21వ అధ్యాయం – ఏకవింశోధ్యాయం – ఉపాకర్మోత్సర్జన, రక్షాబంధనవిధి కథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ పౌర్ణమి (Shravan Purnima) నాడు చేయవలసిన పలు ముఖ్యమైన కార్యాలను వివరిస్తాడు. ముందుగా వేదశాఖలను అనుసరించి శ్రావణ పౌర్ణమి నాడు జరుపబడే ఉపాకర్మ, ఉత్సర్జనల గురించి చెబుతాడు. వాజసనేయి శాఖవారు శ్రవణా నక్షత్రం (Sravana Nakshatra) ఉన్నప్పుడు, యజుశ్శాఖవారు శ్రావణ పౌర్ణమి నాడు, సామవేదంవారు హస్త నక్షత్రం (Hasta Nakshatra) ఉన్నప్పుడు ఉపాకర్మ (Upakarma) చేయాలని పేర్కొంటాడు. ఈ రోజునే “సభాదీప దానం” చేయాలని, మూడు వత్తుల దీపాన్ని గోధుమల మీద పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని సూచిస్తాడు. ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి, ఐశ్వర్యం లభిస్తాయని, స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని శివుడు తెలియజేస్తాడు. ఈ పౌర్ణమి (Purnima) నాడే హయగ్రీవ జయంతి (Hayagriva Jayanti) కూడా జరుపుకుంటారని, హయగ్రీవ మంత్ర జపం ద్వారా సకల కార్యసిద్ధి కలుగుతుందని చెబుతాడు.
అదే అధ్యాయంలో రక్షాబంధన ప్రాముఖ్యతను వివరిస్తూ, దీని ద్వారా రోగాలు, అశుభాలు దూరమవుతాయని చెబుతాడు. దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు అలసిపోయిన దేవేంద్రునికి (Devendra) ఆయన భార్య శచీదేవి రక్షాబంధనం కట్టగా, ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించాడని కథ చెబుతాడు. రక్షాబంధనం వల్ల జయం, సుఖం, పుత్రులు, ఆరోగ్యం లభిస్తాయని పేర్కొంటాడు. శ్రావణ పౌర్ణమి నాడు ఉదయం స్నానం చేసి, తర్పణాలు విడిచిపెట్టి, పురోహితుడి ద్వారా మంగళకరమైన కంకణాన్ని కుడి చేతికి కట్టుకోవాలని సూచిస్తాడు. “యేన బద్ధో బలీ రాజా…” అనే మంత్రాన్ని చెబుతూ రక్షాబంధనం (Rakshabandhan) చేసుకోవాలని, భద్ర తిథిలో ఈ కార్యక్రమాన్ని చేయకూడదని హెచ్చరిస్తాడు. ఈ విధంగా రక్షాబంధనం చేసుకున్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారని శివుడు సనత్కుమారునికి తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 21
శ్రావణమాస మహాత్మ్యము – 21వ అధ్యాయం
🍃🌷ఏకవింశోధ్యాయము – “ఉపాకర్మోత్సర్జన, శ్రవణాకర్మ, సర్పబలి, సభాదీప, హయగ్రీవ జయంతీ, రక్షాబంధనవిధి కథనం”:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻సనత్కుమార ఉవాచ:
దయాసముద్రుడవగు ఓ సాంబమూర్తీ….
శ్రావణ శుద్ధ పౌర్ణమి యందు చేయతగిన కృత్యమును నాయందు దయగలవాడవై చెప్పుము. నాకు వినవలయునని ఆసక్తి కలిగియున్నదని సనత్కుమారుడు సాంబమూర్తిని అడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
అభ్యసించిన వేదములకును పాప కర్మయు ఉత్సర్జనయు చెప్పబడెను. పుష్య పౌర్ణమి గాని (Pushya Purnima), మాఘ పౌర్ణమి గాని (Magha Purnima) ఉత్సర్జన కొరకు చెప్పబడెను. కావున, అట్టి తిథియందైనను చేయవలెను. లేక పుష్యమాస పాడ్యమి గాని, మాఘమాస పాడ్యమిగాని చెప్పబడిన తిధియై యుండెను. లేక రోహిణీ నక్షత్ర (Rohini Nakshatra) యుక్త తిథి యందైనను చేయవలెను. లేక వారి వారి శాఖలను అనుసరించిన కులాచార ప్రకారముగా ఉపాకర్మయను ఉత్సర్హనయును ఒక్కసారిగానే చేయుట ఆచారము గూడ కలిగి యుండి యున్నది. అందువలన ఈ శ్రావణమాస పౌర్ణమి యందే ఉపాకర్మయును ఉత్సర్జనయును చెప్పబడెను. వాజసనేయీ శాఖను అనుసరించిన వారికి ఉపాకర్మను గురించి శ్రవణా నక్షత్రము చెప్పబడెను.
శ్రావణమాసములో చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి (Padyami) ఈ మూడు తిథులలో శ్రవణా నక్షత్ర యుక్త తిథి యందు వాజసనేయి శాఖీయులు ఉపాకర్మ చేయుదురు.
యజుశ్శాఖీయులు శ్రావణ పౌర్ణమి యందు చేయుదురు. సామవేదావలంబులు (Sama Veda) శ్రావణ మాసములో హస్తా నక్షత్రముతో గూడిన తిథి యందు చేయుదురు. గురు శుక్ర మూఢముల యందును చేయుదురు. మొదటగా ఉపాకర్మ మూఢములలో చేయగూడదని శాస్త్రవేత్తల అభిప్రాయము మరియు పౌర్ణమి, గ్రహణము, సంక్రాంతి మొదలగు వానిచే దోషము గలదగునేని ఈ దినము విడిచి మరియొక కాలము నందు చేయవలెను.
శ్రావణమాసములో హస్తా నక్షత్రయుక్త పంచమి యందు గాని, పౌర్ణమి యందు గాని తమ తమ శాఖలను అనుసరించి ఉపాకర్మయు ఉత్సర్జనయు చేయవలయును. శ్రావణమాసము అధిక మాసము వచ్చెనేని, శుద్ధ శ్రావణ మాసములోనే ఉపాకర్మ చేయవలయును. ఉపాకర్మయు ఉత్సర్జనము అనెడు రెండు కర్మలును ప్రతి సంవత్సరమును ముఖ్యముగా చేయతగినవి. ఉపాకర్మను పూర్తి చేసి బ్రాహ్మణులు కూర్చుండి యుండగా అప్పుడా సభ యందు స్త్రీలు దీపదానం చేయవలెను.
బంగారము, వెండి, రాగి మొదలగు వానిచే నిర్మించబడిన పళ్లెములో శేరు గోధుముల నుంచి దానిపైని గోధుమ పిండితో చేయబడిన ప్రమిద యందు దీపము వెలిగించి, ఆ గోధుముల పైన ఉంచి, దీపముతో గూడ, ఆ పళ్లెమును ఆచార్యుడు గ్రహించుగాక యని చెప్పి బ్రాహ్మణునకు దానమియ్యవలెను.
నెయ్యి గాని, నూనె గాని ఉంచి మూడు వత్తులు గల దీపమును వెలిగించి, దక్షిణ, తాంబూలములతో గూడ ఆ దీపమును బ్రాహ్మణునకు దానమియ్య వలయును.
దీపమును వెలిగించి, ఆ దీపమును, బ్రాహ్మణుని పూజించి ఇట్లు చెప్పవలయును. దక్షిణ తాంబూలముల సహితముగా శ్రేష్ఠంబగు ఈ దీపమును భగవత్స్వరూపుడగు బ్రాహ్మణునకు ఇచ్చుచున్నాను, నా కోరికలన్నియు సఫలములగు గాక యని చెప్పి దీప దానము చేయవలయును. ఇట్లు సభా దీప దానము (Deepa Danam) చేయుట వలన పుత్రులు, పౌత్రులు మొదలగు వానితో గూడిన వారలై వారి వంశమంతయు కీర్తి చేతను, సమస్త సద్గుణముల చేతను ప్రకాశించునట్టిదగును. ఆ స్త్రీలకు మరియొక జన్మంబువ దేవతా స్త్రీలతో సమానముగు సౌందర్యము కలుగును. చిరకాలము సువాసినీత్వము, పెనిమిటికి ప్రేమతో గూడిన ప్రియురాలుగాను ఉండును. ఇట్లు, అయిదు సంవత్సరములు ఈ ప్రకారముగా చేసి, పిమ్మట ఉద్యాపనము చేయవలెను. భక్తికలది యగుచు, బ్రాహ్మణునకు తన శక్తి కొలదియు దక్షిణను ఇయ్యవలయును.
ఓ మునీశ్వరుడా! ఇట్టి ఫలమును ఒసగునది కాబట్టి శ్రేయస్కరమగు దీని మహిమనంతయు చెప్పితిని. శ్రవణా నక్షత్రమును అనుసరించి చేయు కర్మయు ఆ రాత్రియే చేయవలయును. పిమ్మట అచ్చటనే సర్పబలియు జరుపవలెను.
ఈ చెప్పబడిన రెండు కర్మల యొక్క విధానము వారి వారి సూత్రమును అనుసరించి చేసికొనవలయును. ఆ తిథి యందే హయగ్రీవావ అవతారమనియు చెప్పబడెను. ఈ దినమందు హయగ్రీవావతారము (Hayagriva Avatar) కలుగుట వలననే విశేష మహోత్సవము జరుగుచుండును. ఈ ఉత్సవము హయగ్రీవ మంత్రోపాసన కలవారు ముఖ్యముగా చేయుదురు.
శ్రావణమాసములో శ్రవణా నక్షత్రము ప్రవేశించగానే విష్ణుమూర్తి హయగ్రీవుడు అనే పేరు గలవాడై ఉద్భవించి, సమస్త పాపములను పొగొట్టునట్టి సామవేదమును గ్రహించెను. సింధూనది (Sindhu River) సముద్రము సింగమగు చోట హయగ్రీవ అవతారము కలిగినది. కావున, శ్రవణా నక్షత్రము వచ్చినప్పుడు ఆ తీరంబున స్నానము చేసిన ఎడల సమస్త కోరికలు ఫలించును.
అక్కడ శంఖము, చక్రము, గధ మొదలగు ఆయుధములతో గూడిన విష్ణుమూర్తిని (Lord Vishnu) పూజింపవలయును. సామవేదమును వినవలయును. సమస్త విధముల చేతను బ్రాహ్మణులను పూజింపవలెను. అక్కడనే తమ బంధువులతో కూడ హయగ్రీవ సంబంధమగు ఆటపాటలను జరిపి, భుజింపవలయును. తిరిగి జన్మము నందు యోగ్యమగు పెనిమిటీని పొందగలందులకు స్త్రీలు జలక్రీడలు కూడ జరుపవలయును. మరియు తమ తమ దేశము నందును, తమ తమ గృహముల యందును హయగ్రీవుని పూజించి, విశేష మహోత్సవమును గూడ జరుపవలయును. మరియు హయగ్రీవ మంత్రమును గూడ జపింపవలయును. కాబట్టి, దానిని చెప్పెదను వినుము.
మొదటగా ప్రణవమును, పిమ్మట, నమః శబ్దమును, తర్వాత, భగవతేధర్మాయ శ్రీ హయగ్రీవాయ అనియు చివరను తిరిగి నమః శబ్దమును చేర్చవలయును. ఇట్లు చేర్చగా, ఓం నమో భగవతే ధర్మాయ శ్రీ హయగ్రీవాయ నమః అనేటటువంటి అష్టాదశాక్షరములు గల మంత్రమేర్పడును. ఈ మంత్రము సమస్త కార్యసిద్ధులను చేయును. షట్ పదమును చేర్చిన ఎడల ప్రయోగముల యందు ఉపయోగింపబడును. ఈ మంత్రమును అక్షర లక్షగాని, ఎన్ని అక్షరములు కలవో అన్ని వేలుగాని పురశ్చరణను చేసిన ఎడల, ఈ కలియుగములో నాలుగు రెట్లు ఫలము కలుగును. ఈ ప్రకారము చేసిన ఎడల హయగ్రీవుడు సంతోషించినవాడై, మంచి కోరికలనన్నియు ఫలింపచేయును. ఈ పౌర్ణమియందునే రక్షాబంధనం అనునదియు చెప్పబడెను.
ఈ రక్షాబంధనము అనునట్టి కర్మ, సమస్త రోగములను, సమస్త అశుభమలను నివారణ చేయును. కావున, ఓ మునీశ్వరుడా! దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని చెప్పెదను వినుము.
అది, ఇంద్రుని జయము నిమిత్తమై, శచీదేవి రక్షాబంధనము చేసినది.ఆది ఏ విధముగా అనగా, పూర్వము దేవతలకును, రాక్షసులకును పండ్రెండు సంవత్సరములు యుద్ధము జరిగెను. అప్పుడు, దేవేంద్రుడు అలసియుండగా వానిభార్య శచీదేవి పెనిమిటిని జూచి, ఇట్లు పలుకుచున్నది, ఓ నాధా! ఈ దినము భూతముల సంబంధమగు దినము, ఈ దినమున ఆగిన ఎడల రేపు ఉదయమున అంతయు నీకు జయము కలుగును. నేను నీకు రక్షాబంధనమును చేసెదను, అందువలన నీవు ఇతరులచే జయింపబడవు, అని చెప్పి శచీదేవి పౌర్ణమి యందు దేవేంద్రునికి మంగళకృత్యములను చేసి, సంతోషమును కలిగించునట్టి కంకణమును కుడి చేతికి కట్టెను. ఇట్లు దేవేంద్రుడు కంకణమును కట్టుకొని బ్రాహ్మణుల వలన దీవెనలనొంది ప్రతాపము కలవాడై తిరిగి రాక్షసులవద్దకు వెళ్లి, వారితో యుద్ధముచేయగా, ఒక క్షణములోనే వారిని ఓడించి, మూడు లోకములను జయించినవాడాయెను.
ఓ మునీశ్వరుడా! కావున, రక్షా బంధనము ఇటువంటి సామర్ధ్యము కలదియును, మరియు జయమును సుఖమును పుత్రులను ఆరోగ్యమును ధనమును కలుగజేయును.
🌻సనత్కుమార ఉవాచ:
ఓ స్వామీ! ఏ తిథి యందు ఏ కాలంబున ఏ విధిగా రక్షాబంధనము చేయవలయునో దానిని చెప్పుము. ఓ భగవంతుడా! అనేక ధర్మములు కలవియు, ఆశ్చర్యకరములగు కధలను నీవు చెప్పుచుండగా వానిని వినుట వలన నాకు ఎంత వరకును తృప్తి తీరుటలేదని సనత్కుమారుడు చెప్పెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ మునీశ్వరా! శ్రావణ మాసములో పౌర్ణమి నాడు ఉదయంబున లేచి శ్రుతిస్మృతులను అనుసరించునట్లుగా స్నానము చేయవలయును. సంధ్య జపము మొదలగునవి ఆచరించి, పితృదేవతలు, ఋషులు మొదలగు వారికి తర్పణ చేసి, బంగారపు తీగెలతో గూడినదియు, ముత్యములు మొదలగువానితో అలంకరింపబడినదియు, నిర్మలమైనదియు, విచిత్రములగు పట్టుదారములతో కూడినదియు, చిగురుటాకులు, పుష్పగుత్తులు మొదలగువాని నుంచి విచిత్రముగా ముడులు వేయబడినదియు, తెల్ల ఆవాలు, అక్షతలు మొదలైనవానితో మిశ్రితమైనదియును, మనోహరమైన కంకణమును, ఒక బంగారపు కలశమును బియ్యముచే నిండించి, దాని పైన ఆ కంకణమును ఉంచవలయును.
మనోహరంబగు ఆసనంబున కూర్చుండి, తన బంధుమిత్ర బ్రాహ్మణ సమేతుడై, వేశ్యలు మొదలగువారిచే నృత్యము గీతము వాద్యము మొదలగు మంగళ ధ్వనులు జరుపబడుచుండగా మంత్ర సహితముగా పురోహితునిచే రక్షాబంధనమును చేయించుకొనవలయును, అప్పుడు చెప్పవలసిన మంత్రమేదియనగా…
ఓ రక్షా! బలవంతుడును రాక్షసశ్రేష్ఠుడు అగు బలిచక్రవర్తి దేనిచే కట్టబడెనో అట్టి నిన్ను కట్టుచున్నాను కావున కదలకుండా ఉండుమని చెప్పి కట్టవలెను.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మరియు ఇతర జాతుల వారు సమస్తమైన వారును తమ తమ శక్తికొలదియు బ్రాహ్మణులను పూజించి రక్షాబంధనం చేయించుకొనవలయును. ఈ ప్రకారముగా రక్షాబంధనము చేయించుకొనిన వాడు, సమస్త దోషములను పోగొట్లుకొనిన వాడై సంవత్సర పర్యంతము వఱకును సుఖమును కలిగినవాడై యుండును.
పవిత్రమగు శ్రావణమాసములో ఈ చెప్పబడిన రక్షాబంధన విధిని జరుపుకొనిన వాడు సంవత్సర పర్యంతము విశేషమగు సుఖము కలవాడై పుత్రులు పౌత్రులు స్నేహితులు మొదలగు వారితో గూడి సమస్త సుఖముల నొందును. పరిశుద్ధమగు వ్రతమును ఆచరించువారు రక్షాబంధనమును భద్ర తిథి యందు చేయకూడదు. భద్ర తిథియందు రక్షాబంధనమును చేసిన ఎడల వ్యతిరేక ఫలమిచ్చును అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే — “ఉపాకర్మోత్సర్జన, శ్రవణాకర్మ, సర్పబలి, సభాదీప, హయగ్రీవ జయంతీ, రక్షాబంధనవిధి” కథనం నామ ఏకవింశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము