మాఘ పురాణం – 3 వ అధ్యాయము
మాఘ పురాణంలోని (Magha Puranam) మూడవ అధ్యాయం గురుపుత్రి కథ, ఒక ఋషి కూతురి గురించి చెబుతుంది. ఆమె తండ్రి అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు తల్లి చనిపోవడంతో, గురువు వద్ద చదువుకునేందుకు పంపబడుతుంది. గురువు ఆమెను తన కూతురిలా చూసుకుంటాడు, ఆమె తెలివితేటలతో అన్ని విద్యలు నేర్చుకుని రాజును వివాహం చేసుకుని రాణి అవుతుంది. మంచితనంతో ప్రజలను ప్రేమించి పాలించే రాణిగా, కుమారుడు పుట్టి రాజు మరణించాక కుమారుడితో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది. చివరికి కుమారుడు రాజు అయి సంతోషంగా పరిపాలించగా, ఈ కథ మంచితనం ఎల్లప్పుడూ మంచి ఫలితాలనిస్తుందని, మంచి వ్యక్తులుగా మారేందుకు ప్రేరేపిస్తుంది. మాఘ పురాణం – 3 వ అధ్యాయము (Magha Puranam – Day 3) నందు ఈ క్రింది విధముగా …
Magha Puranam – Day 3
గురు పుత్రికా కథ
మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసం స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవి (Parvati Devi) తో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖ పడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖ ప్రదమగును ఆలసించక నావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురు పుత్రికవు మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరక వాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యా దేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమి చేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను.
తండ్రియామెను కాశ్మీర దేశవాసి యగు బ్రాహ్మణనుకిచ్చి వివాహము చేసెను. కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనంద వలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడ వ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి ‘జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నందియిట్లు పలికెను. ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతి హత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషము వలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ (Saraswati River) తీరమున గౌరీ వ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని (Gouri Devi) పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి ‘తండ్రీ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను.’ అప్పుడా యోగి ‘ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము మాఘమాసమున ప్రాతఃస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింప వలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని (Gouri Devi) సమర్పించవలయును. ఈ విధముగ నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘ శుద్ద తదియ నాడు రెండు క్రొత్త చాటాలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీ పూజచేసి ముత్తైదువల కిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింప వలయును. మాఘమాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ (Katyayani) వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి (Lord Vishnu) నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని (Lord Shiva) శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.
Read more Purana