26వ అధ్యాయం – శ్రావణ అమావాస్య – “పోలా వ్రతం”

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాంద పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ అమావాస్య నాడు (Shravan Amavasya) జరుపుకునే “పోలా వ్రతం – Pola Vratham” గురించి వివరించాడు. పూర్వం అంధకాసురుడితో యుద్ధంలో, తన వాహనమైన వృషభం – Vrushabham (నంది – Nandi) తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా పోరాడి తనకు సహాయం చేసిందని శివుడు తెలియజేశాడు. నందికి కృతజ్ఞతగా, దాని దేహాన్ని మరింత దృఢంగా మార్చి, శ్రావణ అమావాస్య నాడు గోవుతో (Cow) సహా వృషభ ప్రతిమను పూజించిన వారి కోరికలు నెరవేరుతాయని వరం ఇచ్చాడు. ఈ రోజున గోవులను, ఎద్దులను పూజించి, వాటికి విశ్రాంతినివ్వాలని, నువ్వులు వంటి పోషక పదార్థాలను ఆహారంగా ఇవ్వాలని నంది కోరింది. గోసంపద లేని ఇల్లు శ్మశానంతో సమానమని, గోవులు లేనిదే పంచామృతం, పవిత్రమైన గోమయం, గోమూత్రం (Gomutram) లభించవని నంది వివరించింది. ఈ వ్రతం ఆచరించిన వారు మహావీరులు, బలవంతులు అవుతారని, అందువల్ల ఈ రోజును ‘పోలా’ అని పిలుస్తారని శివుడు పేర్కొన్నాడు.
అదే అధ్యాయంలో, శ్రావణ అమావాస్య నాడు దర్భలను సేకరించే “కుశగ్రహణ విధి” గురించి ఈశ్వరుడు వివరించాడు. ఈ రోజున సేకరించిన దర్భలు ఏడాది పొడవునా పవిత్రంగా ఉంటాయని, వాటిని దేవకార్యాలకు, పితృకార్యాలకు, జపాలకు ఉపయోగించవచ్చని తెలిపాడు. దర్భలు సేకరించేటప్పుడు “విరించినా సహోత్పన్న” అనే మంత్రం చెప్పాలని, అగ్రభాగాలు చెక్కుచెదరకుండా ఉన్న ఆకుపచ్చని దర్భలను ఎంచుకోవాలని సూచించాడు. బ్రాహ్మణులకు నాలుగు, ఇతరులకు మూడు, రెండు, ఒకటి దర్భలతో పవిత్రాలు చేయవచ్చని, లేదా అందరికీ రెండు దర్భలతో చేయవచ్చని వివరించాడు. దర్భతో సమానమైన పవిత్రమైన, పాపనాశకమైన వస్తువు మరొకటి లేదని, శ్రావణ అమావాస్య నాడు సేకరించిన దర్భలకు (Darba) మరింత పవిత్రత ఉంటుందని శివుడు పేర్కొన్నాడు.
Shravana Masa Mahatmyam Day – 26
శ్రావణమాస మహాత్మ్యము – 26వ అధ్యాయం
🍃🌷శ్రావణ అమావాస్య పోలా వ్రతం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:
శ్రావణ అమావాస్యనాడు ఆచరించాల్సిన పోలా వ్రతం విధికి సంబంధించిన కథ చెప్తాను.
ఒకప్పుడు అత్యంత పరాక్రమం కలిగి లోక కంటకులైన రాక్షసులతో మహాయుద్ధం జరిగింది. నేను వృషభం (నంది) పై ఉండి సంగ్రామంలో పాల్గొన్నాను. అంధకాసురునితో యుద్ధం జరిగిన సమయంలో నంది దేహానికి చాలా దెబ్బలు తగిలాయి. చర్మం కూడా అనేక చోట్ల ఛేదింపబడి చాలా రక్తం కూడా వచ్చి ప్రాణం మాత్రమే మిగిలిన దేహంతో ఉన్నప్పటికీ ధైర్యంగానే ఉంటూ అంధకాసురుని, ఇతర దైత్యులను సంహరించే వరకు నాకు సహకరిస్తూనే ఉంది. అంధకాసురుని వధించాక నేను ప్రసన్నుడనై నందితో, “నీ స్వామి భక్తికి, పరాక్రమానికి చాలా సంతోషించాను. నీ దేహం ఛిద్రాలు ఏమీ లేకుండా మునుపటి కంటే మరింత దృఢంగా, శక్తిమంతంగా ఉండేలా చేస్తాను.
అంతే కాకుండా మరేమైనా వరాలు కోరుకో… ఆనందంగా ఇస్తాను” అని చెప్పాను. దానికి నందీశ్వరుడు, “ఓ దేవదేవ! మహేశ్వర! నువ్వు నా పట్ల ప్రసన్నుడవు కావడమే పెద్ద వరం. అంతకంటే ఏమి కావాలి? అయినా లోకోపకారం కోసం ఒక వరం కోరుకుంటున్నాను. నువ్వు నా పట్ల ప్రసన్నుడవైన ఈ రోజు శ్రావణ అమావాస్య. ఈ తిథి నాడు మానవులు గోవుతో కలసి ఉన్న వృషభ ప్రతిమను మట్టితో చేసి పూజించాలి. ఈ రోజున జన్మించిన ధేనువు కామధేనువుతో (Kamadhenu) సమానమవ్వాలి.
ఈ విధంగా పూజించినవారి కోరికలు తీరుస్తానని నువ్వు వరం ఇవ్వాలి. మట్టి ప్రతిమలలోనే కాక ప్రత్యక్షంగా గోవులను, వృషభాలను ఈ రోజు పూజించాలి. బంగారం మొదలైన వివిధ ధాతువులతో గోవు, వృషభాలను అలంకరించాలి. అనేక రంగులతో చిత్రితమైన వస్త్రాన్ని సమర్పించాలి. చక్కటి ధ్వనిని కలిగించే గంటను మెడకు కట్టాలి.
సూర్యోదయమైన నాలుగు ఘడియల తరువాత ఆవును ఊరి వెలుపలకు మేతకు తీసుకువెళ్ళి మరల సాయంత్రం ఊరిలోకి తీసుకురావాలి. ఆహారంగా గోవులకు పుష్టిని కలిగించే నువ్వులు మొదలైన వివిధ పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. దానివల్ల గోధనం అభివృద్ధి చెందుతుంది.
ఏ ఇంటిలో గోసంపద ఉండదో అది శ్మశానంతో సమానం. ఆవుపాలు (Cow Milk) లేకుండా పంచామృతం, పంచగవ్యాలు (Panchagavya) తయారు కావు. గోమయంతో లేపనం కాని ఇల్లు పవిత్రం కాజాలదు. ఎక్కడ అయితే గోజలం (గోమూత్రం) చిలకరింపబడదో అక్కడ చీమలు మొదలైన కీటకాల బాధ ఉంటుంది. ఆవుపాలు లేకుండా ఆహారంలో పుష్టి ఏముంటుంది? ఓ ప్రభో! నా యందు నీకు దయ కలిగినట్లైతే నేను కోరిన ఈ వరాలను ప్రసాదించండి, అని అడగగా నేను ప్రసన్నుడనై, “ఓ వృషభ శ్రేష్ఠా!” నువ్వు కోరినవన్నీ ప్రసాదిస్తాను. ఈ రోజున వృషభాల చేత శ్రమ కలిగించే పనులు చేయించరాదు.
ఈ రోజు కేవలం తినడానికి గడ్డి, త్రాగడానికి కావలసినంత నీటిని ఇస్తూ వృషభాలు హాయిగా ఉండేలా చూసుకున్నవారు మహా వీరులు, బలవంతులు కాగలరు. అలాంటివారిని ‘పోల’ అని అంటారు. కాబట్టి ఈ రోజు ‘పోలా’ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజు బంధుమిత్రులతో కలిసి మహోత్సవం చేసుకోవాలి.
🌻కుశగ్రహణ విధి:
శ్రావణ అమావాస్యనాడు పవిత్రంగా వెళ్ళి దర్భలను కోసుకొని తీసుకురావాలి. ఈ రోజు తెచ్చిన దర్భలను ఎన్నిరోజులు వాడుకున్నా అవి పవిత్రంగానే పరిగణింప బడతాయి. ఈశాన్యం వైపు తిరిగి, “విరించినా సహోత్పన్న పరమేష్ఠీనిసర్గజ, నుద పాపాని సర్వాణి దర్భ స్వస్తికరోభవ” అని ప్రార్థించి ‘హుంఫట్ ‘ అని పలికి దర్భలను తియ్యాలి. అగ్రభాగాలు భిన్నము కానివి, ఎండి పోకుండా ఉన్నవి తియ్యాలి. ఆకుపచ్చగా ఉన్నవి పితృకర్మలకు ఉపయోగించాలి. మూలాలు లేకుండా ఉన్నవి దేవకార్యాలకు, జపాలకు ఉపయోగించాలి. ఏడు ఆకులున్న దర్భలు దేవ- పితృకార్యాలకు శ్రేష్ఠమైనవి. మూలభాగం లేకుండా అగ్రములు ఉండి, పది అంగుళాల పరిమాణం కల రెండు దర్భలు పవిత్రాలుగా ఉపయోగపడతాయి.
బ్రాహ్మణులకు నాలుగు దర్భలను కలిపి పవిత్రం చెయ్యాలి. ఇతరులకు క్రమంగా మూడు, రెండు, ఒకటిగా దర్బలను పవిత్రాలుగా చెయ్యాలి. లేదా అన్ని వర్ణముల వారికి రెండు దర్భలను కలిపి ముడి వేసి పవిత్రములుగా ఉపయోగించవచ్చు.
ఈ పవిత్రాలు ధరించడానికి ఉపయోగపడతాయి. ఉత్పవనం కోసం రెండు దర్భలు ఉపయోగించాలి. ఏబది దర్భలతో బ్రహ్మను, ఇరువది అయిదు దర్భలతో విష్టరుని నిర్మించాలి. ఆచమనం చేసేటప్పుడు పవిత్రాన్ని తీసెయ్యరాదు. వికిరపిండం పెట్టేటప్పుడు, అగ్నౌకరణం చేసిన తరువాత, పాద్యం ఇచ్చిన తరువాత పవిత్రాన్ని విడిచిపెట్టాలి. దర్భతో సమానమైన పుణ్యప్రదమైన, పవిత్రమైన, పాపనాశకమైన వస్తువు మరొకటి లేదు. దేవకర్మ, పితృకర్మ- Pitrukarma రెండిటికీ దర్భలను ఉపయోగించాలి.
అందులోనూ శ్రావణ అమావాస్యనాడు తీసిన దర్భలు మరింతగా పవిత్రతను సంతరించుకుంటాయి.
♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము