మాఘ పురాణం | Magha Puranam – Day 25

మాఘ పురాణం – 25 వ అధ్యాయము 

Magha Puranam – Day 25

మాఘ పురాణం (Magha Puranam) 25 వ అధ్యాయంలో, కలింగ దేశంలో ధనవంతుడైన ఓ కిరాతుడు ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్లిన అతను, నర్మదానది (Narmada River) స్నానం చేసి వెళుతున్న బ్రాహ్మణుడిని చూసి, అతని ధనం లాక్కుకోవాలని దురాశ పడతాడు. ధనం లేదని తెలిసినా కోపంతో ఆ బ్రాహ్మణుడిని చంపి, తరువాత బాటసారులను దోచుకుంటూ దుర్మార్గ జీవితం గడుపుతాడు. అతనికి బంగారపు నగలు చేసే వాడూ, ఒక శూద్రుడూ స్నేహితులుగా ఉండి, వీరంతా కలిసి పాపకార్యాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో, కిరాతుడు తన బ్రాహ్మణ స్నేహితుడితో కలిసి పాపాలు చేయిస్తూ, జ్ఞానియైన వీరవ్రతుడిని కలుసుకుంటాడు. వీరవ్రతుడు వారి పాపాలను తెలియజేసి, వాటి నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరిస్తాడు. తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిన కిరాతుడు, అతని స్నేహితులు వీరవ్రతుని చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కిరాతుడు గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మమార్గంలో నడుచుకుంటూ, సుఖశాంతులతో జీవితాన్ని ముగిస్తాడు.ఈ కథ ద్వారా, ఎంతటి పాపాత్ముడైనా పశ్చాత్తాపపడి, ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపాల నుండి విముక్తి పొందవచ్చు. మాఘమాస స్నానం పుణ్యాన్ని చేకూర్చి, పాపాలను హరిస్తుంది. సజ్జన సాంగత్యం మంచి జీవితానికి దారి తీస్తుంది, అదే సమయంలో దుష్ట సాంగత్యం మనల్ని చెడు దారిలో నడిపిస్తుంది. ధర్మమార్గంలో నడవడమే సుఖశాంతులకు దారి. పాపం యొక్క పరిణామాలు భయంకరమైనవి కాబట్టి, వాటి నుండి ప్రాయశ్చిత్తం ద్వారా బయటపడే మార్గాన్ని ఈ కథ చూపిస్తుంది. మాఘ పురాణం – 25 వ అధ్యాయము (Magha Puranam – Day 25) నందు ఈ క్రింది విధముగా …

Magha Puranam – Day 25

కలింగ కిరాతుడు – మిత్రుల కథ

గృత్నృమద మహర్షి జహ్ను మునితో మరల నిట్లు పలికెను. ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరి ఒక కథను చెప్పెదను శ్రద్దగా వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించి పాప విముక్తుడు ఆగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి (Sri Hari) కథా మహిమను తెలుపును.

పూర్వము ఓక కలింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఓకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే ఒక మఱ్ఱి చెట్టు (Marri Chettu) నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడు ఆతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగు వాటిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటిని బలవంతముగ తీసికొనెను.

ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును ‘నేను దరిద్రుడను నా వద్ద ధనము ఏమియూ లేదని సమాధానము ఇచ్చెను. అతని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో (Sword) నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచు ఉండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. అతనికి ధనమును సంపాదింప వలయునని  కోరిక విపరీతముగా పెరుగుతూ ఉండెను. 

ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయు వాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనా పరుడు, బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకి ఇచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ ఉండెను. అతని వాని తల్లియును అట్టిదే, భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చా వర్తనురాలు అయ్యెను. ఈ విధముగ ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. అతని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలు అయిన తనకి ఇష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయని అనుకొనెను, వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అని అనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఏరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరిని ఒకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలనను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడు అగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహా పాపములు ఒక చోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించిన వాడు, గురుపత్నితో రమించిన వాడు వీరు ఐదుగురును పంచ మహా పాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఒకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్ష మాలలను (Rudraksha Mala) ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు (Govinda Namalu) పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాత మిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడిని అని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి ఇట్లనెను.

ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మొదలగు పాపములను చేసినవాడు మరియు హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించిన వాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచ మహా పాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును వారివలె పాపాత్ముడగును. అటువంటి వారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను (Darbha) చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసిన వాడు, గురుతల్పగమనము చేసిన వాడు, బంగారమును దొంగలించిన వాడు, వీరితో స్నేహము చేసిన వాడు వీరైదుగురు పాపులే. ఇట్టి వారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.

నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి యెట్లు కల్గును? సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని, దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ (Prayag) క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ, సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. గోవు (Gomata) తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము, ఈ ప్రకారము ఒక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింప తగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మమును ఉపదేశింప కోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.

నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును, పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరు వేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలం ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును అచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.

వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్ర జలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.

వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ! నిరంతరము సంతోషముగ ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకుము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము, సంధ్యా వందనము మొదలగు నిత్యకర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని (Harihara) పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచార పడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను (veda) మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృ దినమున (Shradha) శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరి నామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్ష మాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను (Tulasi Mala) ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్య దళములతో (Bilva Patra) శివుని (Lord Shiva) అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము, యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోదాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకుము, మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము, అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరల కాశీ (Kashi) నగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.

Read more Puranas

Leave a Comment