మాఘ పురాణం | Magha Puranam – Day 26

మాఘ పురాణం – 26 వ అధ్యాయము 

Magha Puranam – Day 26

మాఘ పురాణం (Magha Puranam) 26 వ అధ్యాయంలో, పురాణాల ప్రకారము, మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. ఏ నదిలో స్నానం చేసినా, ఆ నీరు గంగమ్మ తీర్థంతో సమానమని చెబుతారు. ప్రయాగ (Prayag) అనేది మాఘమాస స్నానానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ గంగా (Ganga River), యమున (Yamuna River), సరస్వతి (Saraswati River) నదులు కలుస్తాయి. మాఘమాసంలో ఇక్కడ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. నదీ స్నానంతో పాటు, మూడు వందల అరవై పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. మరో ముఖ్యమైన క్షేత్రం త్రయంబకం (Trayambakam). పడమటి కొండల దగ్గర ఉన్న ఈ క్షేత్రంలోనే పవిత్ర గోదావరి నది (Godavari River) జన్మించింది. మాఘమాసంలో గోదావరి స్నానం సర్వపాపాలను హరించి, ఇహపరాలలో సుఖాన్ని ఇస్తుందని నమ్మకం. మన దేశంలో ఎన్నో నదులు, వాటి తీరాలలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. నందిని, మందాకిని (Mandakini River) , నళిని (Nalini), తామ్రపర్ణి (Tamraparni), భీమరధి (Bhemarathi), గంగా , యమున, నేత్రావతి (Netravati), పంపా (Pampa), కృష్ణవేణి (Krishnaveni), మహేంద్రతనయ, గోదావరి, నర్మదా (Narmada) వంటివి మహానదులు. భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరధి, తుంగభద్ర (Tungabhadra), రేణుక, మలావహరి, కావేరి (Kaveri), తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రా, వశిష్ఠ, కాశ్యపి, సరయు, సర్వపాపహారి, కుశాపతి, పల్గుని, పుణ్యద వంటివి పుణ్యనదులు.  మాఘమాసంలో వీటిలో స్నానం చేయడం కానీ, పేర్లు స్మరించుకోవడం కానీ పుణ్యప్రదం. గౌతమి నదిలో (Gowthami) కొన్ని ప్రసిద్ధ ఉపనదులు కూడా ఉన్నాయి. వరం తప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు (Lord Shiva)  లింగరూపంలో (Linga) దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం బ్రహ్మహత్యా పాపాలను కూడా పోగొట్టగలదని చెబుతారు. పూర్వం, బ్రహ్మ (Brahma) మరియు శివుడు గర్వంతో యుద్ధం చేసి, బ్రహ్మ తలలను నరికివేసిన శివుడికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించింది. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శివుడు అనేక క్షేత్రాలు తిరిగాడు. చివరికి, ప్రయాగలో బ్రహ్మ, విష్ణువులు ఆయనకు స్నానం చేయించి, పాపాల నుండి విముక్తి చేశారు. అప్పటి నుండి, ప్రయాగ మాఘమాస స్నానానికి పెద్ద పవిత్ర స్థానంగా మారింది. మాఘ పురాణం – 26 వ అధ్యాయము (Magha Puranam – Day 26) నందు ఈ క్రింది విధముగా …

Magha Puranam – Day 26

పుణ్యక్షేత్రములలో నదీ స్నానము

ఈ విధముగా అనేక పుణ్య పురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను, వశిష్టుల వారు దిలీప మహారాజునకు వివరించగా, ఆ రాజు “మహర్షి! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు, అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిండని వినమ్రుడై కోరగా వశిష్టుల వారు మరల యిట్లనిరి. దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగా నది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.

ఇక త్రయంబకమను ముఖ్యమైన పుణ్య క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప చేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఏడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే కాక, ఇహమందు, పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో ఏన్నో నదులు ఉన్నవి, ప్రతి నదీ తీరమున ఏన్నో క్షేత్రములు ఉన్నవి, ఆ నదులలో మహా నదులు, పుణ్య నదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరధి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణీ, మహేద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహా నదులు. భగీరధి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణీ, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, క్పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుని కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం, మనము ఆ నదులలో స్నానము చేయలేక పోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉప నదులు కూడా కలసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటు చున్నవి. అటులనే “వరం తప” అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.

విష్ణుమూర్తి (Lord Vishnu) నాభికమలమున పుట్టిన బ్రహ్మకును, ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలు ఉన్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించి నందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదిగా అయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి, తాను నరికిన బ్రహ్మ తలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి “భిక్షాందేహీ” యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, అతనికి “పురుషత్వము నశించునుగాక” అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా (Shiva Linga) మారినందు వలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు, శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.

Read more Puranas

Leave a Comment