Thiruppavai Pasuram – Day 10 | తిరుప్పావై పాశురము – 10వ రోజు

Thiruppavai Pasuram 10

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల పదవ పాశురము ఈ క్రింది విధముగా . . .

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్ 

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం

తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో

ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే

తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్ ll 10 ll

Credits: @BharatiyaSamskruthi

ఆండాళ్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి, వైయత్తు వళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి, ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈ రోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు (Gopika)  కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం. 

మానవ జీవితం అనగా సుఖ దుఖాఃలు నదీ తరంగాలుగా ఒక దాని వెంట ఒకటి వస్తూనే వుంటాయి. సుఖమైనా దుఖఃమైనా ఎప్పటికి నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఖాఃలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో (Bhagavad Gita) శ్రీకృష్ణుడు (Sri Krishna) చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్ల నన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడ కూడదు. సుఖః దుఖాఃలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. 

మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు, దుఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి. మనకు వీటియందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయం గామారి క్రోదంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది. 

“నోత్తు” మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీ నోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. “చ్చువర్ క్కం పుగుగిన్ఱ” నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సకల లోకాలనన్నినింటిని తనలో చూపించాడు కదా, ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లే కదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. 

“తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః ” ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు. “అమ్మనాయ్” ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. “మాత్తముం తారారో” ఒక మాట మాతో మాట్లాడరాదా “వాశల్ తిఱవాదార్” తలుపులు తర్వాత తీద్దువుగాని, లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నీన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.

వీళ్ళు కృష్ణుడు లోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోప బాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. “నాత్తత్తుళాయ్ ముడి” లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం. 

లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడి నుండి వస్తాడు అని అంది. “నారాయణన్” అంతటా వ్యాపించిన వాడేకదా ఆయన, సకల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా! “నమ్మాల్ పోత్త ప్పఱై తరుం” దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులరందరికి అందేవాడు ఆయన. “పుణ్ణియనాల్” పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు. ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!”

“పండొరునాళ్” ఇదివరకు ఒకనాడు “కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం” మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు (Kumbhakarna). రాముడు (Sri Ram) అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకర్ణుడిని చంపలా, కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీప కాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా! బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. “తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో” ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.

ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుభంను కర్ణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది. అగస్త్యుడు (Agastya) అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని (Lord Shiva) వివాహానికి హిమాలయ పర్వతాన్ని (Himalaya) ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. 

వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం (Vindhya Mountains) ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది. మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-పర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. 

మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన. ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ (Grammar) సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది.

లోపల గోపబాలిక కృష్ణా అంటూ లేచింది, “ఆత్త అనందల్ ఉడైయాయ్!” పెద్ద బద్దకం కల దానా, “అరుంగలమే” అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారు కాదు. “తేత్తమాయ్ వందు తిఱవ్” తొందరగా సర్దుకొని రావమ్మా.

ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం.

Also read

Leave a Comment