వైశాఖ పురాణం – 1 వ అధ్యాయం
వైశాఖ పురాణంలోని (Vaisakha Puranam) మొదటి అధ్యాయం “వైశాఖమాస ప్రశంస”. వైశాఖ పురాణం యొక్క మొదటి అధ్యాయం వైశాఖ మాస ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పవిత్ర మాసం శ్రీ విష్ణువుకు (Lord Vishnu) అత్యంత ప్రీతికరమైనది అని, పుణ్యకార్యాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసిన స్నానం, జపం, దానం, పుణ్యతీర్థ యాత్రలు (Tirtha Yatra) మొదలైనవి పాపాలను తొలగించి, అన్ని శుభాలను చేకూర్చుతాయి. అక్షయ తృతీయ (Akshaya Tritiya), పూర్ణిమ (Purnima), చతుర్థి (Chaturthi) వంటి ఈ మాసంలోని ముఖ్యమైన రోజుల గురించి కూడా ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ రోజులలో చేసే పూజలు, వ్రతాలు మరింత శుభప్రదాలని చెబుతుంది. వైశాఖ పురాణం – 1 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 1) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 1
వైశాఖమాస ప్రశంస
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుము రాజర్షి అగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని చూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము (Vaisakha Masam) మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.
నారదుడును (Narada Muni) రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వము ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింప కోరితిని. బ్రహ్మయు ‘నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి (Lakshmi Devi) మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము (Karthika Masam), మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములను అన్నిటిని నశింపజేయును.
ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవించెదరు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు.
సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషము పొందినట్లు శ్రీమహా విష్ణువు వైశాఖ స్నానము ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడు అయి విష్ణు లోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారము రోజులు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీ హరి అనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చు అంతటి పుణ్యము అందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగ ఉన్నచో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము అందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.
అంబరీష మహారాజా! సర్వలోకముల నందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమున ఉన్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అటువంటి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమున అధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమున ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయము అయిన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోయెదరు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.
వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.
Read more Puranas: