Shravana Masa Mahatmyam Day – 10 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 10

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ మాసంలో శనివారం నాడు చేయవలసిన నృసింహ, శనైశ్చర, మరియు ఆంజనేయ స్వామి పూజా విధానాలను వివరిస్తాడు. శ్రావణ శనివారాలలో గోడపై నృసింహ స్వామి(Lord Narasimha), లక్ష్మీదేవి (Goddess Lakshmi Devi) ప్రతిమలను పసుపు గంధంతో లిఖించి, నల్లని, ఎర్రని పుష్పాలతో పూజించాలని, కజ్జికాయలు, చక్కెరములు (Sugar) నివేదించాలని సూచిస్తాడు. ఈ రోజున బ్రాహ్మణులకు, సువాసినులకు నూనెతో అభ్యంగన స్నానం చేయించి, గారెలతో అన్నం నివేదన చేస్తే నృసింహమూర్తి సంతోషిస్తాడని చెబుతాడు. నాలుగు శనివారాలు (Saturday) ఇలా వ్రతం చేసినవారికి లక్ష్మీదేవి (Lakshmi Devi) స్థిరంగా నివసించి, ధనధాన్యాలు, పుత్రులు కలిగి, అంత్యకాలంలో మోక్షం లభిస్తుందని పేర్కొంటాడు.

శనైశ్చరుని ప్రీతి కోసం కుంటి బ్రాహ్మణుడికి నువ్వుల నూనెతో (Sesame Oil) తలంటి, భోజనం పెట్టాలని, నువ్వుల నూనె, ఇనుము (Iron), కంబళి, నువ్వులు, మినుములు దానం ఇవ్వాలని వివరిస్తాడు. శనిని ఇనుప ప్రతిమలో పూజించి, నల్లని వస్తువులు దానమిస్తే శని పీడ తొలగిపోతుందని తెలియజేస్తాడు. ఆంజనేయ స్వామి (Lord Anjaneya) పూజకు శనివారాలలో రుద్ర సూక్తంతో (Rudra Suktam) నూనెతో అభిషేకం చేసి, సిందూరం కలిపిన నూనె, దాసాని, జిల్లేడు, మందార పుష్పాలతో (Hibiscus Flowers) పూజించాలని చెబుతాడు. ఆంజనేయుని ద్వాదశ నామాలు (Anjaneya Dwadasa Nama Stotram) జపించినవారికి రోగాలు నశించి, బలవంతులుగా, కీర్తివంతులుగా మారతారని, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అన్ని సంపదలు కలుగుతాయని ఈశ్వరుడు వివరించి, ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు… 

ఓ సనత్కుమారా! ఇక ముoదు శనివార వ్రత విధిని చెప్పెదను వినుము. ఆ వ్రతమును అచరించుటచే మాంద్యము పోయి చురుకుగా నుండును.

శ్రావణమాసములో శనివారము నందు నృసింహమూర్తి, శనైశ్చరుడు, ఆంజనేయ స్వామి అను ముగ్గురి యొక్క పూజను చేయవలయును.

గోడ మీద కాని, స్తంభము మీద కాని, జగత్ప్రభువు అగు నృసింహమూర్తి యొక్క ప్రతిమను, లక్ష్మీ దేవి ప్రతిమను పసుపు కలిపిన మంచి గంధముతో లిఖించి శుభ ప్రదములగు నల్లని పుష్పములు, ఎఱ్ఱని పుష్పములు (Red Color Flowers), మొదలగు వానిచే పూజించి, కజ్జి కాయలు, చక్కెరములు, నివేదన జేసి ఆ పిండి వంటకములనే తాను అనుభవించవలయును, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. నూనెతోను, నేతి తోను అభ్యంగనము చేయుట నృసింహమూర్తికి ప్రియమగును.

శనివారము నందు అన్ని కర్మల యందును నూనె ఉపయోగించుట ముఖ్యము కాబట్టి, బ్రాహ్మణులకు సువాసినీ స్త్రీలకును నూనెతో అభ్యంగన స్నానము చేయించవలయును. శనివారమునందు తానును కుటుంబ సహితముగా నూనెతో అభ్యంగనము చేయవలయును. గారెలతో కూడ అన్నమును నివేదన చేసిన ఎడల నృసింహమూర్తి సంతోషించును.

ఈ ప్రకారము శ్రావణమాసములో నాలుగు శనివారముల యందు వ్రతము చేసిన ఎడల వాని ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నివసించి యుండును. ధనము, ధాన్యము, సమృద్ధిగా ఉండును. పుత్రులు లేని వాడు పుత్రులు కలుగు వాడగును ఈ లోకంబున సమస్త సుఖములను అనుభవించి, అంత్యకాలము నందు మోక్షము నొందును. 

నృసింహమూర్తి అనుగ్రహము వలన పది దిక్కుల యందు వ్యాపించునట్టి కీర్తి గలవాడగును. ఇది శ్రేష్ఠమైనది కాబట్టి, నృసింహ వ్రతమును నీకు చెప్పితిని. 

ఈ ప్రకారముగానే, శనైశ్చరుని యొక్క ప్రీతికొరకు చేయదగిన వ్రతమును చెప్పెదను వినుము. 

ఒక కుంటి బ్రాహ్మణుని గాని లేక కుంటి లేని బ్రాహ్మణుని గాని తీసుకొని వచ్చి, నువ్వుల నూనెతో తలంటి, వేడినీళ్లు పోసి స్నానము చేయించవలెను. శ్రద్ధ గలవాడై నృసింహ వ్రతమునకు చేసిన పదార్థములనే చేసి, భుజింప చేయవలయును.

శనైశ్చరుడు నాయందు దయ గలవాడుగా ఉండ వలయునని, శని దేవుడు సంతోషించుట కొరకు నువ్వుల నూనె, ఇనుము, నువ్వులను, మినుములు, కంబళి, పీటలను దానము ఇవ్వవలెను. నువ్వుల నూనెతో శనైశ్చరునకు అభిషేకము చేయవలయును. శని దేవుని పూజించుటకు నువ్వులను, మినుములను, అక్షతలుగా ఉపయోగింపవలయును. 

ఓ మునీశ్వరుడా! ఈ శనైశ్చరుని ప్రార్థన జేయు విధానమును జెప్పెదను సావధానుడవై వినుము. నల్లని వర్ణము గలవాడును, మెల్లగా నడచువాడును, కాస్యప గోత్రుడును, సౌరాష్ట్ర దేశాధిపతియు, సూర్యుని కుమారుడును, వరములను ఇచ్చువాడును, దండకారణ్య మండలంబున ఉండు వాడును, ఇంద్ర నీలమణులతో సమాన కాంతి గలవాడును, బాణములను ధనుస్సును ధరించువాడును, శూలమును ధరించు వాడును, గద్ద వాహనము గలవాడును అధిదేవత యముడును, ప్రత్యధి దేవత బ్రహ్మయు గలవాడును, కస్తూరి ఆగరు మిళితమైన గంథమును పూసికొనినవాడును, గుగ్గిలము ధూపముగా గలవాడు, పులగమునందు ప్రీతిగలవాడును అగు శనైశ్చరుడు నన్ను రక్షించుగాక యని ధ్యానము చేయవలయును.

ఓ బ్రాహ్మణోత్తమా! శనైశ్చరుని పూజించుటకు ఇనుప ప్రతిమ చేయించుట ముఖ్యము. శనిని (Lord Shani) ఉద్దేశించి పూజింపునప్పుడు నల్లని వస్తువులను దానమియ్యవలయును. రెండునల్లని వస్త్రములను, నల్లని ఆవును దూడను, దానమియ్యవలయును. ఈ ప్రకారము యధావిధిగా పూజించి ప్రార్థించవలయును, స్తోత్రమును జపించ వలయును.

రాజ్య భ్రష్టుడైన నల మహారాజు పూజింపగా సంతోషించి తిరిగి నల మహారాజునకు స్వకీయమైన రాజ్యము వచ్చునట్లుగా చేసిన శనైశ్చరుడు నన్ను అను గ్రహించుగాక. 

నల్లని కాటుక వంటి ఆకారము గలవాడును, మెల్లని నడకచే సంచరించువాడును, సూర్యుని వలన ఛాయాదేవి యందు పుట్టినవాడు అగు శనైశ్చరునకు నమస్కారము చేయుచున్నారము. కోణములయందు నుండువాడును పింగల వర్ఞము గలవాడునగు ఓ శనైశ్చరుడా! నీకు నమస్కారము చేసెదను. దీనుడనై నీకు నమస్కరించితిని, గాన నా యందు అనుగ్రహము కలవాడవగుము.

ఈ ప్రకారము స్తోత్రము ప్రార్థన చేసి, మాటిమాటికి నమస్కరింప వలయును. బ్రహ్మ క్షత్రియ వైశ్యుల నెడి మూడు వర్ణముల వారును పూజించునప్పుడు (శంనోదేవీ రభిష్ట యే) అను వేదోక్త మంత్రముచే పూజింపవలయును. శూద్రులు శనైశ్చర నామ మంత్రముచే పూజింపవలయును. స్థిర చిత్తము కలవాడై ఈ ప్రకారముగా శనైశ్చరుని పూజించిన వానికి స్వప్నమందైనను శని వలన భయము కలుగదు. 

ఓ బ్రాహ్మణుడా! యీ ప్రకారము శ్రావణమాసములో ప్రతి శనివారము నందును భక్తితో పూజించి శనైశ్చరుని గురించిన వ్రతమును చేయువానికి శనైశ్చరుని వలన గలిగే అరిష్టములు కొంచెమైనను కలుగవు.

తన జన్మ రాశియందు గాని, అది మొదలు రెండింట, నాలుగింట, ఐదింట, ఏడింట, ఎనిమిదింట, తొమ్మిదింట, పండ్రెండవ స్థానము, ఈ చెప్పబడిన స్థానముల యందు శని యున్న ఎడల పీడను కలుగచేయును. ఆ శనైశ్చరుడు సంతోషించి పీడను పోగొట్టుటకు (శమగ్నిః) అను మంత్రముచే జపము చేసి ఇంద్రనీలమణిని దానమిచ్చిన ఎడల శని సంతోషించి పీడను పోగొట్టును. 

ఇక ముందు, ఆంజనేయ స్వామికి ప్రీతికరమగు పూజావిధిని చెప్పెదను వినము. శ్రావణమాసములో శనివారము నందు రుద్ర సూక్తము చెప్పుచు, నూనెతో అభిషేకము చేసిన ఎడల ఆంజనేయస్వామి సంతోషించును. 

నూనెలో సిందూరము కలిపి సమర్పించవలయును. దాసాన పుష్పమాలికలు, జిల్లేడు పువ్వుల మాలికలు, మందార పువ్వుల మాలికలు, మొదలగువానిచే పూజింపవలయును, మరియు శ్రద్ధా భక్తులు కలవాడై తన శక్తి కొలది షోడశోపచారములచే పూజించిన ఆంజనేయస్వామి సంతసించును మరియు విద్వాంసుడు ఆంజనేయ ద్వాదశ నామములను జపింపవలెను.

హనుమాన్, ఆంజనానూనుః వాయుపుత్రః, మహాబలః, రామేష్టః, ఫల్గుణసఖః, పింగాళః అమితవిక్రమః, ఉదధిక్రమణః, సీతాశోక వినాశకః, లక్ష్మణ ప్రాణదాతా, దశగ్రీవదర్పహా, అని చెప్పబడు ఆంజనేయుని పండ్రెండు నామములను ప్రాతఃకాలంబున పఠియించువానికి అశుభము కొంచమైనను కలుగదు. వానికి నమస్త సంపదలు కలుగుచున్నవి.

శ్రావణమాసములో శనివారము నందు ఈ ప్రకారముగా ఆంజనేయస్వామిని పూజంచిన మనుష్యుడు వజ్రముతో సమానమగు శరీరము గలవాడును రోగము లేని వాడును బలవంతుడును అగును. విశేషమగు బుద్ధిగలవాడై మిక్కిలి చురుకుగా కార్యములను సాధించును. శత్రువులు నశించెదరు మిత్రులు వృద్ధినొందెదరు.

ఆంజనేయస్వామి అనుగ్రహము వలన కీర్తి గలవాడును, పరాక్రమవంతుడును అగును. మరియు ఆంజనేయుని అలయము నందు గూర్చుండి ఆంజనేయుని కవచము లక్షపర్యాయములు పారాయణ చేసిన వాడు అణిమాద్యష్ట సిద్ధులు కలిగి ప్రభువగును, వానిని చూడగానే యక్షులు, రక్షస్సులు, భేతాళములు, పిశాచ ములు మొదలగునవి భయంనొంది గడగడ కడకుచు వేగముగా పారిపోవును.

ఓ సనత్కుమారుడా! శనివారమునందు రావి చెట్టునకు పూజ చేయుటయు, ప్రదక్షిణము చేయుటయు మంచిది. బుద్ధి మాంద్యము కలవాడు ముఖ్యంగా చేయవలయును. ఇట్లు ఏడు వారములు రావి చెట్టునకు ప్రదక్షిణలు చేసిన ఎడల నమస్తసంపదలు కలుగును. శ్రావణమాసములో చేసిన మిక్కిలి ముఖ్యము.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – శనివార వ్రత కథనం నామ దశమోధ్యాయ స్సమాప్తః.  

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి పదకొండవ అధ్యాయం >>

Also Read

Leave a Comment