మాఘ పురాణం | Magha Puranam – Day 29

మాఘ పురాణం – 29 వ అధ్యాయము

Magha Puranam – Day 29

మాఘ పురాణం (Magha Puranam) 29 వ అధ్యాయంలోఒకప్పుడు కుత్సుడనే బ్రాహ్మణుడు, కర్దమ ముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు చాలా తెలివైనవాడు, విద్యావంతుడై దేశాటన చేయాలని తల్లిదండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు. మాఘమాసం ప్రారంభం కాగానే అతను కావేరి నది (Kaveri River) ఒడ్డుకు చేరుకున్నాడు. మాఘమాసం పాటు కావేరి నదిలో స్నానం చేయాలని నిశ్చయించుకున్నాడు. మూడు సంవత్సరాలు కావేరి నదిలో స్నానం చేస్తూ శ్రీమహా విష్ణువును (Lord Vishnu)  ధ్యానించాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. మృగశృంగుడు (కుత్సుని కుమారుడు) శ్రీహరిని (Sri Hari) చూసి ఆనందంతో స్తుతించాడు. శ్రీహరి అతని తపస్సు, స్తుతులకు మెచ్చి వరం కోరమని ఆదేశించాడు. మృగశృంగుడు శ్రీహరిని తన దర్శనం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపి, తనకు కోరికలు లేవని, అయితే ఈ ప్రదేశంలో భక్తులకు దర్శనం ఇవ్వాలని కోరాడు. శ్రీహరి అతని కోరికను మన్నించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలం తరువాత మృగశృంగుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అతను కూడా సుశీల అనే యువతిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఒకరోజు సుశీల తన ఇద్దరు స్నేహితులతో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. అప్పుడు ఒక మదించిన ఏనుగు వారిని తరిమింది. భయంతో పారిపోతూ ఒక గట్టు లేని నూతిలో పడి మరణించారు. మృగశృంగుడు ఈ విషయం తెలిసి చాలా దుఃఖించాడు. చనిపోయిన ముగ్గురిని బ్రతికించాలని నిశ్చయించుకున్నాడు. వారి తల్లిదండ్రులకు వారి శరీరాలను రక్షించమని చెప్పి, నదిలో స్నానం చేసి ధ్యానం చేయసాగాడు. మదించిన ఏనుగు అతని దగ్గరకు వచ్చి అతనిని చూస్తూ కొంతసేపు నిలబడింది. తరువాత అతని ముందు తల వంచి తన తోండంతో అతనిని ఎక్కించుకుంది. మృగశృంగుడు శ్రీమహావిష్ణువును స్మరించుకుంటూ దానిపై నీటిని చల్లి, రెండు చేతులతో దానిని స్పృశించాడు. వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి దివ్యరూపంలో ప్రత్యక్షమైంది. శాప విమోచనం కలిగించినందుకు మృగశృంగుడికి కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మృగశృంగుడు తన ధ్యానంతో సుశీల మరియు ఆమె స్నేహితులను బ్రతికించాడు. తరువాత, రాజు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. మాఘ పురాణం – 29 వ అధ్యాయము (Magha Puranam – Day 29) నందు ఈ క్రింది విధముగా …

Magha Puranam – Day 29

మృగశృంగుని కథ

వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయ వలెనని తల్లిదండ్రుల అనుమతి పొంది  ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలేనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. “నాయనా! నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును, నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను”. మృగశృంగుడును “స్వామీ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను, ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను”. శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.

కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలత కల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి, ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు నాల్గింటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడ వలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.

భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల, ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీ స్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల, ఆమె మిత్రురాండ్రును బెదిరి పారిపోవుచు గట్టు లేని నేల బారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను, చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వాని ఏదుట తల వంచి వానిని తోండముతో తన మీదకు ఎక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను.

కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింప వలయునని మరల నదిలో మునిగి యమ ధర్మరాజును ఉద్దేశించి తపము చేయసాగెను, యముడును అతనికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును (కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను, యముని దయ వలన, సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగా కాలిన ఇనుప స్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో, పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రింద మంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులు (Snakes) ఉన్న చోట పడ వేయుదురు అని వారు వివరించిరి.

వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాస స్నానము చేసి, ఇష్టదైవమును పూజించి, యధా శక్తి దానము, జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘ స్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభ లాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ట మహర్షిని (Vashista Maharshi) దిలీపుడు గురువర్యా! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ట మహర్షి నాయనా! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘ స్నానమును, సుశీల మున్నగువారు అనేక మార్లు చేయుట వలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపః ప్రభావము వారిని ఈ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘ స్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.

యముడు ఒకనాడు తన భటులను చూసి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమ భటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను. భయము పోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలును తగ్గ సాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారు ఇంకను ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.

మృగశృంగుని వివాహములు

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశ పర్యటన చేసెను, మాఘమాస స్నానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగు వారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయ వలయునని వాని తల్లిదండ్రులు తలంచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో అంగీకరించిరి. శుభ ముహూర్తమున సుశీలా మృగశృంగులకు వివాహము మహా వైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులు ఇద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు,  ఎక్కువ మంది యువతులను వివాహమాడుట శాస్త్ర విరుద్దము, ధర్మ విరుద్దము కాదు దశరధునకు (Dasharatha)భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునకు (Lord Krishna) ఎనిమిది మంది పట్టపు రాణులు లేరా? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ (Gowri), గంగ (Ganga) ఇద్దరు లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.

కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరునకు ఇచ్చి చేయు వివాహము బ్రహ్మ వివాహము, యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా ఉండుటకై కన్యను ఇచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లి కుమారుని నుండి గోవులను (Gomata) తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహము అందురు. ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు, ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని కూడ   వివరించెను.

దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి వద్ద మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రధ్ధ ఆసక్తులతో వినయ విధేయతలతో తెలివి తేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిట మిన్నయై విద్యలు అన్నిటిని నేర్చెను, మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవ యధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను, సర్వ లాభములను పొందెను, మనుమలను కూడా పొందెను. ఈ విధముగ ఉన్న తన వృద్ధికి సంతృప్తి పొంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమును పొందెను. ఇక, అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠ పుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. *”కాశీ (Kashi) మహా పుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని (Varanasi) చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక, మనస్సునందలి కోరికలు నెరవేరెను, అనేకమంది కాశీ విశ్వనాధుని (Kashi Vishwanath) దర్శనము చేసికొని, వారి అభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గ మధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకొని, కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము చేరినాడు.

కాశీ పట్టణము నానుకొని పవిత్ర గంగానది (Ganga River) తన విశాల బాహువులను చాచి, ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున (Manikarnika Ghat) కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెను అని, తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును (Linga)  ప్రతిష్టించి, దానికి మృకండేశ్వర మహా లింగమని నామకరణము చేసి దానికి ఏదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానము ఆచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా! అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంత కాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీ క్షేత్రము వచ్చినాడు గదా! సంతానము కొరకు భార్యా సమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు(Shiv Parvati) ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితమైన ఆనందము కలిగి, పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. “మహామునీ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్ట మెరిగినపుడు” డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి “తండ్రి! మహాదేవా! తల్లి అనంపూర్ణా! ఇవే మా నమస్కృతులు, లోక రక్షకా! మీ దయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతియగు పత్ని లభించినందు వలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారము అనుభవించు చున్నాము. కాని ఎంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా! కావున మాకు పుత్ర సంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను” అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు “మునిసత్తమా! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికి యున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?”

అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడబడి “హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయము అయినది మొదలు నేటి వరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్ప ఆయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని” అడిగెను. “అటులనే అగునుగాక!” అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరుని అనుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రుని కనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడ వచ్చిరి. వ్యాస మహర్షి (Vyasa Maharshi) కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును, ఋషి సత్తముడునూ అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.

Read more Puranas

Leave a Comment