24వ అధ్యాయం – చతుర్వింశోధ్యాయం – శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రత కథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి కృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) వ్రత కథను వివరించాడు. పూర్వం భూదేవి రాక్షసుల భారాన్ని భరించలేక బ్రహ్మదేవుడిని, బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తిని వేడుకోగా, ఆయన దేవకీ వసుదేవులకు పుట్టి భూభారాన్ని హరిస్తానని వరమిచ్చాడు. కృష్ణుడు (Lord Sri Krishna) జన్మించాక, కంసుని బాధల నుండి రక్షించమని ప్రజలు కృష్ణుడిని వేడుకున్నారు. వారికి తన జన్మదిన వ్రత విధానాన్ని తెలియజేయగా, ఆ వ్రతం ఆచరించిన వారికి అనేక వరాలు లభించాయి. దీనికి ఉదాహరణగా, దుష్ట సహవాసం వల్ల నరకానికి వెళ్ళి, పిశాచ రూపం పొందిన అమిత్రజిత్తు అనే రాజు కథను ఈశ్వరుడు చెబుతాడు. ఆ పిశాచం కృష్ణాష్టమి వ్రతం (Krishnashtami Vrat) జరుగుతున్న చోటుకి వెళ్లి, వ్రతం చూసి, విష్ణు కథలు వినడం వల్ల పాప విముక్తుడై పిశాచ శరీరాన్ని విడిచి, విష్ణు లోకం చేరుకున్నాడని వివరించాడు.
ఈ వ్రత మహిమ వల్ల సమస్త పాపాలు నశించి, ఇహలోకంలో సుఖాలు, ఐశ్వర్యం లభిస్తాయని ఈశ్వరుడు పేర్కొన్నాడు. కృష్ణ జన్మ చరిత్రకు సంబంధించిన విగ్రహాలను లేదా చిత్రాలను ఇంట్లో ఉంచి పూజిస్తే, ఆ ఇంట్లో రాజుల భయం, అతివృష్టి, అనావృష్టి వంటి ఈతిబాధలు ఉండవని, సమస్త ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి తిరిగి జన్మించే భయం ఉండదని, వారు పుణ్యం మిగిలితే భూలోకంలో గొప్ప రాజుల కుటుంబంలో జన్మించి, కోరికలన్నీ నెరవేర్చుకొని, చివరికి శాశ్వతమైన విష్ణులోకాన్ని (Vishnu Loka) చేరుకుంటారని సాంబమూర్తి సనత్కుమారునికి తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ముగించాడు.
Shravana Masa Mahatmyam Day – 24
శ్రావణమాస మహాత్మ్యము – 24వ అధ్యాయం
🍃🌷చతుర్వింశోధ్యాయము – శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రత కథనం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు….
బ్రహ్మదేవుని కుమారుడవగు ఓ సనత్కుమారా!
పూర్వకల్పమందు భూదేవి దుష్టులైన రాక్షసుల భారమును సహింపలేనిదై దైన్య భావముచే వ్యాకులము కలది యగుచు బ్రహ్మదేవుని శరణు పొందెను. రాక్షసుల వలన తనకు కలిగిన బాధను భూదేవి చెప్పగా విని బ్రహ్మదేవుడు (Lord Brahma) , దేవతలతో కూడుకొనిన వాడై, పాల సముద్ర మందు వటపత్రమున శయనించి యున్న విష్ణుమూర్తి వద్దకు వెళ్లి, అనేక విధములుగా విష్ణుమూర్తిని స్తోత్రము చేసిరి.
ఇట్లు, నాలుగు ముఖంబుల వలననను పలుకుచుండగా నాలుగు దిక్కుల యందును ప్రతిధ్వనులు ఇచ్చుచున్నట్టి ఆ బ్రహ్మదేవుని స్తోత్రము విన్నవాడై, విష్ణుమూర్తి ఇట్లు చెప్పుచున్నాడు,
ఓ దేపతలారా, రాక్షసుల వలన మీరు భయపడవలదు. దేవకీ వసుదేవుల వలన నేను భూమి యందు అవతరించి, భూభారమును హరించెదను. కావున, మీరును భూమి యందు యాదవులుగా పుట్టవలయును, అని చెప్పి ప్రభువగు విష్ణుమూర్తి (Vishnumurthy) అంతర్థానమునొందెను.
అనంతరము, విష్ణుమూర్తి, వసుదేవుని (Vasudeva) వలన దేవకీ దేవి (Devaki) యొక్క గర్భము నందు జన్మించగా, కంసుని వలన భయముచే వసుదేవుడు ఆ కృష్ణమూర్తిని తీసుకొని వెళ్లి యాదవులు ఉండెడి ప్రదేశము నందు విడిచి రాగా, అక్కడ కృష్ణుడు పెరుగుచుండెను.
అనంతరము కంసుడు సేనా సమేతుడై మధురా (Mathura) పట్టణమునకు వచ్చి యాదవులను బాధింపగా, ఆ పట్టణ జనులందరును దీనులై కృష్ణుని ఇట్లు ప్రార్ధించుచున్నారు.
భక్తులకు అభయమిచ్చు వాడవును, శరణు పొందిన వారి యందు ప్రేమ గలవాడవును, యోగీశ్వరులలో అగ్రేశ్వరుడవును అగు ఓ కృష్ణమూర్తీ! మా ప్రాణములకు బాధ కలిగించెడి దుష్టులను సంహరించి మమ్ములను రక్షింపుము.
ప్రభువా! మేము ప్రార్థించి, విజ్ఞాపనము చేయుచున్నాము. ఆది ఏది అనగా నీవు జన్మించిన దినమందు చేయవలసిన కృత్యమేదియో మాలో ఒకరైనను ఎప్పుడును తెలిసికొని యుండలేదు ఆ విషయమును మీరు చెప్పిన యెడల ఆ ప్రకారముగా ఆ దినము నందు రథ కాంతి ఉత్సవమును చేసెదము. అని ప్రార్థించగా, అప్పుడు కృష్ణమూర్తి తన యందు వారికి ఉండెడి భక్తియును శ్రద్ధయును మిత్ర భావమును జూచినవాడై, వారికి తన జన్మ దినమందు చేయవలసిన విధానమంతయు చెప్పగా, వారు విన్నవారై యధా ప్రకారముగా చేసిరి.
అప్పుడు భగవంతుండగు కృష్ణమూర్తి (Krishnamurthy), వ్రతము చేసిన వారికి అనేక విధములగు వరములనిచ్చెను. దీనిని గురించి పూర్వము జరిగిన కథ యొకటి కలదు, దానిని చెప్పెదను వినుము.
అంగ దేశము నందు అమిత్రజిత్తు అను రాజు కలడు. వానికి సత్సజిత్తు అను ఒక కుమారుడు గలడు. అతడు సమస్త రాజనీతిని ఎరింగినవాడై, సన్మార్గము నందు ప్రవర్తించుచు చతురంగబల సమేతుడై, ప్రజలకు అనురాగము కలిగింపుచు న్యాయముగా భూమిని ఏలుచుండెను. ఇట్లు కొంత కాలము వెళ్లగా దైవ యోగముచే ఒకప్పుడు నాస్తిక మతస్థులతో సహవాసము కలిగి, పిమ్మట బహుకాలము వరకు వారితోనే చెలిమి చేయుటవలన ఆ రాజు అధర్మప్రవర్తనుడై యుండెను.
వేదములు, శాస్త్రములు, పురాణములు మొదలగు వానిని, అనేక విధములుగా ఆ రాజు నిందించుచుండెను. వర్ణాశ్రమ ధర్మముల యందును మిక్కిలి ద్వేషము కలవాడై యుండెను. ఇట్లు బహుకాలము జరుగగా… ఓ మునీశ్వరుడా! ఆ రాజు కాలవశముచే మరణము నొందెను. అంతట యమదూత వచ్చి, పాశములచే కట్టి, యముని వద్దకు తీసికొని వెళ్లి, అనేక విధములుగా బాధలు పెట్టి, దుర్మార్గుల సహవాసము కలిగి యుండుట వలన ఇతనిని నరకములలో పడవేసి, అనేక సంవత్సరములు యాతన పెట్టి, పాపముల నన్నిటి అనుభవింపచేసి, పిమ్మట పిశాచ శరీరములో ప్రవేశ పెట్టిరి. ఆకలి, దాహము మొదలగువానిచే పీడింపబడుచు, నిర్జల ప్రదేశముల యందు తిరుగుచుండెను.
ఒకప్పుడు ఒక వైశ్యుని దేహములో ప్రవేశించి, పుణ్యప్రదమగు ఆ మధురా పట్టణములో ప్రవేశించగా, ఇతడు పిశాచము పట్టిన వాడని ఆ పట్టణ కావలివారలు వెడలగొట్టిరి. అప్పుడా పిశాచము వైశ్యుని దేహము విడిచిపోయెను.
అనంతరము ఆ పిశాచము అరణ్యముల యందును మునీశ్వరుల ఆశ్రమముల యందును తిరుగుచుండగా, ఒకప్పుడు దైవయోగము వలన, ఒకచోట కృష్ణాష్టమీ దినంబున మునీశ్వరులును బ్రాహ్మణులును వ్రతము చేయుచు విశేష పుణ్యప్రదమగు కృష్ణుని యొక్క పూజను గావించి, పిమ్మట ఆ రాత్రి విష్ణు నామస్మరణము, కథా శ్రవణము మొదలగువానిచే జాగరణను చేసిరి. ఆ పిశాచము ఇదియంతయు చూచుట వలనను, విష్ణు కథలను వినుట వలనను, ఆ క్షణమునందే పాపము వలన విడువబడి పరిశుద్ధుడై, నిర్మలమగు మనస్సు గలవాడగుచు పిశాచ శరీరము వదలి పోయెను. అప్పుడు యమదూతలు విడిచి పెట్టి వెళ్లగా, విష్ణుదూతలు వచ్చి, దివ్యవిమానం మీద ఎక్కించి, విష్ణులోకమునకు తీసికొని వెళ్లిరి. అక్కడ దేవతా సంబంధమైన భోగములనన్నియు అనుభవించి, ఆ వ్రతమహిమ వలన, విష్ణు సాయుజ్యమును పొందెను.
ఓ మునీశ్వరా! యధార్ధమును తెలిసికొనిన మునీశ్వరులు ఈ వ్రతమును సర్వకాలముల యందును ముఖ్యముగా చేయవలయునని పురాణములో చెప్పియున్నారు. కావున, ఎల్లప్పుడును ఈ ప్రకారము చేసినవాడు కోరికలనన్నియును పొందును.
ఈ ప్రకారము కృష్ణ జన్మాష్టమీ దినంబున శుభప్రదమైన వ్రతమును చేసినవాడు, ఈ లోకంబున సమస్త సుఖములు అనుభవించి, సమస్త శుభములను కోరికలను పొందును. అంత్యకాల మందు దేవదూతలు వచ్చి, దేవ విమానమందు గూర్చుండబెట్టుకొని, స్వర్గలోకమునకు తీసుకొని వెళ్లుదురు.
ఓ బ్రహ్మకుమారా! అక్కడ సమస్త భోగములను అనుభవించి, పుణ్యంమిగులుట వలన భూలోకంలో గొప్ప రాజుల కుటుంబంలో మన్మధునితో సమానమగు సౌందర్యం కలవాడై జన్మించి, ఏ విధమగు అశుభములను పొందక, సమస్త కోరికల యొక్క ఫలితం పొంచుండును.
పూర్వమున చెప్పబడినదియు, సమస్త శుభములతో గూడినటువంటి కృష్ణ జన్మ సంబంధమను చరిత్రను అనుసరించిన విగ్రహాదులు లిఖింపబడినవై ఎవని యొక్క దేవతా గృహమందుంచబడి పూజింపబడునో, ఎక్కడ సమస్త ఉత్సవములతో గూడుకొనినట్లుగా వ్రతములు చేయబడి, భగవంతుడు పూజింపబడునో, అటువంటి ప్రదేశంబున ఇతర రాజుల సంబంధమగు భయం, ఈతి బాధలు మొదలగునవి యెన్నడును కలుగవు.
మేఘుడు సస్యములకు ఉపయోగమగునట్లు వర్షించును. అతివృష్టి, అనావృష్టి, మూషకసదలభములు మొదలగువానివలన బాధలెన్నడును కలుగవు. కృష్ణ జన్మ చరితము పూజింపబడిన గృహము నందు సమస్త ఐశ్వర్యములు సమృద్ధిగా నుండును. తిరిగి జన్మించుట అనే భయము కలుగదు, సత్పురుషుల సహవాసము వలనగాని, భక్తి వలన గాని, కృష్ణుని వ్రతమును స్థిరచిత్తుడై చూచినవాడు సమస్త పాపముల వలన విడువబడి, జన్మానంతరమున శాశ్వతమగు విష్ణులోకమును పొందును.
అని, ఈ ప్రకారంగా సాంబమూర్తి, సనత్కుమార మునీశ్వరునితో చెప్పినట్లుగా… సూత మునీశ్వరుడు, శౌనకాదిమునీశ్వరులతో చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే — “శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం” నామ చతుర్వింశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము