7వ అధ్యాయం – శ్రావణ శుక్ల సప్తమి శీతలా వ్రత మహాత్మ్యము

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుద్ధ సప్తమి (Saptami) నాడు ఆచరించవలసిన “శీతలా సప్తమి” వ్రత విశేషాలను వివరిస్తాడు. ఈ వ్రతంలో గోడపై దిగుడు బావి, జలదేవతలు, ఒక స్త్రీ, గుఱ్ఱం, ఎద్దు వంటి వాటి బొమ్మలు గీసి పూజ చేయాలని సూచిస్తాడు. పెరుగు కలిపిన అన్నం, దోసపండు కూరను నివేదన చేసి, ఆ పదార్థాలనే బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఏడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఏడుగురు సువాసినులకు భోజనం పెట్టి, తర్వాత ఉద్యాపన చేయాలని చెబుతాడు. ఈ వ్రత మహిమను తెలియజేయడానికి ధనదుడు అనే ధనవంతుడి కథను చెబుతాడు. ధనదుడు ప్రజల కోసం దిగుడు బావులు త్రవ్వించినా నీరు రాకపోవడంతో, జలదేవతలు అతని మనవడిని బలిగా ఇస్తేనే నీరు వస్తుందని స్వప్నంలో చెబుతారు.
ధనదుని కుమారుడు ధర్మాన్ని పాటించేవాడు కావడంతో, పెద్ద కుమారుడిని బలి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అతని భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు, వారు చంద్రుడు అనే పెద్ద మనవడిని బలి ఇచ్చి, బావిలో నీరు పొందుతారు. మూడవ మాసంలో తిరిగి వస్తున్న కోడలు సుశీల, దారిలో తన అత్తగారు త్రవ్వించిన బావి (Well) వద్ద శీతలా సప్తమి వ్రతం ఆచరించి, వ్రత ఫలాన్ని ధారపోయగా, బలిచ్చిన పెద్ద కుమారుడు తిరిగి జీవం పొందుతాడు. ఈ సంఘటనను చూసి మామ, భర్త ఆశ్చర్యపడి, కోడలి పుణ్యఫలం వల్లే ఇదంతా జరిగిందని ఆమెను స్తుతిస్తారు. ఈ విధంగా, శీతలా సప్తమి వ్రతం ఆచరించడం వల్ల తాపత్రయాలు నశించి, ఇహపర సుఖాలు లభిస్తాయని ఈశ్వరుడు సనత్కుమారునికి వివరించి, వ్రత విశిష్టతను ముగిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 7
శ్రావణమాస మహాత్మ్యము – 7వ అధ్యాయం
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు….
ఓ మునీశ్వరా! ఇకముందు “శ్రావణ శుద్ధ సప్తమి” దినంబున చేయతగిన “శీతలా సప్తమి” యను వ్రతమును గురించి చెప్పెదను సావధానముగా వినుము.
గోడయందు దిగుడుబావి ఆకారమును, దానిలో దివ్యరూపులును అశరీరులు అను పేరు గల జలాధి దేవతలు అనెడు గుర్తును లిఖించవలయును, మరియు ఇద్దరు బాలురు, ముగ్గురు పురుషులతో గూడియున్నట్లు ఒక స్త్రీ ప్రతిమను లిఖించవలయును. ఒక గుఱ్ఱమును (Horse) ఒక ఎద్దును మనుష్యులచే వహింపబడు ఒక సవారీని లిఖియించి, పిమ్మట జలాధి దేవతలను షోడశోపచారములచే పూజించి, దోస పండు వ్యంజనముగా చేసి, పెరుగుతో కలిపిన అన్నమును నివేదన చేయవలయును.
ఏ పదార్థములను నివేదన చేయుచున్నారో, ఆ పదార్థములనే బ్రాహ్మణునకు వాయనమివ్వవలయును. ఈ ప్రకారము ఏడు సంవత్సరములు ప్రతమును చేయుచు, ప్రతి సంవత్సరమునందు ఏడుగురు సువాసినీ స్త్రీలకు భోజనము పెట్టవలయును. ఆనంతరము ఉద్యాపనము చేయవలయును.
బాలురతో గూడి యున్నట్లుగా నిర్మింపబడిన జలాధిదేవత ప్రతిమలను ఒక బంగారపు (Golden) పాత్రయందుంచి ఉదయమున, సాయంకాలంబున భక్తితో పూజింపవలయును. నవగ్రహములకు ముందుగాను, తర్వాత ప్రధాన దేవతలకును అన్నము మొదలగువానితో ప్రాతఃకాలంబున హోమము చేయవలయును. ఈప్రకారముగా వ్రతమాచరించి, ఫలితమును పొందిన వారిని చెప్పెదను వినుము.
పూర్వ కాలంబున సౌరాష్ట్ర దేశమునందు శోభనము అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణమందు సమస్త ధర్మముల యందు ఆసక్తిగల ఒక ధనవంతుడు కలడు. ఆయన – జలము (Water) ఎచ్చటను లేనట్టి జన సంచారము లేని అడవి యందు సమస్త జీవరాసులకు ఉపయోగమగునట్లుగా ఎప్పుడును జలముతో నిండియుండ వలయునను భావముతో దిగుడు బావులు మొదలగు వానిని త్రవ్వించెను. విశేషముగా ధనమును ఖర్చు పెట్టి, గట్టి రాళ్లతో నడచుటకు సుఖముగా నుండునట్లు కాలి త్రోవలను, పశువులు నీరు త్రాగుటకు తొట్లను, మార్గస్ధులకు ఆయాసమును పోగొట్టునట్టియు, బహుకాలము ఉండ దగిన తొట్టెలను అచ్చటచ్చట మార్గ సమీపములో ఏర్పరచెను.
ఈ ప్రకారము ధర్మ కార్యములను చేసినప్పటికి, ఎచ్చటను ఒక్క బిందువైనను జలము సంభవింపలేదు. అప్పుడు వ్యాకులము కలవాడై.., నా ప్రయాసము వ్యర్థమైనది, నా సొమ్మంతయు వ్యర్ధముగా ఖర్చు అయినది గదా! అని ధనదుడు అను పేరుగల ఆ ధనవంతుడు విచారపడి, ఆ రాత్రి అచ్చటనే నిద్రించగా జలదేవతలు ఆయన స్వప్నములో కనబడి, ఓ ధనవంతుడా! నీవు త్రవ్వించిన బావులలో నీరు పుట్టుటకు ఉపాయమును చెప్పెదను వినుము. నీవు మా యందు భక్తి కలవాడవై నీ మనమడుని మాకు బలిగా ఇచ్చితివేని, నీవు త్రవ్వించిన బావి ఎప్పుడును జలంతో నిండి యుండునని చెప్పి యదృశ్యులైరి. ఆ ధనికుడును ఇటువంటి స్వప్నమును జూచి ఇంటికి వచ్చి, అంతయు కుమారునితో చెప్పెను.
ఆయ యొక్క కుమారుడును ద్రవిణుడు అను పేరు గలవాడును, ధర్మము నందు ఆసక్తి గలవాడుగా నుండెను. ఇట్లు తండ్రి చెప్పిన వృత్తాంతమును విన్నవాడై కుమారుడు చెప్పుచున్నాడు….
ఓ తండ్రీ! నేను నీకు కుమారుడను అగుటచేత నీ మాటను తప్పక వినవలయును, మఱియు నీవు చేయునటువంటిది ధర్మకార్యము, నీవు విచారింప పనిలేదు, ధర్మము శాశ్వతముగా ఉండును. పుత్రులు మొదలగువారు నశించెడివారు కాబట్టి, నశించునట్టి స్వల్ప వస్తువులనిచ్చి శాశ్వతముగా ఉండునటువంటి ధర్మమును సంపాదించుట మిక్కిలి దుర్లభమైనది గదా! గాన, నాకు చంద్రుడు, సూర్యుడు అను పేరుగల ఇద్దరు కుమారులు కలరు వారిలో పెద్ద వాడగు చంద్రుని నీవు సందేహింపక బలిగా ఇవ్వవలయును, ఇట్లు మనము చేసెడి ఆలోచనను సమస్త విధముల స్త్రీలకు తెలయనివ్వకూడదు. తల్లికి తెలియకుండునట్లుగా ఉపాయమును జెప్పెదను వినుము. నా భార్య ఇప్పుడు గర్భవతియై ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి ప్రసవించుటకు తండ్రి గారి ఇంటికి వెళ్లును. అప్పుడు చిన్న కుమారుడగు సూర్యుడు తల్లితో కూడా వెళ్లును. అప్పుడు మనము యోచించిన కార్యమునకు ఎటువంటి విఘ్నము కలుగదు, అని కుమారుడు తండ్రితో చెప్పెను.
ఇట్లు, కుమారుడు చెప్పిన మాటలను తండ్రి విని, మిక్కిలి సంతోషించి, ఓ పుత్రకా! నీవు చాలా ధన్యుడవు, నేనును మిక్కిలి ధన్యుడను, నీవంటి యోగ్యమైన సంతానము కలుగుట చేతనే నేను పుత్రులు కలవాడనైతిని అని తండ్రి కుమారుని మెచ్చుకొనెను.
ఇంతలో, ఆయన భార్యయగు సుశీలను ప్రసవమునకు తీసికొని వెళ్లుటకు తండ్రిగారి ఇంటివద్ద నుండి వర్తమానము రాగా, ఆప్పుడు ఆమెతో ఇట్లు చెప్పిరి. పెద్ద కుమారుడు మా వద్దనే యుండును, చిన్న కుమారుని మాత్రము తీసుకొని వెళ్లవలయునని పెనిమిటియు, మామగారును చెప్పగా పతివ్రతయగు ఆ చిన్నది వీరి ఆలోచనను తెలియనిది కాబట్టి, ఆ ప్రకారమే పెద్దకుమారుని విడిచి చిన్న కుమారుని తీసుకొని వెళ్లెను.
అనంతరము తండ్రియు కుమారుడును శీతాంశుడను పిల్లవానికి నూనెతో తలంటి, స్నానము చేయించి, మంచి వస్త్రముల చేతను, ఆభరణముల చేతను అలంకరించి, ఆ నూతి వద్దకు తీసుకొనివెళ్లి జలాధిదేవతలు సంతోషింతురు గాక యని, ఆ నూతిలో పాతి పెట్టిరి.
అప్పుడు వెంటనే ఆ నూతిలో… అమృతముతో సమానమగు జలము పుట్టి నిండియుండెను. పిమ్మట ఆ తండ్రి కుమారులిద్దరు ఇంటికి వెళ్లి, పిల్లవానిని బలి ఇచ్చుటచే విచారమును, నూతిలో జలము పుట్టుటచే సంతోషమును కలవారైరి.
అనంతరము, ఆ పిల్లవాని తల్లియగు సుశీల తండ్రి గారి గృహము నందు ప్రసవించినది. మూడవ కుమారుడు కలిగెను. పిమ్మట తన యింటికి మూడవ మాసము నందు ప్రయాణమై వచ్చుచుండగా దారిలో తన మామగారు త్రవ్వించిన బావిలో జలము పుట్టి సంపూర్ణముగా నిండియుండుట చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొంది, ఆ బావిలో స్నానము చేసెను.
ఈ నూతి విషయమై నా మామగారి యొక్క ఆయాసము, ధన వ్యయము సఫలమైనదని ఆ చిన్నది సంతోషించినది. ఆ దినము శ్రావణశుద్ధ సప్తమి (Shravan Shuddha Saptami) అగుటచే ఆ దినంబున శ్రేయస్కరమగు శీతలా ప్రతమును చేయదలచి, వంట చేసికొని అన్నమును పెరుగును తీసికొని వచ్చి జలదేవతలను పూజించి, పెరుగు కలిపిన అన్నమును దోసపండును నివేదనము జేసి, ఆ పదార్థమునే బ్రాహ్మణునకు వాయనము ఇచ్చెను. ఆ పదార్ధములనే తాను, తల్లితో కూడ ఉండువారును భుజియించి ఇంటికి ప్రయాణమై వచ్చుచుండగా, అచ్చటికి ఆ చిన్నదాని యొక్క గ్రామము ఒక ఆమడ దూరముండెను.
అనంతరము ఆ చిన్నది, ఇద్దరు కుమాళ్లతో కూడుకొని సవారీ నెక్కి వెళ్లుచుండగా జలదేవతలు ఈ ప్రకారము తమలో తాము ఇట్లు సంభాషించిరి. ఈ చిన్నదియు మనయందు భక్తి కలదియగుచు, మన సంబంధమగు శీతలా సప్తమీ వ్రతమును ఆచరించినది. ఈ పెనిమిటిచేతను మామ చేతను స్థాపించబడిన పెద్ద పిల్ల వానిని మనము తీసికొని నూతనముగా మరియొక పిల్ల వానిని మనము ఇచ్చినప్పటికి ఈ వ్రత ప్రభావమున మనము సంతోషించుటయు ఎంత మాత్రము కనపడదు. కాబట్టి, మొదటగా తండ్రి, తాతలచే స్థాపింపబడిన పిల్లవానినే ఇవ్వవలయునని నిశ్చయించి, దయా స్వభావము గల ఆ జలదేవతలు ఆ బావినుండి పిల్లవానిని బయటికి తీసి వెళ్లుచుండెడి తల్లి యగు సుశీలను ఆ పిల్లవానికి అప్పగించిరి.
అనంతరము ఆ పిల్లవాడు ముందు వెళ్లుచుండెడి తల్లి వెంట వెనుక పరుగెత్తుకొని వెళ్లుచు ఓ తల్లీ! అని పిలువగా ఆ ధ్వని తన పెద్దకుమారుని ధ్వనిగా తలచి వెనుకకు తిరిగి చూచెను. ఇట్లు వెనుక వచ్చుచుండెడి తన కుమారుని ఆ చిన్నది జూచి, మనస్సున భయపడినదై తన తొడయందు గూర్చుండబెట్టుకొని, శిరస్సున ముద్దాడి, ఏదో కొంచెము, తన కుమారునితో ఇట్లు పలుకుచున్నది.
ఆ పిల్లవాడు భయపడిన వాడుగా ఉండుటను తలచి, ఓ కుమారా! నీవు సర్వాభరణములచే అలంకరింపబడి యుంటివి, దొంగలెత్తుకొని వెళ్లియుండిరా ఏమి? లేక పిశాచములు నిన్ను తీసుకొనిళ్లినవా ఏమి? వాళ్ల వలన ఏ విధముగా విడిపించుకొని వచ్చితివి, మన బంధువులందరు విచారచిత్తులై యుండిరి… ఏమి కారణం? అని పిల్లవానిని అడుగుచు వ్యాకులము కలదియై పట్టణ సమీపమునకు రాగా, సుశీల వచ్చుచున్నదని ఆ గ్రామములో కొందరు వెళ్లి ఆమె పెనిమిటితోను మామతోను చెప్పిరి.
ఈ జనులు చెప్పిన వార్తను విన్నవారై, తండ్రియు కుమారుడును సుశీల వచ్చిన పిమ్మట తన పెద్ద కుమారుని సంగతిని అడిగినయెడల ఆమెతో ఏమి చెప్పుదుమా.. అని చింతాక్రాంతులయిరి.
ఇంతలో, ఆ సుశీల ముగ్గురు కుమారులతో కూడా వచ్చెను. అప్పుడు పెనిమిటియు మామగారును తల్లితో కూడా వచ్చిన పెద్ద పిల్లవానిని జూచి ఆశ్చర్యమును, మిక్కిలి సంతోషమును పొంది, ఆమెతో ఇట్లు పలికిరి, ఓ చిన్నదానా! నీవు ఏమి పుణ్యమాచరించితివి! శ్రేయస్కరమగు ఏ వ్రతమాచరించితివి.
ఓ చిన్నదానా! నీవు పతివ్రతవు, ధన్యురాలవు, పుణ్యురాలవు, మన పెద్ద పిల్లవాడు అకస్మాత్తుగా రెండు మాసముల నుండి ఏమి కారణముచేతనో మాకు కనుపించుటలేదు. ఆటువంటివాడు, ఏ కారణముచేతనో, నీతో కూడావచ్చుటచే, తిరిగి చూడ కలిగితిమి. మన దిగుడుబావి నీళ్లతో నిండియుండెను. నీవు ఇక్కడ నుండి పుట్టినింటికి వెళ్లునప్పుడు ఒక్క రెండవ కుమారుడినే తీసుకొని వెళ్లితివి, ఇప్పుడు ముగ్గురు కుమాళ్లతో గూడ వచ్చితివి. ఓ యోగ్యురాలా! నీ వలన మా వంశమంతయు తరించినది, అని ఈ ప్రకారము కోడలిని మామగారు స్తుతియించెను. పెనిమిటియు దయా స్వభావము కలవాడై, భార్యను ప్రేమించెను. ఇట్లు వారు సంతోషించిన వారై తన యొక్క సుకృతమును గురించి అడుగగా తాను చేసిన “శీతలా వ్రత మహాత్మ్యము” అంతయు చెప్పెను.
ఇట్లు, సుశీల చెప్పిన మాటలను విని, వారందఱు సంతోషమును పొంది, ఇహ లోకమున సమస్త సుఖములను అనుభవించి, జన్మాంతమున మోక్షము పొందిరి, కాబట్టి, ఓ మునీశ్వరా! ఇటువంటి ప్రభావము కలది గనుక శీతలా సప్తమీ వ్రతమును చెప్పితిని.
పెరుగుతో కలిపిన అన్నము చల్లనైనది, దోసపండును చల్లని గుణమును ఇచ్చును. బావి జలమును చల్లనైనవి జలాధిదేవతలును చల్లనైనవారు.
కాబట్టి, తాపత్రయములనెడు అగ్నిహోత్రముచే దహింపబడెడు మనుష్యునకు ఈ శీతలా వ్రతము వలన – జలముచే అగ్ని చల్లారిపోవునట్లు తాపత్రయములు నశించిపోవును, గాన, ఈ శీతలా సప్తమీ వ్రతము సార్ధకమైన పేరుగలది అని సాంబమూర్తి సనత్కుమార మునీశ్వరునితో చెప్పెను.
ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – “శీతలస సప్తమీ వ్రత” కథనం నామ షష్ఠోధ్యాయస్స సమాప్తం.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము