Shravana Masa Mahatmyam Day – 30 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 30

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాంద పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు శ్రావణమాస మహత్యం గురించి తాను కొంత మాత్రమే వివరించానని, దానిని పూర్తిగా చెప్పాలంటే వందల సంవత్సరాలు కూడా సరిపోవని సనత్కుమారునికి చెప్పాడు. దక్ష యజ్ఞంలో సతీదేవి తనువు చాలించాక, తాను శ్రావణ వ్రతం ఆచరించడం వల్లనే తిరిగి పార్వతి రూపంలో ఆమెను పొందగలిగానని తెలియజేశాడు. ఈ మాసంలో వాతావరణం కూడా అన్ని జీవులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మాసంలో భస్మధారణ, రుద్రాక్షలను (Rudraksha) ధరించి, పంచాక్షర మంత్రాన్ని (Panchakshari) జపించిన వారు తన స్వరూపాలే అవుతారని తెలిపాడు. శ్రావణ మాసంలో తనకు, శ్రీకృష్ణునికి (Lord Sri Krishna) ప్రీతిగా పూజలు చేయాలని, ముఖ్యంగా ఇదే మాసంలో కృష్ణాష్టమి వస్తుందని చెప్పాడు.

సనత్కుమారుడు తాను ఆనందంలో మునిగిపోయి వ్రతాల క్రమం సరిగా గుర్తుంచుకోలేదని చెప్పగా, ఈశ్వరుడు శ్రావణ మాసంలో చెప్పిన అన్ని వ్రతాలు, పూజలు, వాటి కాలనిర్ణయాలు, వాటి ఫలితాలను క్లుప్తంగా మరొకసారి వివరించాడు. నక్తవ్రతం, రుద్రాభిషేకం, లక్షపూజ, దీపదానం, వివిధ వార వ్రతాలు, ఏకాదశి (Ekasadhi), పవిత్రారోపణ, సంకష్టహర చతుర్థి (Sankashtahara Chaturthi), కృష్ణాష్టమి, పిఠోర వ్రతం, పోలా వ్రతం, అగస్త్యార్ఘ్యవిధి వంటి అన్నిటినీ వరుసగా ప్రస్తావించాడు. ఈ క్రమాన్ని హృదయపూర్వకంగా గుర్తుంచుకున్నా లేదా విన్నవారు కూడా అన్ని వ్రతాలు చేసిన ఫలాన్ని పొందుతారని చెప్పాడు. శివుని మాటలు విన్న సనత్కుమారుడు కృతజ్ఞతతో శంకరునికి నమస్కరించి, ఈ రహస్య విషయాలు అర్హత కలిగిన వారికి మాత్రమే చెప్పాలని సూతుడు శౌనకాది మునులకు తెలియజేస్తూ ఈ మహాత్మ్యాన్ని ముగించాడు.

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

(చివరి అధ్యాయము) 

🌻ఈశ్వరుడు చెప్తున్నాడు: 

ఓ సనత్కుమారా! నేను శ్రావణమాస మాహాత్మ్యం కొంతవరకే నీకు చెప్పాను. ఈ మాస మహాత్యం సంపూర్ణంగా చెప్పడానికి వందల సంవత్సరాల కాలమున్నా సరిపోదు.

నేను శ్రావణమాస వ్రత పాలన చెయ్యడం వల్లనే దక్షుని యజ్ఞంలో తనువు చాలించిన సతీదేవిని మరల హిమవంతుని కుమార్తెగా పొందగలిగాను. కాబట్టి ఈ మాసం నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసపు వాతావరణం కూడా ఎక్కువ వేడి, చల్లదనం కాకుండా అందరికీ అనుకూలంగా ఉంటుంది. 

రాజైనవాడు శ్రావణమాసంలో శ్రౌతాగ్ని ద్వారా వచ్చిన తెల్లని భస్మాన్ని వళ్ళంతా రాసుకుని, భస్మాన్ని తడిపి నుదుటికి, వక్షఃస్థలానికి, నాభికి, రెండు బాహువులకు, మోచేతులకు, మణికట్టులకు, మెడకు, శిరస్సుకు, వెనుకవైపు – ఇలా పన్నెండు భాగాలకు త్రిపుండ్రాలను ధరించాలి. ‘మానస్తోకే’ మంత్రం లేదా ‘సద్యోజాతం’ మొదలైన మంత్రాలతో లేదా షడక్షర మంత్రం (ఓం నమశ్శివాయ – Om Namah Shivaya) తో ఈ భస్మాన్ని ధరించాలి. తరువాత నూటాఎనిమిది రుద్రాక్షలను ధరించాలి. మెడలో ముప్పది రెండు, తలపై ఇరువది రెండు, రెండు చెవులకు పన్నెండు, రెండు చేతులకు ఇరువది నాలుగు, ఒకొక్క భుజానికి ఎనిమిది, నుదుటి స్థానంలో ఒకటి, శిఖ మొదటి భాగంలో ఒకటి – ఇలా ధరించి నన్ను (శివుని) పూజించి పంచాక్షర మంత్రాన్ని జపించాలి. శ్రావణమాసంలో ఇలా చేసినవారు సాక్షాత్తుగా నా స్వరూపులే అనడంలో సందేహం లేదు.

“ఈ నెలలో నా ప్రీతిగా నన్ను లేదా కేశవుని పూజించాలి. ఈ మాసంలోనే నాకు అత్యంత ప్రీతికరమైన కృష్ణాష్టమి వస్తుంది. ఆ రోజే భగవంతుడైన శ్రీహరి (Sri Hari) దేవకీ గర్భం ద్వారా ఉదయించాడు. సంక్షేపంగా నీకు అన్నీ తెలియజేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉందో చెప్పు” అని ఈశ్వరుడు సనత్కుమారుని అడుగగా, సనత్కుమారుడు, “ఓ పార్వతీపతీ! మీరు చెప్తున్నప్పుడు ఆనందసాగరంలో తన్మయుడను అవడం వల్ల వ్రతాల క్రమం సరిగ్గా గుర్తుంచుకోలేదు. కాబట్టి మరొకసారి వ్రతాల క్రమం తెలియజేస్తే ఈసారి గుర్తుంచుకుంటాను” అని చెప్పగా, పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు..

మొదటిగా శౌనకాది మహర్షుల ప్రశ్న, సూతుడు చెప్పిన సమాధానం..

వినేవారికి ఉండవలసిన గుణాలు, నీ (సనత్కుమారుని) ప్రశ్నలు, శ్రావణ శబ్దవ్యుత్పత్తి, దానికి స్తుతి, నీచే నాకు చేయబడిన స్తుతి, నా సమాధానం, నక్తవ్రత విధి, రుద్రాభిషేకం (Rudrabhishekam), లక్షపూజావిధి, దీపదానం, ఇష్టమైన వస్తువును విడిచిపెట్టడం, పంచామృతం తీర్థంగా స్వీకరించడం వల్ల వచ్చే ఫలం, భూశయనం, మౌనవ్రతం వలన వచ్చే ఫలితాలు, మాసోపవాస ధారణ – పారాయణం (Parayanam) నియమాలు, సోమాఖ్యానంలో లక్షరుద్రవర్తి విధి, కోటిలింగ విధానం, ‘అనౌదనం’ పేరుతోనున్న వ్రతం ఈ వ్రతాచరణలో హవిష్యాన్నం స్వీకరించడం, ఆకులో భోజనం చెయ్యడం, ఆకుకూరలు తినడం మానివెయ్యడం, ప్రాతఃస్నానం, శమదమాల గురించి, స్ఫటికం మొదలైన ధాతునిర్మిత లింగపూజ, జపఫలం, ప్రదక్షిణ, నమస్కారం, వేదపారాయణ (Veda), పురుషసూక్త విధి (Purushukta), గ్రహయజ్ఞ విధి, రవి – సోమ – మంగళవార వ్రతాల వర్ణన, బుధ- గురువుల వ్రతం, శుక్రవారం జీవంతికా వ్రతం, శనివారం నాడు నరసింహ (Lord Narasimha) శని – వాయుదేవ అశ్వత్థ పూజాదుల విధులు తెలియజేశాను.

తరువాత రోటకవ్రతం, ఔదుంబర వ్రతం, స్వర్ణగౌరీ వ్రతం (Swarnagauri Vratham), దూర్వాగణపతి వ్రతం, నాగపంచమి (Naga Panchami), సూపౌదనవ్రతం, శీతలా సప్తమి, అమ్మవారి పవిత్రారోపణం, దుర్గాకుమారీపూజ, ఆశాదశమి, ఉభయ ఏకాదశులు, హరి పవిత్రారోపణం, కామదేవ పూజ, శివుని పవిత్రారోపణం, ఉపాకర్మ (Upakarma), ఉత్సర్జనం, శ్రావణ పూర్ణిమ విధులు, సర్పబలి, హయగ్రీవ జయంతి (Hayagriva Jayanti), సభాదీపం, రక్షాబంధనం, సంకష్టహర చతుర్థి (Sankashtahara Chaturthi), కృష్ణజన్మాష్టమి (Sri Krishna Janmashtami), పిఠోరవ్రతం, పోలామావాస్య, కుశగ్రహణం, నదుల, రజోధర్మాలు, కర్కాటక – సింహ సంక్రమణ విధులు, శ్రావణమాసంలో చేసే స్నాన దాన మాహాత్మ్యం, శ్రావణమాస మాహాత్మ్యం వినడం వల్ల వచ్చే ఫలితాలు, అగస్త్యార్ఘ్యవిధి, వ్రతముల కాలనిర్ణయం.

సనత్కుమారా! ఈ అనుక్రమణికను హృదయంతో ధారణ చెయ్యు. ఈ అధ్యాయం ఎవరైతే వింటారో వారు అన్ని వ్రతాలు చేసిన ఫలితాన్ని పొందుతారు.

శ్రావణమాసంలో ఆచరించవలసిన విధులలో ఏ ఒక్కటి ఆచరించినా వారి పట్ల నేను ప్రీతుడనై ఉంటాను.

🌻సూతుడు చెప్తున్నాడు:

ఓ శౌనకా! శివుని ముఖపద్మం నుండి వెలువడిన ఈ అమృత వాక్కులు చెవులతో పానం చేసిన సనత్కుమారుడు ఆనందం పొంది కృతకృత్యుడయ్యాడు. శ్రావణమాస మాహాత్మ్యాన్ని, శివుని హృదయంలో స్మరిస్తూ దేవర్షి శ్రేష్ఠుడైన సనత్కుమారుడు శంకరుని అనుమతి తీసుకుని బయల్దేరాడు.

ఇందులో చెప్పబడ్డవన్నీ అత్యంత రహస్యమైన విషయాలు. అర్హులు కానివారికి వీటిని తెలియజేయరాదు. మీరందరూ యోగ్యులు కాబట్టి మీకు తెలియజేశాను.

♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ముఫ్ఫెయ్యవ అధ్యాయము సమాప్తం..

🌷శ్రావణమాస మహాత్మ్యము సమాప్తం.

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

Leave a Comment