మాఘ పురాణం | Magha Puranam – Day 30

మాఘ పురాణం – 30 వ అధ్యాయము

Magha Puranam – Day 30

మాఘ పురాణం (Magha Puranam) 30 వ అధ్యాయంలో, మృకండ మహర్షి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుని (Lord Shiva) పూజించి వరం పొందారు. ఆ వర ప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు కానీ, అతని ఆయుష్షు పదహారేళ్లే అని శివుడు నిర్ణయించాడు. పెరిగి పెద్దవాడైన మార్కండేయుని ఆయుష్షు పూర్తవుతున్న సమయంలో, కుటుంబం మొత్తం కాశీకి (Kashi) వెళ్లి శివుని ఆరాధించడం ప్రారంభించింది. రాత్రింబవళ్ళు శివలింగాన్ని (Shiva linga) ధ్యానం చేస్తూ గడిపేవాడు మార్కండేయుడు. పదహారవ జన్మదినం (Birthday) రోజున యముడు అతని ప్రాణాలు తీసుకువెళ్లగా, ధ్యానంలో ఉన్న మార్కండేయుని చుట్టూ తేజస్సు ఏర్పడి యముడు అతని దగ్గరకు చేరలేకపోయాడు. కోపించిన యముడు కాలపాశాన్ని విసిరాడు. భయంతో శివుని ప్రార్థించగా, శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో (Trishul)  యముని సంహరించాడు. తన భక్తుడైన మార్కండేయుని రక్షించడానికి శివుడు యముని చంపడం చూసి ఆశ్చర్యపోయిన దేవతలు, శివుని కోపం చల్లార్చాక, యముని బ్రతికించమని కోరారు. యముడు బ్రతికిస్తూ మరల తన భక్తుల దగ్గరకు రావద్దని హెచ్చరించాడు శివుడు. కుమారుడు చిరంజీవి అవ్వడంతో సంతోషించిన మృకండ మహర్షి, ఈ సంఘటన మాఘమాసం ప్రభావాన్ని తెలియజేస్తుందని భావించి, ఆ మాసం గురించి ప్రజలకు చెప్పుకుంటూ ఉండేవాడు. మాఘ పురాణం – 30 వ అధ్యాయము (Magha Puranam – Day 30) నందు ఈ క్రింది విధముగా …

Magha Puranam – Day 30

మార్కండేయుని వృత్తాంతము

వశిష్టుల (Vasishtha) వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీవిశ్వనాధుని (Kashi Vishwanath)  దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి “మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరించెదను, శ్రద్దగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే, రోజులు గడచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలు అన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలెనే అచిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు “కుమారా! నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ది కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ, పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళ కరమగును గాన, నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును” అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమ శివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులు అందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరుకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసి నందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరు ఇట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించ గలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. ‘చిరంజీవి అయి వర్ధిల్లు’ మని దీవించి నందున వారి వాక్కుల సత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంట బెట్టుకుని బ్రహ్మదేవుని (Brahma) వద్దకు పోవుదము రండు” అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులు అందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ ‘చిరంజీవిగా జీవించు నాయనా’ అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొంత తడవడి “భయపడకు”మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక” యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి “ఓ మునులారా! మీరు పోయి రండు ఇతనికి ఏ  ప్రమాదమునూ జరుగనేరదు” అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.

మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, ‘కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ’ నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదన లేక, కుమారుని విడిచి పెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి. విశ్వేశ్వరాలయ సమీపమందు ఒక  ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివ ధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను.

క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీప మందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు అతని  ప్రాణములను తీసుకొని పోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివ లింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాస వాసుడగు పార్వతీపతి (Parvati Pati) తన భక్తుని ఆక్రందనను విని మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.

యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపము చల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానము అయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతోషించి, తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

Read more Puranas

Leave a Comment