11వ అధ్యాయం – రోటక, ద్వితీయౌదుంబర వ్రత కథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, సనత్కుమారుడు శ్రావణమాసం విశిష్టత గురించి ఈశ్వరుని అడుగుతాడు. దీనికి ప్రతిస్పందిస్తూ శివుడు (Shiva) మాసాలలో శ్రావణ మాసం శివ స్వరూపమైనదని, ఈ మాసంలోని ముఖ్యమైన తిథులలో ఆచరించవలసిన వ్రతాలను వివరిస్తాడు. అందులో మొదటిది శ్రావణ శుద్ధ పాడ్యమి (Padyami) సోమవారం నాడు చేయవలసిన ‘రోటక వ్రతం’. ఈ వ్రతంలో పూజా సంకల్పం చేసి, మారేడు (Bilva), తులసి (Tulasi), కలువలు వంటి వివిధ పుష్పాలతో సాంబమూర్తిని పూజించి, ఐదు రొట్టెలను (Roti) నివేదన చేయాలని చెబుతాడు. వాటిలో ఒకటి దేవునికి, రెండు బ్రాహ్మణులకు, రెండు తాను భుజించాలని సూచిస్తాడు. ఈ వ్రతం ఐదు సంవత్సరాలు చేస్తే సంపూర్ణ ధనవంతులు అవుతారని, అనంతరం బంగారు (Gold), వెండి (Silver) రోటకములతో ఉద్యాపన చేయాలని ఈశ్వరుడు తెలియజేస్తాడు.
రెండవది, శ్రావణ శుద్ధ విదియ నాడు ఆచరించవలసిన ‘ఔదుంబర వ్రతం’. ఈ వ్రతం వల్ల లక్ష్మీ సంపద, పుత్రులు కలుగుతారని శివుడు వివరిస్తాడు. ఈ వ్రతంలో మేడిచెట్టుకు (Medi chettu) లేదా గోడపై దాని రూపాన్ని లిఖించి, శివుడిని, శుక్రుడిని పూజించాలి. ముప్పై మూడు మేడిపండ్లను మూడు భాగాలుగా చేసి, 11 పండ్లు దేవుడికి నివేదించి, 11 పండ్లు బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన 11 పండ్లను తాను భుజించాలని చెబుతాడు. అన్నం తినకుండా రాత్రంతా జాగరణ చేయాలని సూచిస్తాడు. ఈ వ్రతం 11 సంవత్సరాలు ఆచరించిన తర్వాత, బంగారంతో మేడిచెట్టు ప్రతిమ చేయించి హోమాలు చేసి ఉద్యాపన చేయాలని చెబుతాడు. ఇలా వ్రతం చేసిన వారికి అనేక పుత్రులు కలిగి వంశ వృద్ధి, లక్ష్మీ సంపద కలుగుతాయని ఈశ్వరుడు సనత్కుమారునికి తెలియజేస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 11
శ్రావణమాస మహాత్మ్యము – 11వ అధ్యాయం
ఏకాదశాధ్యాయము:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻సనత్కుమార ఉవాచ:
ఓ జగద్రక్షకా! ఏడు వారములను గురించి వ్రతములను నీవు చెప్పగా వింటిని. అమృత తుల్యములగు వాక్యములెంత వినినను నాకు తృప్తి తీరలేదు. నీ మాటల వలన శ్రావణమాసముతో సమానమగు మాసము మరి యొకటి లేదని నాకు తోచుచున్నది. అందువలన శ్రావణమాసములో తిథుల యందు కల్గిన మహిమను కూడ వినవలయునని యున్నది. కాబట్టి, వాటి మహిమను కూడా చెప్పుమని సాంబమూర్తిని సనత్కుమారుడు అడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు….
ఓ మునీశ్వరా! మాసములలో కార్తీకము (Karthika Masam) శ్రేష్ఠమైనది, దానికంటే మాఘ మాసము (Magha Masam) ఉత్తమమైనది. దానికంటెను వైశాఖము (Vaishaka Masam) అధికమైనది. మాఘమాసము విష్ణు (Lord Vishn) ప్రీతికరమైనది. నేను ప్రపంచ స్వరూపుడను కాబట్టి, యీ నాలుగు మాసములు నాకు ప్రీతికరమైనవి, మరియు పండ్రెండు మాసములలోను శ్రావణమాసము శివ స్వరూపమైనది. శ్రావణమాసములో తిథులు అన్నియు వ్రతములు కలవియే యగును. ఐనను శ్రేయస్సును ఒసగు నట్టి ప్రధానమగు కొన్ని తిథులను గురించి చెప్పెదను వినుము.
ఈ శ్రావణమాసములో ఏ వారముతో, ఏ తిథి గూడిన ఏ వ్రతమును జేయవలయునో చెప్పెదను వినుము.
శ్రావణ మాసములో సోమవారము పాడ్యమి యందు వచ్చిన ఎడల, ఆ మాసమునందు ఐదు సోమవారములు వచ్చును. కాబట్టి, పాడ్యమి సోమవారం నాడు, రోటకము అను వ్రతమును మనుష్యులు చేయతగియున్నది. ఆది మొదలు, మూడు మాసముల పదిహేను దినముల పర్యంతము రోటకమను వ్రతమును చేయవలయును. అట్లు చేసిన లక్ష్మీ ప్రదమనియు, సమస్త కోరికలను ఇచ్చుననియు చెప్పబడెను.
ఓ మునీశ్వరుడా! ఆ వ్రతము యొక్క విధానమును చెప్పెదను సావధాన చిత్తము గలవాడవై వినుము. వ్రతమును చేయ దలచిన వాడు శ్రావణ శుద్ధపాడ్యమి సోమవారం ఉదయమున – ఈ రోజు మొదలు ప్రారంభించి రోటక వ్రతమును చేసెదను. ఓ జగద్గురువా! నా యందు దయగల వాడగుమని ప్రార్థన చేసి, సంకల్పము చేయవలయును.
భగ్నము గాని మారేడు దళములు, తులసీ దళములు, నల్ల కలువలు, పద్మములు (Lotus), ఎర్ర కలువలు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, గోరింట పువ్వులు, జిల్లేడు పువ్వులు, మరియు ఆ ఋతువు యందు కలిగెడు శుభ ప్రదములగు ఇతర పుష్పములు మొదలగువాని చేతను సాంబమూర్తికి నిత్యము పూజచేసి ధూప దీపముల నొసగి యనేక విధములగు ఫలములను నివేదన చేయవలయును. మరియు వురుషుడు భుజించు నట్టి ఆహార పరిమితి గల ఐదు రొట్టెలను చేసి వానిలో ఒకటి దేవునకు నివేదన చేసి రెండు రొట్టెలను బ్రాహ్మణునకిచ్చి రెండు రొట్టెలను తాను భక్షింపవలయును.
మిగిలిన పూజనంతయు చేసి అర్ఘ్యమును విడువవలయును. నివేదన చేయుటకు అరటి పండ్లు, కొబ్బరికాయలు, నిమ్మ పండ్లు, మాదీఫలములు (Madiphalam), ఖర్జూర పండ్లు, దోస పండ్లు ద్రాక్ష పండ్లు, నారింజ పండ్లు, జామ పండ్లు, పనస పండ్లు (Jackfruit), దానిమ్మ పండ్లు మొదలగునవి ఆ ఋతువు నందు సంభవించిన ఫలములన్నియు నివేదనకు ఉపయోగింపవలయును.
అర్ఘ్యప్రదానము చేయుట ముఖ్యమైనది అందు వలన కలిగెడు పుణ్యఫలమును చెప్పెదను వినుము. సప్త సముద్రముల పర్యంతము ఉండునట్టి భూమిని దానమిచ్చిన ఫలమును యధావిధిగా వ్రతము చేసినందువలన పొందును, మరియు విశేషమగు ధనమును కోరువాడు ఈ వ్రతము ఐదు సంవత్సరములు చేసిన యెడల సంపూర్ణ ధనవంతుడగును. అనంతరము ఉద్యాపన చేయవలయును. రోటక వ్రతమునకు ఉద్యాపన చేయునప్పుడు బంగారముతోను వెండితోను రెండు రోటకములను చేయించవలెను.
పూర్వ దినమున మంటపారాధనము చేసిన మరునాడు ఉదయమున శివ సంబంధమగు మంత్రముచే, నేతి తోటి, శుభప్రదములగు మారేడు దళముల తోటి, హోమమును చేయవలయును.
ఓ సనత్కుమారుడా! ఈ ప్రకారము రోటక వ్రతమునకు ఉద్యాపన చేసిన ఎడల సమస్త కోరికలను పొందును.
మరియు, విదియ తిథి యందు చేయ తగినదియు, శుభప్రదమగునదియు, పాపములను పోగొట్లునదియు, ఐన ఔదుంబరము అను వ్రతమును చెప్పెదను. ఆ వ్రతమును శ్రద్ధతో చేసిన మనుజుడు లక్ష్మీ సంపన్నుడును పుత్రులు గలవాడును అగును.
శ్రావణమాసము రాగానే శుభప్రదమగు విదియ తిథి యందు ఉదయమున స్నానము చేసి పరిశుద్ధుడై సంకల్పించి వ్రతము చేయవలయును.
ఈ వ్రతమును చేసిన పురుషుడుగాని, స్త్రీగాని, సమస్త సంపదలను పొందును. ప్రత్యక్షముగా మేడి చెట్టు సంభవించిన ఎడల దానికి పూజచేయవలయును. లేని యెడల గోడయందు దాని రూపమును లిఖియించి నాలుగు నామములచే పూజించవలెను, అవి ఏవి అనగా, ఉదుంబర, హేనుపుష్పక, జంతుఫల, రక్తాండశాలి, అను నామములచే పూజింపవలయును. దానికి అధిదేవతలగు శివుని శుక్రుని ఆ ప్రకారముగానే పూజింపవలెను.
ముప్పది మాడు పండ్లను తీసుకొనివచ్చి మూడు భాగములు చేసి పదకొండు పండ్లు దేవతకు నివేదన చేయవలెను. పదకొండు పండ్లు బ్రాహ్మణునకు దానమియ్యవలయును. పదకొండు పండ్లు తాను భుజింపవలయును గాని, ఆ దినంబున అన్నము తినకూడదు, మరియు శివుని శుక్రుని పూజించి, ఆ రాత్రి అంతయు జాగరణము చేసి గడపవలయును.
ఓ మునీశ్వరా! ఈ ప్రకారము పదకొండు సంవత్సరములు వ్రతము చేసి, అనంతరము వ్రత సంపూర్తి కొరకు ఉద్యాపనము ముఖ్యముగా చేయవలెను.
ఆకులు, పువ్వులు, కాయలు, కలుగునట్లుగా బంగారముతో మేడి చెట్టును చేయించి, ఆ ప్రతిమను శివ శుక్రుల (Shukra) ప్రతిమలను పూజింపవలయును. మరునాడు ఉదయమున మేడి పండ్ల తోను లేక మృదువైన చిన్న కాయలతో గాని నూట ఎనిమిది పర్యాయములు హోమము చేయవలయును. మరియు మేడి సమిధలతోను నువ్వులు, నేతి మొదలగు వానితో హోమము చేసి సంపూర్తినొందించి పిమ్మట, ఆచార్యుని పూజించవలయును.
అనంతరము శక్తి యున్న ఎడల నూరుగురు బ్రాహ్మణులకు గాని లేక పది మందికి గాని, భోజనము పెట్టవలెను. ఓ చిన్నవాడా! ఈ ప్రకారము వ్రతము చేసినందువలన గలిగెడు ఫలమును వినుము. మేడి వృక్షము విశేష ఫలములు గలదగుచు, అన్ని కర్మలకు ఎట్లు ఉపయోగించునో ఆ ప్రకారముగానే అనేక, పుత్రులు కలిగి వంశ వృద్ధి కలవాడగును.
మేడి వృక్షము బంగారము వంటి పుష్పములచే ప్రకాశించినట్లుగా, ఈ వ్రతమును చేసినవారు లక్ష్మీ సంపన్నులై ఉందురు. ఇంత వరకు, ఈ వ్రతమును ఎవరికిని తెలియపరచలేదు. మిక్కిలి రహస్యమైన ఈ వ్రతమును నీవు యోగ్యుడవైనందున నీకు ఒక్కనికే జెప్పితిని. నీవు ఎంతమాత్రము సంశయింపక భక్తి గల వాడవై ముఖ్యముగా ఈ వ్రతమును చేయమని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – ప్రతిపత్ రోటక, ద్వితీయౌదుంబర వ్రత కథనం నామ ఏకాదశోధ్యాయ స్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము