శ్రావణమాస మహాత్మ్యము – 2వ అధ్యాయం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, సనత్కుమారుని ప్రశ్నలకు ఈశ్వరుడు సమాధానమిస్తూ, శ్రావణ మాసం (Shravana Masam) తనకెంతో ప్రియమైనదని, దీని మహిమను ఎవరికీ వెల్లడించకపోయినా, సనత్కుమారుని భక్తి, నిర్ద్వేష గుణాలకు మెచ్చి వివరంగా చెబుతాడు. శ్రావణంలో నక్త వ్రతం, రుద్రాభిషేకం (Rudrabhishekam), లక్ష పత్రి పూజ, కోటి లింగార్చన, పంచామృత అభిషేకాలు (Panchamrit Abhishekam), శివ పంచాక్షరీ స్తోత్రం , గాయత్రీ మంత్ర (Gayatri Mantra) జపాలు, పురుష సూక్త జపం, నవగ్రహ హోమాలు చేయాలని, ఒక ప్రియమైన వస్తువును త్యజించాలని సూచిస్తాడు. ఈ మాసంలో ఎల్లప్పుడూ సత్యం పలకడం, బ్రహ్మచర్యం పాటించడం, నేలపై శయనించడం, అన్నాది ఆహార నియమాలు, ఇంద్రియ నిగ్రహం పాటించడం ద్వారా విశేష ఫలాలు లభిస్తాయని ఈశ్వరుడు తెలియజేస్తాడు.
శ్రావణ మాసంలో ఆదివారం సూర్యుని, సోమవారం శివుని, మంగళవారం మంగళ గౌరీని (Mangala Gauri), బుధ, గురువారాల్లో బుధ, బృహస్పతిని, శుక్రవారం జీవంతిక, ఆంజనేయ (Anjaneya), నరసింహ దేవతలను (Lord Narasimha) పూజించాలని శివుడు వివరిస్తాడు. శుక్ల పక్షంలో విదియ నాడు ఔదుంబర, తదియ నాడు గౌరీ, చవితి (Chaviti) నాడు దూర్వా గణపతి (Ganapathi), పంచమి నాడు (Panchami)నాగుల పూజ, షష్ఠి నాడు సూపోదన, సప్తమి నాడు శీతల, అష్టమి (Ashtami)నాడు పవిత్రారోపణ, నవమి (Navami)నాడు నక్త వ్రతం, దశమి (Dashami) నాడు ఆశాసంజ్ఞం, ఏకాదశి (Ekadashi) నాడు విష్ణు వ్రతం, ద్వాదశి (Dwadashi) నాడు పవిత్రారోపణ వ్రతాలు ఆచరించాలని పేర్కొంటాడు. అలాగే పూర్ణిమ నాడు ఉపకర్మ, రక్షాబంధనం వంటి ఏడు కర్మలు, బహుళ పక్షంలో సంకష్ట చతుర్థి (Sankashta Chaturthi), మానవ కల్పాది, కృష్ణాష్టమి (Krishna Ashtami), పిఠోర వ్రతాల గురించి, ప్రతి తిథికి అధిదేవతలను పూజించడం గురించి వివరిస్తాడు. ఈ మాసం తనకు, విష్ణువుకు అత్యంత ప్రియమైనదని, తమ ఇద్దరికీ భేదం లేదని చెబుతూ, శ్రావణ ధర్మాలను ఆచరించడం ద్వారా అపరిమితమైన ఫలాలు లభిస్తాయని ఉద్ఘాటిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 2
శ్రావణమాస మహాత్మ్యము – 2వ అధ్యాయం
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
ఈశ్వరుడు చెప్పుచున్నాడు…
మహానుభావుడవును బ్రహ్మమానస పుత్రుడవును అగు ఓ సనత్కుమారా నీవు చేసిన ప్రశ్న బాగుగానున్నది. జ్ఞానము కలవాడవు. వినువారు – మంచి గుణములు కలవారును, భక్తి కలవారును, శ్రద్ధ కలవారును అయిన ఎడల వారికి కోరిన ప్రశ్నలను గురించి ముఖ్యముగా చెప్పవలయును.
ఓ మునీశ్వరా! శ్రావణమాసమును గురించి నీవు చేసిన ప్రశ్న, ఇదివరలో ఎవరికిని తెలియబడనప్పటికిని నీ యందుండెడి మిక్కిలి ప్రేమ చేత చెప్పుచున్నాను. నీవు ద్వేషము లేనివాడవు, విధేయుడవు, ప్రియమైన వాడవు అయితివి. నీ తండ్రియైన బ్రహ్మ గర్వించి యుండుటచే ఐదవ శిరస్సును భేదించితిని. నీ తండ్రికి అవమానం కలిగినదనే ద్వేషము లేక నన్ను శరణను పొందితివి గాన, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పెదను, సావధాన మనస్సు గలవాడవై వినుము.
ఓ మునీశ్వరా! ప్రతి మనుష్యుడును శ్రావణమాసములో ‘నక్త వ్రతమును’ జేసి నెల దినములలో ప్రతి దినమందును రుద్రాభిషేకమును చేయుచుండెవలెను. తనకు ప్రియమైన వస్తువు ఏది అయినను ఒకటి విడువలయును. పుష్పములు, ఫలములు, ధాన్యములు, తులసీ దళములు, మారేడు దళములు మొదలగు వానిచే ఈశ్వరునకు లక్ష పత్రి పూజ చేయవలయును. కోటి లింగార్చనమును చేయించి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును.
ఈశ్వర ప్రసాదమును ధరించుటయు, ఒకప్పుడు పారాయణము జేయుటయు, ఒకప్పుడు ఉపవాసము చేయుటయు, నాకు మిక్కిలి ప్రీతికరమైన పంచామృతములతో అభిషేకమును జేయుచుండవలయును.
ఓ మునీశ్వరుడా! ఈ శ్రావణమాసములో చేయబడు ధర్మములన్నియు విశేష ఫలమునిచ్చునవి యగును. ఈ వ్రతములను ఆచరించువాడు, మంచము మొదలగు వానిని విడచి పెట్టి నేల యందే శయనించవలయును. సత్యముగా మాట్లాడుచుండవలయును. బ్రహ్మచర్య వ్రతమును సలుపుచుండవలయిను. ఈ మాసమున ఎప్పుడును వ్రత శూన్యమైనదానిగా వెళ్లబుచ్చగూడదు. ఆహార విషయములో అన్నము తినగూడదు. హోమాదుల యందు ఉపయోగింపబడిన అన్నము మిగిలిన ఎడల అట్టి అన్నమును భుజియించవచ్చును.
ఓ మునీశ్వరుఁడా! ఆకులను భక్షింపవచ్చును. కూరలను భుజింపగూడదు. వ్రతము జేయువాడు సమస్త విధముల చేతను భక్తి గలవాడై యుండవలయును. వ్రతమును ఆచరించువాడు యోగ్యమైన ఆచారము గలవాడై స్థిరమైన మసస్సు గలవాడగుచు, ఇంద్రియములను జయించి, ఉదయమున స్నానము జేయుచు, భూమి పై శయనించుచు, నిత్యమూ నా పూజ చేయుచుండవలయును. శ్రావణ మాసము నందు మంత్రములను పురశ్చరణము జేసిన యెడల కోరికలు సిద్ధింపగలవు. కాబట్టి ఓంకారముతో కూడిన ఆరు వర్ణములు గలవి గాన “శివ పంచాక్షరీ మంత్రమును గాయత్రీ మంత్రమును” జపించవలయును. ప్రదక్షిణములు, నమస్కారములు, వేద పారాయణము జేయించవలయును. ఈ చెప్పబడినవన్నియు చేయించిన ఎడల వెంటనే కోరిన ఫలములనిచ్చునవి అగును.
పురుష సూక్తము చేత జపము చేయుటయు విశేషఫలము కలుగును.
నవగ్రహములను గుఱించి కోటి హోమములు గాని లక్షహోమములు గాని పదివేల హోమమములు గాని తన శక్తి కొలది చేయించిన కోరిన కోరికలు ఫలించునవి యగును. ఎవడైననూ ఈ శ్రావణ మాసములో ఒక్క దినమందైనను ధర్మమును ఆచరింపక వ్యర్థముగా గడపువాడు ప్రలయకాల పర్యంతము నరకములో ఉండువాడగును. నాకు ఈ మాసము ప్రియమైనట్లు మఱియొకటి ఏదైనను ప్రియము కాదు. ఈ మాసము కోరికలు గలవానికి కోరికలను ఇచ్చునదియు మోక్షము కోరువానికి మోక్షమును ఇచ్చునదియు అగును.
ఓ మునీశ్వరా! యేయే దినములయందు యేయే వ్రతములను ఆచరింపవలయునో చెప్పెదను వినుము…
ఆదివారము నందు సూర్యుని వ్రతమును, సోమవారము నందు నా యొక్క పూజను చేసి రాత్రులయందు భుజింపవలయును.
మొదటి సోమవారము మొదలు మూడు మాసముల పదిహేను దినముల వరకు రోటకమను వ్రతమును ప్రతి సోమవారము నందు ఆచరింపవలెను. సమస్త కోరికలను ఒసగును.
మంగళవారము నందు మంగళ గౌరీదేవిని, బుధవార గురువారముల యందు బుధుని మరియు బృహస్పతిని పూజింపవలయును.
శుక్రవారము నందు “జీవంతిక” అను దేవతను, ఆంజనేయ, నరసింహ దేవతలను పూజింపవలెను.
శ్రావణమాసమునందు శనివారముతో గూఁడిన యేయే తిధులయందు యేయే వ్రతమును ఆచరింపవలయునో జెప్పెదను వినుము.
శుక్ల విదియ నాడు – ఔదుంబర వ్రతమును చేయవలెను. శ్రావణ శుక్ల తదియ నాడు – గౌరీ వ్రతమును, శుక్ల చవితి నాడు – దూర్వా గణపతి వ్రతమును ఆచరింపవలయును. ఈ దూర్వా గణపతి వ్రతమునకే వినాయక వ్రతమనియు రెండవ పేరు గలదు.
ఓ మునీశ్వరుడా! శుద్ధ పంచమి నాడు సర్పములను (నాగులను) పూజించవలెను. ఈ సర్ప పూజయే సృష్టి మొదలుకొని జరుగుచున్నది. షష్ఠి నాడు – సూపోదన వ్రతము, సప్తమి నాడు – శీతల వ్రతము, అష్టమి నాడు – పవిత్రారోపణ వ్రతము శుక్ల కృష్ణ పక్షములందలి – రెండు నవమి తిథుల యందు నక్త వ్రతము ఆచరించవలెను.
శుక్ల దశమి నాడు – ఆశాసంజ్ఞం యనెడు వ్రతమును చేయవలయును.
శుక్ల కృష్ణ రెండు పక్షముల ఏకాదశుల యందును విష్ణు సంబంధమైన వ్రతమును చేయవలయును.
శుక్ల ద్వాదశి నాడు – విష్ణువునకు పవిత్రారోపణమను వ్రతమును చేయవలయును, ద్వాదశి యందు విష్ణుమూర్తిని పూజించినయెడల ఉత్తమమైన పదమును పొందగలరు.
ఉపాకర్మ, ఉత్సర్జనము, నభా దీపము, రక్షాబంధనము, శ్రవణా కర్మ, సర్పబలి, హయగ్రీవావతారము, అనెడు ఈ ఏడును పూర్ణిమ యందు ఆచరింపవలయును.
శ్రావణ బహుళ చవితి నాడు – సంకష్ట చతుర్థీ వ్రతమును చేయవలెను.
శ్రావణ బహుళ పంచమి నాడు – మానవ కల్పాది అను వ్రతమును చేయవలయును.
శ్రావణ బహుళ అష్టమి నాడు – శ్రీకృష్ణ స్వరూపముగా భగవంతుని పూర్ణమైన అవతారము ఉద్భవించెను గాన, ఆ దినమందు మిక్కిలి ఉత్సవముతో కృష్ణాష్టమి వ్రతమును చేయవలెను.
శ్రావణ బహుళ అమావాస్య నాడు – పిఠోరము అను వ్రతమును ఆచరింపవలయును. ఆ దినమునందు దర్భలను గ్రహించి వృషభములను పూజింపవలయును.
శుక్ల పాడ్యమి మొదలు ఏయే తిథులకు ఏయే దేవతలు అధిపతులై యుందురో వానిని చెప్పెదను, సావధానమనస్సు గలవాడవై వినుము…
పాడ్యమికి – అగ్ని
విదియకు – బ్రహ్మ
తదియకు – పార్వతి
చవితికి – గణపతి
పంచమికి – సర్పములు
షష్టికి – కుమారస్వామి
సప్తమికి – సూర్యుఁడు
అష్టమికి – శివుడు
నవమికి – దుర్గ
దశమికి – మృత్యుదేవత
ఏకాదశికి – విశ్వేదేవతులు
ద్వాదశికి – విష్ణుమూర్తి, మన్మధుడు
త్రయోదశికి – యముడు
చతుర్దశికి – శివుడు
పౌర్ణకమికి – ఇంద్రుఁడు
అమావాస్యకు – పితృదేవతులు అధిపతులై యుండిరి.
కాబట్టి యేయే తిథికి ఏయేదేవతులు అధిపతులై యుండిరో ఆయా తిధులయందు ఆయా దేవతలను పూజింపవలయును.
అగస్త్యోదయ మాసము కూడ తరచుగా ఈ శ్రావణమాసము నందే కలుగును కాబట్టి, ఓ మునీశ్వరుడా! అట్టి కాలమును గురించి వివరించి చెప్పుచున్నాను స్థిర చిత్తముతో వినుము.
సింహ సంక్రమణము ప్రవేశించిన పిమ్మట పండ్రెండు దినముల నలభై ఘడియలు గడచిన అనంతరము అగస్త్యోదయమగును. ఇది మిక్కిలి పుణ్యకాలమని చెప్పబడెను. అగస్త్యోదయమునకు పూర్వము ఏడు దినములు అగస్తునకు పూజ ఆచరించవలయును. మరి కొందరి మతము ఉదయాత్పరమందును కూడ చేయవచ్చునని ఉన్నది.
చైత్రము మొదలు పండ్రెండు మాసముల యందు సూర్యుడు పండ్రెండు నామములచే జెప్పబడుచున్నాడు. శ్రావణమాసము నందు సూర్యుడు (గభస్తి) యనే పేరుచే ప్రకాశించుచుండును. కాబట్టి ఈ శ్రావణమానము నందు మిక్కిలి భక్తికలవారలై గభస్తి అను సూర్యునికి పూజచేయవలయును.
శ్రావణము మొదలు నాలుగు మాసముల యందును చెప్పబడిన వ్రతములను జేయుచు, శ్రావణమాసములో కూరను, భాద్రపదములో పెరుగును భుజింపక విడువవలయును.
ఓ మునీశ్వరా! ఆశ్వయుజ మాసమునందు పాలను, కార్తిక మాసమునందు ద్విదళమును విడువవలయును.
ఈ చెప్పబడినవన్నియు జేయుటకు సమర్థుడు కాని యెడల, ఒక శ్రావణమాసమునందైనను చెప్పినరీతిగా చేసినయెడల అన్ని మాసముల యందును చేసిన ఫలమును పొందువాడగును. కాబట్టి, నా ఉద్దేశమును సంక్షేపముగా నీకు జెప్పితిని.
ఓ మునీశ్వరా! ఈ శ్రావణ మాసమునందు చేయ తగిన వ్రతములను ధర్మములను గురించి నూరు సంవత్సరముల పర్యంతమును జెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు.
నాకును, విష్ణుమూర్తికిని ప్రీతి కొరకు సమస్త వ్రతములను చేయవలయును. యథాతధముగా విచారించిన ఎడల మా ఇద్దరికీ ఎంతమాత్రము భేదము లేదు. ఎవరైతే… మా ఉభయులకు భేదమున్నట్లు తలచునో అట్టివారు నరకమును పొందుచున్నారు. కాబట్టి, ఓ మునీశ్వరా! శ్రావణ మాసమునందు ధర్మమును ఆచరింపవలయును.
ఇతి శ్రీ స్కాందపురాణే ఈశ్వర సనత్కుమార సంవాదే శ్రావణవ్రతోద్దేశన కథనం నామ ద్వితీయోధ్యాయ స్సమాప్తః|
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏