Shravana Masa Mahatmyam Day – 17 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 17

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుద్ధ సప్తమి నాడు ప్రారంభించి అష్టమి (Ashtami) నాడు ముగించాల్సిన “పవిత్రారోపణ వ్రతం” గురించి వివరించాడు. ఈ వ్రతం ఆచరించడం వల్ల సమస్త యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రల ఫలం లభిస్తుందని, ధనం లేకపోవడం, దుఃఖాలు, రోగాలు, శత్రు భయం వంటివి దూరమవుతాయని చెబుతాడు. వ్రతం కోసం సమస్త పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని, పంచగవ్యాలను (Panchagavya) ప్రాశన చేయాలి. గౌరీదేవిని (Goddess Gouri Devi) ఆవాహన చేసి, రాత్రంతా జాగరణ చేసి, మరుసటి రోజు ఉదయం భూతబలి ఇచ్చి, పవిత్రమును దేవతకు సమర్పించాలి. రాజులు స్త్రీల పట్ల ఆసక్తి, జూదం, వేట వంటి వాటిని, బ్రాహ్మణులు స్వాధ్యాయం, వైశ్యులు వ్యాపారం వంటివి ఈ వ్రత నియమంగా ఒక రోజు నుండి ఏడు రోజుల వరకు విడిచిపెట్టాలని ఈశ్వరుడు వివరించాడు. ఈ వ్రతం చేయకపోతే సంవత్సరం పొడవునా చేసిన పూజలు నిష్ఫలమవుతాయని శివుడు హెచ్చరిస్తాడు.

తరువాత పవిత్రం ఎలా తయారు చేయాలో వివరిస్తూ, బంగారు, వెండి, పట్టు లేదా ప్రత్తి దారంతో (Cotton Thread) పవిత్రం తయారు చేయవచ్చని, దీనికి 360, 270 లేదా 180 బెత్తల పొడవు, నూరు, యాభై నాలుగు లేదా ఇరవై నాలుగు ముడులు ఉండవచ్చని చెబుతాడు. పవిత్రంలోని మూడు పోగులలో బ్రహ్మ, విష్ణు, రుద్రులను, తొమ్మిది పోగులలో నవ దేవతలను, ముడులలో ‘క్రియా’ మొదలగు పది దేవతలను ఆవాహన చేయాలని వివరిస్తాడు. ఇంకా, శ్రావణ మాసంలో శుక్ల పక్షంలోని రెండు నవమి తిథులలో ‘కుమారీ’ రూపంలో దుర్గాదేవిని (Goddess Durga Devi) పూజించి నక్త వ్రతం చేయాలని చెబుతాడు. పెళ్లికాని కన్యకు భోజనం పెట్టి, మిగతావారికి భోజనం పెట్టాలని సూచిస్తాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి పుత్ర, పౌత్ర భాగ్యాలు, ఐశ్వర్యం లభించి, చివరికి మోక్షం లభిస్తుందని శివుడు తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.

🍃🌷సప్తదశోధ్యాయము – పవిత్రారోపణ వ్రతము:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు…

ఓ మునీశ్వరుడా! శ్రేయస్కరమగు పవిత్రారోపణ వ్రతమును చెప్పుచున్నాను వినుము. 

ఈ వ్రతమును సప్తమి దినంబున ప్రారంభించి, అష్టమి దినంబున సమాప్తి చేయవలసినదిగా శాస్త్రము నందు చెప్పబడెను.

పవిత్రారోపణ వ్రతమును చేయువాని యొక్క ఫలమును చెప్పెదను వినుము. సమస్త యజ్ఞములు (Yajna) చేసిన ఫలమును,  సమస్త తీర్థముల యందు స్నానము చేసిన ఫలమును, సమస్త దానములు చేసిన ఫలమును పొందుచున్నాడు. ఇందులో ఎంత మాత్రము సందేహము లేదు. పార్వతీ దేవి (Parvati Devi) సమస్త జీవములందును వ్యాపించి యున్నందు వలన చేయదగినది. ఈ వ్రతము చేసినవానికి ధనము లేక పోవుట, దుఃఖములు, పీడ రోగములు, శత్రువుల వలన భయము సంభవింపదు. అట్టి వానికి ఎప్పుడును గ్రహముల పీడయు కలుగదు. వాని యొక్క కార్యములు కొద్దివైనను గొప్పవైనను సిద్ధించుచున్నవి.

ఓ చిన్నవాడా! సమస్త ప్రజలకు ఇంత కంటే పుణ్యమును వృద్ధి పొందించు నట్టి వ్రతము మరియొకటి లేదు. స్త్రీలకు ముఖ్యముగా సౌభాగ్యమును కలిగించును, ఇది నీ యందు ప్రేమచే ప్రకటన చేసి చెప్పబడుచున్నది. కాబట్టి, ఓ మునీశ్వరా! శ్రావణ శుక్ల సప్తమీ (Shukla Saptami) దినంబున ప్రారంభించి, గౌరీ దేవి యందు భక్తి కలవారలై, సమస్త సాధన ద్రవ్యములను సమకూర్చుకొని, గంధము, పుష్పమాలు, ఫలములు మొదలగు పూజా ద్రవ్యములనన్నియు సంపాదించి, అనేక విధములగు నైవేద్య పదార్ధములను, వస్త్రములు ఆభరణములు మొదలగు వానిని సంపాదించి, శుభ్ర పరచి, పిమ్మట తాను పంచగవ్యములను ప్రాశన చేయవలయును.

అన్నముతో అష్ట దిక్కుల యందును బలులను ఉంచి, గౌరీదేవిని ఆవాహన చేసి, ఆధివాసము చేయవలయును. శుభ్రమగు నూతన వస్త్రముల చేతను పవిత్రములగు మామిడి చిగుళ్లు మొదలగువాని చేతను పవిత్రమును చుట్టవలయును.

దేవి యొక్క మూల మంత్రముచే నూరు పర్యాయములు పవిత్రమును అభిమంత్రించి, సమస్త శుభములను ఒనగూడునట్లుగా అలంకరించి, దేవి ముందు ఉంచవలయును. దేవతకు మంటపమును ఏర్పరచి, నేర్పరులగు వేశ్యలు, నర్తకులు మొదలగు వారిచే నాట్యము, గీతము వాద్యము మొదలగునవి మనోహరముగా నుండు నట్లు చేయించి, ఆ రాత్రి అంతయు జాగరణముచే కాలక్షేపము చేసి, ప్రాతః కాలంబున యధావిధిగా స్నానాది నిత్యకృత్యములు నెరవేర్చి, తిరిగి ఎనిమిది దిక్కులయందును భూత బలిని ఉంచవలెను.

పిమ్మట దేవతను యధావిధిగా పూజించి, స్త్రీలకును బ్రాహ్మణులకును భోజనము పెట్టవలయును. పవిత్రమును దేవతకు అర్పణ చేయవలయును. ఆదియందును, అంతమందును తన శక్తి కొలది దక్షిణను ఉంచవలయును. 

ఓ మునీశ్వరా! వ్రతమును ఆచరించు వాని యొక్క నియమములను చెప్పెదను వినుము. 

స్త్రీలయందు అభిలాష, జూదమాడుట, వేటాడుట, మద్యపానము మొదలగునవి రాజులు విడువవలయును.

బ్రాహ్మణులు స్వాధ్యాయము చేయగూడదు. వైశ్యులు వ్యవసాయము, వర్తకము చేయకూడదు. ఇటువంటి నియమము ఏడు దినములు గాని, ఐదు దినములు గాని, మూడు దినములు గాని, ఒక్క దినము గానీ లేక నాలుగు జాములు పర్యంతము గాని నియమము జరపవలయును. ఎల్లప్పుడు దేవతా పూజా వ్యాపారము నందే తన మనస్సున కోరికను ఉంచవలెను.

ఓ మునీశ్వరా! విద్వాంసుడైనవాడు పవిత్రారోపణ వ్రతమును చెప్పిన రీతిగా చేయకుండెనేని సంవత్సర పర్యంతము చేసిన పూజ అంతయు నిష్ఫలమగును.

కాబట్టి, శుభములను ఒసగునటు వంటి పవిత్రారోపణ వ్రతమును దేవీ ధ్యానాసక్తులై, భక్తి కలవారలగుచు, ప్రతి సంవత్సరమును తప్పక చేయుచుండవలెను. 

సూర్యుడు కర్కాటక రాశి (Karkataka Rashi) యందు గాని, సింహ రాశి (Simha Rashi) యందు గాని ప్రవేశించి యుండగా, శుక్ల పక్ష అష్టమి యందు వ్రతమును చేసి, పవిత్రమును దేవతకు అర్పణ చేయవలయును. ఈ వ్రతమును చేయని ఎడల నిశ్చయముగా దోషము సంభవించును.

🌻సనత్కుమార ఉవాచ:

దేవతలకు దేవుండవగు ఓ సాంబమూర్తీ!  నీ చేత చెప్పబడిన పవిత్రము అనునది ఏవిధముగా చేయవలయునో దాని విధానమును అంతయు సవిస్తరముగా చెప్పుమని సనత్కుమారుడు అడిగెను.

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు…

బంగారము, వెండి, రాగి మొదలగు వానితో సూత్రములు చేయవలయును, లేక పట్టు దారముతో చేయవలయును లేక ప్రత్తితో చేయ వలయును లేక దర్భరెల్లుతోనైనా చేయవలయును. బంగారము మొదలగు లోహములతో చేయని పక్షము నందు ప్రత్తితో చేయుట మంచిది, ప్రత్తితో చేయని పక్షము నందు బ్రాహ్మణునిచే దారము తీయించి, ఆ దారమును మూడు మడుపులు మడచి, ఆ మడచిన దారమును తిరిగి మూడు ముడుపులు మడువవలయును. ఇట్లు పవిత్రమునకు ఉపయోగించు దారము మొదటగా (360) మూడు వందల ఆరువది బెత్తల పొడుగు గలిగియుండుట ముఖ్యము. (270) రెండు వందల డెబ్బది బెత్తల పొడుగు కలిగి యుండుట,  రెండవ పక్షం, నూటయెనుబది బెత్తల పొడుగు గలిగియుండుట మూడవపక్షము, కాబట్టి తన శక్తిని అనుసరించి చేయవలయును.

ఆ పవిత్రమునకు నూరు ముడులు ఉండుట ముఖ్యము. యాభై ముడులుండుట మధ్యమము. ముప్పదియారు ముడులుండుట కనీసము. నాలుగు వేదములను, షడంగ విద్యలచే హెచ్చింపగా ఇరువది నాలుగు సంఖ్యగా అవి అగును. లేక రెండు పండ్రెండ్లు ఇరువది నాలుగు యగును కాబట్టి, అటువంటి ఇరువది నాలుగు ముడులు గాని, పండ్రెండు ముడులు గాని ఎనిమిది ముడులుగా, పవిత్రమునకు ఉండునట్లు చేయవలయును. లేక, మరియొక పక్షమున నూటయెనిమిది ముడులు ముఖ్యము, యాభై నాలుగు మధ్యమము, ఇరువదియేడు కనీసము.

ఇక పవిత్ర ప్రమాణమెంత అనగా… శిరస్సు మొదలు నాభి వరకు ఉండునంత పొడవు గలది, హీనము, తొడలు వరకు నుండునటువంటి పొడవు మధ్యమము, మోకాళ్ల వరకు నుండునటువంటి పొడవుగలది ఉత్తమము. ఇటువంటి ప్రమాణము ముడివేసిన పిమ్మట ఉండవలెను.

శ్రేయస్కరములగు ఆ పవిత్రములకు వేయబడిన ముడులనన్నింటిని కుంకుమచే అలంకరింప చేసి, శోభస్కరమగు ఆ మండపమున దేవతకు ముందు భాగమున ఉంచవలయును. అది ఏవిధముగా అనగా, ఆ పవిత్రములను ఒక కలశమునందుంచి,  ఆ కలశమును వేరు పాత్రయందు ఉంచవలయును. మొదట మూడు ఆవృత్తులుగా ఉండు సూత్రము నందు బ్రహ్మ (Lord Brahma), విష్ణు (Lord Vishnu), రుద్రులను (Lord Eswara) ఆవాహనము చేయవలయును. తొమ్మిది ఆవృత్తులు కలుగు దానియందు… 

1. ఓంకారము

2. చంద్రుడు

3. అగ్ని

4. బ్రహ్మ

5. ఆదిశేషువు

6. చంద్రుడు

7. సూర్యుడు

8. ఈశానుడు

9. విశ్వేదేవతలు

ఈ తొమ్మండుగురు అధిదేవతలను తొమ్మిది పోగులందు ఆవాహనము చేయవలెను.

ఇక ముందు పవిత్రమునకు వేయబడిన ముడుల యందు ఆవాహనము చేయ తగిన దేవతలను చెప్పెదను వినుము…

“క్రియా, పౌరుషీ, వీరా, విజయా, అపరాజితా, మనోన్మనీ, జయా, భద్రా, ముక్తిః, ఈశా” 

ఈ చెప్పబడిన దేవతలను ఆవాహనము చేయవలయును. ఈ నామములకు మొదట ‘ఓం’ కారమును, చివర ‘నమః’ పదమును చేర్చవలయును. ఆది ఏవిధముగా అనగా..

1. ఓం క్రియాయై నమః

2. ఓం పౌరుష్యై నమః

3. ఓం వీరాయై నమః

4. ఓం విజయాయై నమః

5. ఓం అపరాజితాయై నమః

6. ఓం మనోన్మన్యై నమః 

7. ఓం జయాయై నమః

8. ఓం భద్రాయై నమః

9. ఓం ముక్యై నమః

10. ఓం ఈశాయై నమః

ఈ ప్రకారం నామములు పదింటిని ఉచ్చరింపుచు, పది ముడులు అయిన పిమ్మట తిరిగి ‘క్రియా’ మొదలగు నామములనే చెప్పుచు ఆ పవిత్రమునకు ఉండు ముడులను అనుసరించి ఆవృత్తిగా చెప్పవలయును.

ఓ మునీశ్వరా! పవిత్రారోపణము గురించి చెప్పితిని. ఇక ముందు పాడ్యమి మొదలు పౌర్ణమి (Purnima) వరకు పదునైదును, అమావాస్యతో కూడా పదునారు తిథుల యందు ఆవాహనము చేయ తగిన దేవతలను చెప్పెదను వినుము. కుబేరుడు (Kubera), లక్ష్మీ, గౌరి, వినాయకుడు (Vinayaka), సోముడు, బృహస్పతి, సూర్యుడు (Lord Surya), చండిక, అంబ, వాసుకి, సప్తఋషులు, విష్ణువు, అనంతుడు, శివుడు, బ్రహ్మ, పితృదేవతలు (Pitru devata), ఈ పదియారు అధిదేవతలను పాడ్యమి మొదలుగా, ఆయా తిధుల యందు, ఆయా దేవతలను ఆవాహనము చేసి, పూజింపవలయును. పవిత్రమును అర్పణ చేయుట ముఖ్య దేవతకే చేయవలయును. ఇతర దేవతలకు అర్పించు పవిత్రమునకు మూడు పోగులు గలదిగా ఏర్పరచవలయును.

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు…

ఓ మునీశ్వరా! ఇక ముందు నవమి యందు చేయతగిన వ్రతమును చెప్పెదను వినుము..

శ్రావణమాసములో రెండుపక్షముల నవముల యందును ‘కుమారీ’ అను పేరుచే చెప్పబడు దుర్గా దేవిని యధావిధిగా పూజించి, నక్త వ్రతము చేయుచు, రాత్రి వరకు ఉండి, పాలును గాని, తేనెను గాని భక్షించి యుండవలయును, లేక ఏమియు భక్షింపక నిరాహారుడుగానైనా ఉండవలయును.  రెండు నవముల యందు దేవిని కుమారియను నామముచే ఆవాహనము చేసి పూజింప వలయును.

పాపములను హరింప చేయునట్టి దుర్గాదేవి యొక్క ప్రతిమను వెండితో చేయించి, ఈ ప్రతిమను గన్నేరు పువ్వులతోను, అగరు మొదలగు సుగంధ ద్రవ్యములు కలసిన మంచి గంథముతోను, పది విధములగు సుగంధ ద్రవ్యములు గల ధూపముతోను, కుసుములతోను, పూజింపవలయును. అనంతరము పెండ్లి కాని కన్యకకు భోజనము పెట్టి, పిమ్మట బ్రాహ్మణులు సువాసినీ స్త్రీలను భుజింప చేయవలెను.

అనంతరము తాను ఇతర సంభాషణలను ఏమియు చేయక, మౌనము గలవాడై మారేడు దళములను (Bilva Leaves) భక్షించి ఉండవలయును. ఈ ప్రకారము మిక్కిలి శ్రద్ధ గలవాడై ఎవడు దుర్గాదేవిని పూజించునో అటువంటి వాడు సమస్తమైన వారికి గురువగు భగవంతుడు ఉండే ఉత్కృష్ట స్థానమునకేగును. కాబట్టి, బ్రహ్మమానసపుత్రుడవగు ఓ సనత్కుమార మునీశ్వరా! సమస్త పాపములను పోగొట్టునదియు, మనుష్యులకు సమస్త సంపత్తులను ఇచ్చునదియు, పుత్రులు పౌత్రులు కలిగించునదియు, చివరకు మోక్షమునొసగునదియు అగు ఈ నవమీ వ్రత సంబంధమగు కృత్యమునంతయును నీకు సవిస్తరముగా చెప్పితినని సాంబమూర్తి, సనత్కుమార మునీశ్వరునితో చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – “అష్టమ్యాం దేవీ పవిత్రారోపణ” వ్రత కథనం నామ సప్తదశోధ్యాయస్సమాప్తః.        

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి పజ్జేనిమిదవ అధ్యాయం >>

Also Read

Leave a Comment