Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము తొమ్మిదవ రోజు

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల తొమ్మిదవ పాశురము ఈ క్రింది విధముగా . . .
Thiruppavai Pasuram – Day 9
తిరుప్పావై 9వ రోజు పాశురము
పాశురము:
తూమణిమాడత్తు చ్చుట్రుం విళక్కెరియ,
తూపం కమళ’ త్తుయిలణై మేల్ కణ్వళరుం,
మామాన్ మగళే మణిక్కదవం తాళ్ తిఱవాయ్,
మామీర్ అవళై ఎళుప్పీరో, ఉన్ మగళ్ తాన్
ఊమైయో ? అన్ఱి చ్చెవిడో, అనందలో ?,
ఏమ ప్పెరుందుయిల్ మందిరప్పట్టాళో ?,
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెనృ,
నామం పలవుం నవిన్ఱేలోరెంబావాయ్ ॥ 9 ॥
Credits: @BharatiyaSamskruthi
భావము:
ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. “తూ” పరిశుద్దమైన “మణి” మణులతో చేసిన “మాడత్తు” మేడ, “చ్చుత్తుం విళక్కెరియ” చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింప చేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం (Vedam), ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది.
ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం (Deepam) వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. “దూపం కమళ” దూపం పరిమళిస్తుంది. “త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్” నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. “మామాన్ మగళే!” ఓ మామగారి కూతురా! “మణి క్కదవం తాళ్ తిఱవాయ్” మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో (Sanskit) వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు.
ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.
1. మనందరిని తండ్రి ఆయనే
2. మనందరిని రక్షించేవాడు ఆయనే
3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు
4. మనందరిని భరించేవాడు ఆయనే – భర్త అంటారు
5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు
ఆయనే-జ్ఞేయము అంటారు
6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే
7. మనందరికి ఆధారం ఆయనే – నారాయణుడు అంటారు
8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే – అంతర్యామి అంటారు
9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే
లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ, నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం. అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! “పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా” అష్టాక్షరీ (Ashthakshari) మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో (Bhagavad Gita) ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక (Gopika) వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమళాల వంటిది.
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాల్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు, దీన్ని పోశించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలేయ్యాలి అని ఇలా దేహ బ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్శనమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర (Mantra) ఆచరణ ద్వారా జ్ఞానులు తెరువాల్సిందే.
“మామీర్!” ఓమెనత్తా, “అవళై ఎళుప్పీరో” మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. “ఉన్ మగళ్ తాన్ ఊమైయో” నీపిల్ల ఏమైనా మూగదా లేక “అన్ఱి చ్చెవిడో” చెవిటిదా లేక “అనందలో” అలసిపోయిందా “ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో” ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచెయ్యదు. అక్కడిని నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగి వాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటి వారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.
ఆయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.”మామాయన్” చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్శించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు.
ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు. ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు అయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, “మాదవన్” మా-లక్ష్మీదేవి దవ-నాథుడు, లక్ష్మీదేవి (Goddess Lakshmi Devi) సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన “వైకుందన్” వైకుంఠం (Vaikunta) అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ – త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా “ఎన్ఱెన్ఱు” ఎన్నెన్నో “నామం పలవుం నవిన్ఱ్” నామాలను పలుకుతున్నాం.
ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.
ఆండాళ్ తిరువడిగళ శరణం..శరణం
Also Read
- Thiruppavai Pasuram Day 1 | తిరుప్పావై పాశురము – 1వ రోజు
- Thiruppavai Pasuram – Day 2 | తిరుప్పావై పాశురము 2వ రోజు
- Thiruppavai Pasuram – Day 3 | తిరుప్పావై పాశురము – 3వ రోజు
- Thiruppavai Pasuram – Day 4 | తిరుప్పావై పాశురము – 4వ రోజు
- Thiruppavai Pasuram – Day 5 | తిరుప్పావై పాశురము – 5వ రోజు
- Thiruppavai Pasuram – Day 6 | తిరుప్పావై పాశురము – 6వ రోజు





