మాఘ పురాణం | Magha Puranam – Day 20

Magha Puranam - Day 20

మాఘ పురాణం (Magha Puranam) 20 వ అధ్యాయంలో, గృత్నృమద మహర్షి జహ్ను ముని మాట్లాడుతూ, శివ, బ్రహ్మల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పాడు. రజో గుణ ప్రధానుడైన బ్రహ్మ, తమో గుణ ప్రధానుడైన శివుడు ఎవరు గొప్పవారో అని చాలా కాలంగా వాదించుకుంటున్నారు. ఒకసారి వారి ముందు అనేక ముఖాలు, నేత్రాలు, బాహువులు, పాదాలు కలిగిన, తేజోమయమైన మహారూపం కనిపించింది. అది శ్రీమహా విష్ణువు అని వారు గ్రహించి, ఆ రూపం యొక్క ఆద్యంతాలు చూడాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

అప్పుడు శ్రీమహా విష్ణువు తానే జగత్కర్త, కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షకుడు, సర్వేశ్వరుడు అని వివరించి, వారి వివాదానికి కారణమైన గుణాల ప్రభావం గురించి చెప్పాడు. తాము ముగ్గురూ ఒకే తత్త్వం నుండి వచ్చినవారమని, బ్రహ్మ సృష్టికర్త, తాను పోషకుడు, శివుడు లయకర్త అని వివరించాడు. బ్రహ్మను స్వతంత్రుడు, సర్వప్రాణుల సృష్టికర్త, దేవతలకు ప్రభువు అని కీర్తించాడు. చివరగా తాను ఏకత్వంలో నుండి అనేకత్వం పొందానని, తాను బ్రహ్మ ఒక్కటేనని, బ్రహ్మ కూడా తనలాగే సమస్త దేవతలకు పూజనీయుడని చెప్పి, వారి వివాదాన్ని పరిష్కరించాడు. మాఘ పురాణం – 20 వ అధ్యాయము (Magha Puranam – Day 20) నందు ఈ క్రింది విధముగా …

గృత్నృమద మహార్షి మరల యిట్లు పలికెను. శ్రీమహావిష్ణువు (Lord Vishnu) తత్త్వమును మహాత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు (Lord Shiva) తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిస్టుడైన అధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా వారి యెదుటనొక మహాారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము, మనోహరము అనంతము అగు ఆ రూపము శ్రీమహా విష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ (Brahma), శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరము అయిన మైన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడ తలచిరి. ఆ రూపము యొక్క ఆద్య అంతములు ఏరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగు దిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని, చివరను గాని చూడ లేక పోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులము అని గమనించిరి. అప్పుడు ఆ రూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుడు. గురువు రక్షించు వాడు సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణుల యందు నివసించువాడు, సర్వ ప్రాణులను తన యందే నిలుపు కొనువాడు, మనము వీనికంటె అధికులము కాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇటువంటి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహాా విష్ణువుని ఇట్లు స్తుతించిరి.

అనంతమూర్తీ ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమనట్లు చేయుము. సర్వాత్మకా ! సర్వేశ్వరా ! సర్వప్రాణి నమస్కృతా !  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవు అందరికిని అన్నిటికిని ఇచ్చువాడవు, సర్వ స్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచునిట్లనిరి.

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహాా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లనెను. బ్రహ్మేశ్వరులారా ! మీరిద్దరును చిరకాలము వివాద పడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము స్వయం ప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహిని బంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును.

జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి, ఇహ లోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదము అనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ద సరిగా లేక పోవుట, శ్రద్ధా లోపముచే కార్యనిర్వహణ శక్తి లేక పోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ (Paramatma) చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములు (Pancha Bhuta) అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు (Gold) ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టి కర్తగను, నేను పోషకునిగను, శివుడు లయ కర్తగను మనము ముగ్గురము అయితిమి. కాన ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదటినుండి భేదము లేదు కదా!

అని బ్రహ్మకు శివునికి శ్రీమహాా విష్ణువు (Sri Maha Vishnu)తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో ఇట్లు అనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదను ఇచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వమును పొందితిని. మనమిద్ధరము ఒక్కటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహార్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.

Credits: @BharatiyaSamskruthi

Read more Puranas

Leave a Comment