్పుడు నీవు మోహ బాణములను ప్రయోగింపుము.శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమము ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను, భార్య అగు రతీ దేవితోను (Rati Devi), మలయానిలాది పరివారముతోను శివుడున్న తపో భూమికి పోయెను.

అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము, మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనస్సు ఇట్లు చంచలమగుట ఏమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.

బాణ ప్రయోగమొనర్పబోవు మన్మధుని (Kamadeva / Manmatha) జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతి – శివుడు తమను కూడ శిక్షించునేమో? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.

మన్మధుడు చేసిన పని దేవతలకు, శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంక ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శ్రుతకీర్తి మహారాజు! ఇక్ష్వాకు వంశమువాడైన (Ikshvaku Dynasty) హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని, అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి శునకాది హీన జన్మలను ఎత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.

పరమ పుణ్య ప్రదమైన ఈ కధను, రాత్రిగాని, పగలుగాని ఎవరు విన్నను, జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.

వైశాఖ పురాణం పదవ అధ్యాయం సంపూర్ణం.

aasdssd

Leave a Comment