Shravana Masa Mahatmyam Day – 25 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 25

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాంద పురాణం(Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ అమావాస్య నాడు (Shravan Amavasya) ఆచరించవలసిన “పిఠోర వ్రతం” గురించి వివరించాడు. ఈ వ్రతం సమస్త సంపదలను ప్రసాదిస్తుందని పేర్కొన్నాడు. ఇంటి గోడలకు రాగి, నలుపు (Black Color) లేదా తెలుపు రంగులు (White Color) పూసి, వాటిపై అనేక రకాల చిత్రాలను గీసి ఈ వ్రతం చేయాలి. ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల (Parvati Parmeswara) ప్రతిమ లేదా శివలింగాన్ని ఉంచి పూజించాలి. ఇంటిలోని గదులు, వంటగది, పడకగది, చెట్లు, తలుపులు, ఆటస్థలం, పశువులు, వాహనాలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వివిధ పాత్రలు, పక్షులు, దుస్తులు, ఆయుధాలు, ఆహార పదార్థాలు వంటి ఇంటికి సంబంధించిన అన్ని వస్తువుల చిత్రాలను గీసి, పార్వతీ పరమేశ్వరులతో కలిపి వాటన్నింటికీ షోడశోపచార పూజలు చేయాలి.

ఈ పూజలో గంధం, పువ్వులు, ధూపం సమర్పించి, బ్రాహ్మణులకు, పిల్లలకు, ముత్తైదువులకు భోజనం పెట్టాలి. అయిదు సంవత్సరాలు ఈ వ్రతం ఆచరించి, ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనలో మారేడు దళాలతో (Bilva Leaves) శివ మంత్రంతో హోమం చేయాలని, బ్రాహ్మణులకు శక్తి మేరకు దాన, దక్షిణలు ఇవ్వాలని సూచించాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి సమస్త కోరికలు నెరవేరి, ఈతిబాధలు ఉండవని, ఇంట్లో ఐశ్వర్యం నిండి ఉంటుందని ఈశ్వరుడు తెలియజేశాడు. గోడలపై ఏ వస్తువులను చిత్రించి పూజిస్తారో, వాటినన్నిటినీ తప్పకుండా పొందుతారని హామీ ఇస్తూ ఈ అధ్యాయాన్ని ముగించాడు.

🍃🌷శ్రావణ అమావాస్య – పిఠోర వ్రతం:

మదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll   

శ్రావణ అమావాస్య నాడు సకల సంపదలనూ ప్రసాదించే ఉత్తమమైన “పిఠోర వ్రతం – Pithora Vrata” ఆచరించాలి. అన్ని వస్తువులను, కుటుంబ సభ్యులను తనలో ఉంచుకోవడం వల్ల ఇళ్ళు పీఠంగా చెప్పబడింది. వస్తువులన్నిటి సమూహాన్ని ‘ఆర ‘ అంటారు. అందువల్ల దీని పేరు ‘పిఠోర’ వ్రతం.

ఇంటి గోడకు రాగి రంగు (Copper Color) లేదా నలుపు లేదా తెలుపు రంగును లేపనం చేసి అనగా రాగి రంగుతోపాటు పసుపు రంగు, నలుపుతో పాటుగా తెలుపు రంగు లేదా తెలుపు – పసుపు కలిపిన రంగులు వేసి అనేక రకముల చిత్రాలను లిఖించి ఇంటి మధ్యలో పార్వతీ పరమేశ్వరుల మూర్తిని లేదా శివలింగాన్ని (Sivalinga) పెట్టాలి. 

ఇంటికి పావువంతు భాగంలో వంటగది, పూజగది, పడకగది, అటకలు, అంతఃపురం, అందమైన చెట్లు, మారేడు, తులసి, సున్నం మొదలైన వాటితో గట్టిగా కట్టబడిన రాళ్ళు, ఇటుకలతో అలంకరించి, చక్కని తలుపులు, ఆట స్థలం మొదలైనవన్నీ చిత్రించాలి.    

అంతే కాక ఆవులు, గేదెలు, ఒంటెలు, రథాలు, బండ్లు, స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు, యువకులు, పల్లకీలు, ఊయల, మరియు అనేక రకాలైన వేదికలు మొదలైనవన్నీ చిత్రించాలి. బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుము, మట్టి, ఇత్తడి మొదలైన అనేక రంగుల పాత్రలను, మంచాలను చిత్రించాలి. 

మైనా మొదలైన శుభంకరమైన పక్షులను, పిల్లిని, స్త్రీపురుషులు ధరించే అనేక ఆభరణాలను, దుస్తులను, యాగానికి ఉపయోగించే పాత్రలను, రెండు స్తంభాలను, పాలు, పెరుగు, నూనె, వెన్న, గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పప్పుదినుసులు, నువ్వులు, రుబ్బురోలు, పొత్రం, రోకలి, చీపురు, విసనకర్ర, చెప్పులు, గొడుగు, వివిధ ఆయుధాలు, పుస్తకం, పెన్ను, పువ్వులు, పండ్లు, అనేకరకాల ఆకులు, దీపాలు, కూరగాయలు, వివిధ వంటకాలు, ఇక్కడ ప్రస్తావించినవే కాక ఇంటికి అవసరమైనవన్నీ చిత్రించి, పార్వతీపరమేశ్వరులతో కలిపి అన్నిటికీ షోడశోపచారాలతో పూజించి, గంధం, పువ్వులు, ధూపం సమర్పించి బ్రాహ్మణులకు, పిల్లలకు, సువాసినులకు భోజనం పెట్టాలి. 

తరువాత పార్వతీసహిత పరమేశ్వరుని ఇలా ప్రార్థించాలి…

ఈ విధంగా అయిదు సంవత్సరాలు చేసి, ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనలో (Udyapana) మారేడు దళాలతో శివ మంత్రంతో ఆహుతులు సమర్పిస్తూ హోమం చెయ్యాలి. దీనికంటే ముందుగా గ్రహ హోమం చెయ్యాలి. ఆహుతుల సంఖ్య వెయ్యిఎనిమిది లేదా నూటాఎనిమిది ఉండాలి. గురువులను, బ్రాహ్మణులను గౌరవించి శక్తివంచన లేకుండా దక్షిణను సమర్పించాలి. తరువాత బంధుమిత్రులతో కలిసి భోజనం చెయ్యాలి.

ఇలా వ్రతం ఆచరించిన మానవులు అన్ని కోరికలు తీరినవారై, ఇహలోకంలో కావలసిన అన్నిటినీ పొందుతారు. అభీష్టాలు నెరవేర్చడానికి దీనికి మించిన వ్రతం లేదు. గోడలపై ఏ ఏ చిత్రాలను లిఖించి ఇలా పూజిస్తారో వాటన్నిటినీ తప్పకుండా పొందుతారు అనడంలో సందేహం లేదు.

♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు  ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము.  

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి ఇరవై ఆరవ అధ్యాయం >>

Leave a Comment