9వ అధ్యాయం – శ్రావణ శుక్ల శుక్రవార “జీవంతికా వ్రత కథనం”

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుక్రవారం (Friday) నాడు చేయవలసిన “జీవంతికాదేవి వ్రతం” గురించి చెబుతాడు. దీని మహిమను వివరించడానికి, సుశీలుడు అనే రాజుకు సంతానం లేకపోవడంతో, అతని భార్య సుకేళి తాను గర్భవతినని కపట నాటకం ఆడుతుంది. తన పురోహితుని భార్యకు పుట్టిన మగబిడ్డను మంత్రసాని(Midwife) సహాయంతో తన బిడ్డగా స్వీకరిస్తుంది. పురోహితుని భార్యకు జరిగిన మోసం తెలిసి, ఆమె శ్రావణ శుక్రవారం నాడు జీవంతికాదేవి వ్రతం ఆచరించి, తన బిడ్డను రక్షించమని వేడుకుంటుంది. ఈ వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి ఆ బాలుడిని రక్షిస్తూ ఉంటుంది. ఈ బాలుడే ప్రియవతుడుగా పెరిగి పెద్దవాడై రాజ్యపాలన చేస్తాడు.
కాలక్రమంలో, ప్రియవతుడు గయలో (Gaya) పిండప్రదానం (Pinda Pradanam)చేయడానికి వెళ్ళినప్పుడు, పిండాన్ని స్వీకరించడానికి రెండు చేతులు చాచబడతాయి. దీనికి కారణం ఇద్దరు తండ్రులు ఉండడమే అని ఒక బ్రాహ్మణుడు చెప్పగా, ప్రియవతుడు ఆశ్చర్యపోతాడు. తిరిగి వస్తున్నప్పుడు, మార్గమధ్యంలో ఒక ఇంటిలో నిద్రించగా, జీవంతికాదేవి, పిల్లలను చంపే బాలగ్రహం మధ్య జరిగిన సంభాషణ ద్వారా తన అసలు తల్లి, ఆమె ఆచరించిన వ్రత నియమాలు తెలుసుకుంటాడు. రాజు తన తల్లిని కనుక్కోవడానికి ఒక పరీక్ష పెట్టి, పురోహితుని భార్యే తన జన్మనిచ్చిన తల్లి అని నిర్ధారించుకుంటాడు. అప్పుడు, జీవంతికాదేవి స్వప్నంలో కనిపించి, రాజు మేలుకోసమే ఈ నాటకం అంతా ఆడిందని చెబుతుంది. ఈ విధంగా జీవంతికాదేవి వ్రతం ఆచరించిన వారికి సమస్త శుభాలు కలుగుతాయని ఈశ్వరుడు (Eshwar) ఉద్ఘాటిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 9
శ్రావణమాస మహాత్మ్యము – 9వ అధ్యాయం
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరువాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఇక ముందు అమృతముతో సమానమగు శుక్రవార కథను చెప్పెదను వినుము. ఏ మనుష్యుడైనను శ్రద్ధగా ఆ కథను వినిన వాడు సమస్త కష్టముల వల్లను విముక్తుడగును.
ఓ మునీశ్వరా! ఇందు గుఱించి పూర్వము జరిగిన ఒక కధను చెప్పెదను వినము. పూర్వము పాండ్య వంశములో బుట్టిన సుశీలుడు అనెడు రాజు కలడు. ఆయన సంతానము లేని వాడై వ్రతములు, తపస్సులు, మొదలగనవి ఎన్ని ప్రయత్నములు చేసినను సంతానము కలుగలేదు. ఆ రాజునకు సమస్త గుణయుక్తురాలగు సుకేళి అను భార్య కలదు. ఆమెయు, తమకు సంతానము లేక పోవుటచే మిక్కిలి విచారము కలదియగుచు, స్త్రీ స్వభావముచే ఒక సాహస కృత్యమును చేసెను. అది ఏమనగా… తన నడుమునకు గుడ్డ పీలికలు జుట్టుకొని తాను గర్భముతో ఉన్నట్లు నటియింపుచు ప్రతి మాసమునకును అధికముగా ఉండు లాగున జుట్టు కొనుచు గర్భము కూడ పెరుగుచున్నట్లు తెలియపరచుచు, తనతో కూడ ప్రసవించుటకు సమాన నెలలు కలిగి యధార్థముగా గర్భముతోనున్న స్త్రీ యెచ్చట ఉండునాయని వెతకు చుండెను..
ఇట్లుండగా…దైవ వశమున ఆ రాజు గారి పురోహితుని భార్యయు గర్భము కలదాయెను. అప్పుడు, కపట కృత్యమును చేయదలచినదగుచు మంత్రసానిని బిలచి దానికి కొంత ద్రవ్యమునిచ్చి తాను చేయదలచిన కార్యము నందు నియమించి తాను అంతఃపురమున ఉండెను. అప్పుడు ఆ రాజు తన భార్య నిజముగా గర్భిణీయేనని తలచి, మిక్కిలి సంతోషము కలవాడై పుంసవనము, సీమంతము మొదలగు కృత్యములను ఆయా కాలముల యందు చేసెను.
అనంతరము, పురోహితుని భార్యకు ప్రసవ సమయము రాగానే, ఆ వార్తను రాజు భార్య విని మంత్రసానిని పిలిచి, కొంత కపట ఆలోచన చేసి, దానితో చెప్పి పంపగా, ఆ మంత్రసాని పురోహితుని (Purohit) ఇంటికి వెళ్లి ఆయన భార్యతో ఇలా చెప్పుచున్నది. ఓయమ్మా! నీకు ఇది మొదటి ప్రసవము అగుటవలన నీవు చాలా కష్టపడెదవని తలచి రాజు భార్య నన్ను పంపించగా వచ్చితిని. నీకు సుఖ ప్రసవము అగులాగున చేసెదనని చెప్పి, నీవు చూచుచుండిన బాధను సహింప జాలవు, గాన, కండ్లకు గుడ్డ కట్టవలయునవి గుడ్డ గట్టి ప్రసమైన పిమ్మట పుట్టిన మగ పిల్లవానిని ఎవరికిని తెలియనీయక రహస్యముగా తాను నియమించి యున్న ఒక మనుషి ద్వారా రాజుగారి భార్య వద్దకు పంపి, పిమ్మట ఆ బాహ్మణుని భార్య కండ్లకు గట్టిన గుడ్డనూడదీశెను. ఆ రాజు గారి భార్యయు అ పిల్లవానిని తీసుకొని నేను ప్రసవమైతినని ప్రకటన చేసెను.
ఈ బ్రాహ్మణుని భార్య నిజముగా ప్రసవించి యుండగా… శిశువు అచ్చట లేనందున ఆ మంత్రసాని ఇలా మాయోపాయము చేసినది. అది ఏమనగా తాను వచ్చునప్పుడు తెచ్చిన మాంసపు ముద్దను కనపరచి అమ్మా నీకు జనియించినది ఈ మాంసపు ముద్దయే, ఏమి నీ దురదృష్టము, సరియైన శిశువును జనియింపలేదు. ఇట్లు జరిగినందుకు నీ పెనిమిటిచే తగిన శాంతిని ఒనర్పుము. సంతానము లేక పోయినను పోనిమ్ము దైవ వశముచే నీవైనను బ్రతికితివి అంతే చాలును అని ఈ రీతిగా ఆ మంత్రసాని ఆశ్చర్యము, విచారము కలదానివలె కపటముగా నటియించెను. ఆ బ్రాహ్మణుని భార్యయు తనకు కలిగిన కొన్ని ప్రసవ గుర్తులచే, ఆ మంత్రసాని మాట నమ్మక సందేహించెను.
అనంతరము ఆ రాజు తనకు కుమారుడు కలిగెననెడు మాటవిని సంతోషము కలవాడై, ఆ శిశువునకు జాతకర్మ మొదలగు క్రియలను ఆచరించి, బ్రాహ్మణులకు ఏనుగులు, గుఱ్ఱములను, రథములను (Chariots), గోవులను, వెండి, బంగారము (Gold), మొదలగు అనేక దానములను చేసి, చెరసాలలో ఉంచబడిన ఖైదీలను విడిపించి, పురుడు వెళ్లిన పిమ్మట నామకరణ మొనరించి, ఆ పిల్ల వానికి ప్రియవతుడు అని పేరు పెట్టెను.
అనంతరము, ఆ బ్రాహ్మణుని భార్య మంత్రసాని చెప్పిన మాటలను నమ్మక తనను మోసపుచ్చినదని దలచి శ్రావణమాసములో “జీవంతికాదేవి వ్రతము”ను చేయ నిశ్చయించి, ఆ మాసము రాగానే ఒక గోడమీద జీవంతికా దేవి యొక్క ఆకారమును, మరి కొన్ని బాలుల ఆకారములను లిఖియించి, పుష్ప మాలికలతో పూజించి, గోధుమ పిండితో ఐదు జ్యోతులను చేసి వెలిగించి, షోడశోపచార పూజలను గావించి, నివేదనము చేసి – దయా సముద్రురాలవగు ఓ జీవంతికా దేవీ! నా పిల్లవాడు ఎక్కడ ఉండినను, వానిని నీవు రక్షింపుచుండుమని ప్రార్థించి, దేవి మీద అక్షతల నుంచి, యధా విధిగా ప్రదక్షిణ నమస్కారములను జేసి, కధను విని, పూర్వము తాను వెలిగించిన ఐదు జ్యోతులను భక్షించెను.
ఇట్లు ఆ బ్రాహ్మణుని భార్య చేసిన వ్రతము వలన జీవంతికా దేవి అనుగ్రహించి రాత్రింబగళ్లును పిల్లవానికి ఏమియు అరిష్టము సంభవింపకుండా రక్షింపుచుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట, ఆ రాజు మృతినొందగా తండ్రి యందు భక్తి కలిగినవాడై ఆ పిల్లవాడు ఆ రాజునకు పరలోక కృత్యముల నన్నియు చేసెను.
తండ్రి పోయిన పిమ్మట, మంత్రులు, పురోహితులు, మొదలగు వారు కుమారుడగు ప్రియవతునకు పట్టాభిషేకము గావించగా, అతడును అనురాగము ప్రజలకు అరాగము కలవాడై పాలించుచు కొన్ని సంవత్సరములు రాజ్యము జేసెను.
ఇట్లు కొంతకాలము రాజ్యము జేసి తండ్రి యొక్క రుణమును తీర్చుకొనుటకు గయలో పిండము వేయదలచిన వాడై వృద్ధులును, యోగ్యులగు మంత్రులకు రాజ్యము చెప్పగించెను. ఆనంతరము ఆ రాజు, తన రాజు వేషమును విడిచి కాశీ యాత్రకు వెళ్లేవాని వేషమును అవలంబించి కొంత దూరము వెళ్లగా, ఒక గ్రామములో ఒక గృహస్థుని ఇంట ఒక దినమున ఉండెను. ఆ గృహస్థుని భార్యయు ప్రసవించి, ఆ దినమునకు ఐదు దినములాయెను. ఆ గృహస్థుని భార్యయు ఇది వరలో ఐదు పర్యాయములు ప్రసవించుటయు, ప్రసవించిన ఐదవ దినమందు షష్టి యను బాలగ్రహము వచ్చి పిల్లవానిని జంపుటయు ప్రతి ప్రసవమునకు జరుగుచుండెను.
ఆ రాజు వెళ్లిన దినము ప్రసవించిన దినమునకు ఐదవ దినమైయుండుట వలన పూర్వము వలెనే పిల్ల వానిని జంపుటకు రాజు నిద్రించుచుండగా షష్టి యను బాలగ్రహము వచ్చినది. అప్పుడు, జీంవంతికా దేవి వచ్చి, అచ్చట ప్రియవ్రతుడు అను రాజు పరుండి యున్నాడు ఆయనను అతిక్రమించి నీవు వెళ్ల కూడదు అని జీవంతికా దేవి ఆటంక పెట్టగా ఆ బాలగ్రహము పిల్లవానిని చంపక తిరిగి వెళ్లెను. పూర్వము ప్రతి ప్రసవమునకు ఐదవ దినమందే శిశువు మరణించుటయు, ఇప్పుడు ఆవిధముగా జరుగక జీవించుటయు జూచి, ఇది యంతయు మన ఇంటికి వచ్చిన ఈ రాజు గారి మహిమ యని తలచి ఇట్లు ప్రార్థింప మొదలిడిరి.
ఓ రాజా! యీ దిన మందు మా గృహంబున నివసించి వెళ్లవలయును. ఏలననగా, ఇదివరలో.. ప్రసవించిన ఐదవ దినమందు పిల్లవాడు మరణించుచుండెను, ఈ ప్రకారం ఐదు పర్యాయములు జరిగెను. ఇప్పుడు ఆరవ పిల్లవాడు రాత్రి తమరు మా గృహంబున నివసించియుండుటచే అరిష్టమును చెందక సుఖముగా జీవించుచున్నాడు. అని ఆ గృహస్థులు రాజును ప్రార్థించిరి.
ఇట్లు రాజును స్తుతియింపగా ఆ రాజు ఇది అంతయు ఈశ్వరుని అనుగ్రహమే కాని, నా శక్తి కాదని చెప్పి, గయకు వెళ్లి విష్ణు పాదమునందు (Vishnu Padam) పిండము వేయగా, ఆ పిండమును గ్రహించుటకు రెండు చేతులు సాచబడెను ఆది జూచి రాజు ఆశ్చర్యమును పొంది సందేహము కలవాడై అచ్చట కర్మను చేయించుచుండెడి బ్రాహ్మణుని ఇదియేమి! ఆశ్చర్యముగానున్నదని అడుగగా ఆ బ్రాహ్మణుడు తిరిగి పిండము వేయమని చెప్పెను. ఆ రాజు తిరిగి పిండమువేసెను.
అనంతరము ఆ రాజు సత్యసంధుడును జ్ఞానియునైన ఒక బ్రాహ్మణునితో పిండము కొరకు రెండు చేతులు సాచబడుటయను వృత్తాంతమును జెప్పగా విని, ఇద్దరు తండ్రులకు పుట్టిన వానికి ఈ విధముగా జరుగును. దీని యధార్థము నీ తల్లికి తెలియును, కావున ఇంటికి వెళ్లి నిజము తెలిసికొనుమని ఆ బ్రాహ్మణుడు చెప్పగా వినియు రాజు మనస్సున దుఃఖము కలవాడై విశేషముగా విచారపడెను.
ఇట్లు, ఆ రాజు యాత్రలన్నియు సేవించుకొని తిరిగి యింటికి వెళ్లుటకు బయలుదేరు సరికి కొన్ని సంవత్సరములు పట్టెను. తిరిగి పూర్వపు మార్గముననే వచ్చుచు, పూర్వం దిగిన బ్రాహ్మణుని ఇంటికే వచ్చెను. అప్పుడును ఆ బ్రాహ్మణుని భార్య ప్రసవించి, ఐదు దినములాయెను. రెండవ కుమారుడు కలిగెను. పూర్వము వలెనే షష్టియను బాలగ్రహము పిల్ల వానిని చంపుటకు రాగానే జీవంతికయను దేవతవచ్చి ఆటంక పరచెను.
అప్పుడు బాలగ్రహము, జీవంతికను అడుగుచున్నది. ఏమి? నేను ఎన్ని పర్యాయములు పిల్లలను చంపుటకు వచ్చినప్పటికిని ఆటంకపరచెదవు, ఈ రాజు విషయమై ఇంత ప్రేమయేల ఈతని తల్లి యేమి వ్రతమాచరించినదని యడిగెను.
ఇట్లు పలికిన షష్టీ వాక్యమును విని, జీవంతిక చెప్పుచున్నది. వీరు ఉభయులు మాట్లాడుచుండగా,ఆ రాజు నిద్రపోవు వానివలె వీరి మాటలను వినుచుండెను. అప్పుడు, జీవంతిక చెప్పినదేమనగా, ఈ రాజు యొక్క తల్లి శ్రావణమాసములో (Shravana Masam) శుక్రవారము నందు నన్ను పూజింపుచుండును.
ఆ చిన్నది వ్రతమాచరింపుచు చేసెడి నియమములను చెప్పెదను వినుము. ఆకుపచ్చ వర్ణము గల బట్టను, రవికెను ధరియింపదు, అట్టి వర్ణము గల గాజులను తొడుగుకొనదు, బియ్యం కడిగిన నీళ్లను దాటదు, ఆకుపచ్చని చిగుళ్లతో ఏర్పరచిన మంటపము క్రిందుగా దూరి వెళ్లదు, పచ్చని వర్ణము కలుగుటవలన ఆకుకూరలను భక్షింపదు, ఈ ప్రకారము సమస్తము నాకు ప్రీతికరముగా చేయును. కాబట్టి, ఆ పిల్లవాడిని చంపకుండా రక్షించెదను, ఇట్లు జీవంతిక బాలగ్రహముతో చెప్పిన మాటలను రాజు వినెను. తర్వాత రాజు ఉదయమున లేచి తన పట్టణము నకు తాను వెళ్లెను.
ఇట్లు రాజు తన పట్టణమునకు వచ్చు సరికి ఆ పట్టణమున ఉండు వారు ఆ చుట్టు ప్రక్కల వారు అందరు ఎదురుగా వచ్చి, ఇంటికి తీసికొని వెళ్లిరి. అనంతరము… ఓ తల్లీ! నీవు జీవంతికా వ్రతమును చేసితివా అని రాజు అడుగగా నేను చేయలేదని తల్లి చెప్పెను. అప్పుడు పరీక్షించి, వ్రతమును జేసిన వారిని తెలిసికొనదలచినవాడై, రాజు కాశీ యాత్ర చేసికొని వచ్చెను గాన దానికి సఫలంగా బ్రాహ్మణులకు సమారాధన చేసి, బ్రాహ్మణులకు వస్త్రములను సువాసినీ స్త్రీలకు చీరెలను రవికలను కంకణములను నిచ్చును, గాన అందరును రావలసినదని చాటింపు చేయగా అప్పుడు పురోహితుని భార్య దూతతో నిట్లు చెప్పెను.
ఓయీ! ఎప్పుడును ఆకుపచ్చని వర్ణముగల వస్తువులను నేను ధరింపనని ఆ దూతతో చెప్పగా ఆ మాటను విని, దూత రాజుతో బ్రాహ్మణుని భార్య చెప్పిన మాటలన్నియు చెప్పెను. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుని భార్యకు ఎర్రని వర్ణము గల వస్తువులను పంపగా అవి తీసికొని రాజుగారి గృహమునకు వెళ్లెను.
అప్పుడు రాజు పరీక్షార్థమై, తూర్పు వాకిటను ఆకుపచ్చని చిగుళ్లు మొదలగు వానితో మంటపమును కట్టించి, ఆ వాకిటనే బియ్యము కడిగిన నీళ్లు పోయించగా, ఆ పురోహితుని భార్య ఆ నీళ్లను త్రొక్కి, ఆ మంటపము గుండా వెళ్లుటకు ఇష్టము లేక మరియొక ద్వారము గుండా లోపలికి వెళ్లెను. ఇది అంతయు రాజు చూచి, ఆ బ్రాహ్మణుని భార్యకు నమస్కరించి, ఆకు పచ్చని రంగుల వస్తువులను ధరించక పోవుటయు, కుడితి నీళ్లను దాట కుండుటయు, మొదలగు నియమములను నీ వేల అవలంబించితివి అని అడుగగా, నేను శుక్రవారము నందు జీవంతికా వ్రతమును చేయుదును గనుక పూర్వము చెప్పిన నియమములను అవలంబించితిని అని ఆమె చెప్పెను. మరియు ఆ రాజును చూడగానే, ఆ పురోహితుని భార్య యొక్క స్తనముల నుండి పాలు స్రవించుచుండెను.
గయలో పిండమును గ్రహించుటకు రెండు చేతులు సాచుటవలనను, జీవంతిక యొక్కయు బాలగ్రహము యొక్కయు సంభాషణ వలనను, తన్ను చూడగానే పురోహితుని భార్యకు పాలు స్రవించుట వలనను నమ్మకము కలిగి, పెంపుడు తల్లి వద్దకు వెళ్లి వినయముతో కూడి, ఓ తల్లీ! నీవు భయవడ వద్దు నా జన్మమెటువంటిదో సత్యముగా చెప్పుమని రాజు అడిగెను.
ఇట్లు రాజు పలుకగా, ఆ మాటలను విని, రాజు గారి భార్యయగు సుకేశిని తాను చేసిన కపట కృత్యమునంతయు యధార్థముగా జెప్పెను. అప్పుడు రాజు సంతసించి తన యొక్క జన్మకు కారణభూతులైన తల్లితండ్రులకు మనస్సున నమస్కారము గావించి, ఆ తల్లితండ్రులకును విశేషమగు ధన ధాన్య సంపత్తుల నొసగగా వారును మిక్కిలి సంతోషించిరి.
అనంతరము ఒకనాటి రాత్రి జీవంతికా దేవిని మనస్సున ధ్యానించి ఓ తల్లీ ! ఈ బ్రాహ్మణుని భార్య నా యొక్క జన్మకు కారణమైయుండగా ఇట్లు రెండవ వారికి కూడ నాకు తలితండ్రులనుగా ఏల జేసితివని తలపగా ,ఆ రాజు యొక్క స్వప్నములో జీవంతికా దేవి కనబడి, నీకు మేలుచేయు నిమిత్తమై ఇది అంతయు నా మాయచే జేయబడినదని చెప్పి, ఆ రాజుయొక్క సందేహము పోగొట్టెను.
కాబట్టి, ఓ మునీశ్వరా! శ్రావణ శుక్రవారమున జీవంతికా వ్రతమును చేయువాడు సమస్త కోరికలను పొందును.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – శుక్రవార జీవంతికా వ్రత కథనం నామ నవమోధ్యాయ స్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము