మాఘ పురాణం – 15 వ అధ్యాయము
మాఘ పురాణం (Magha Puranam) 15 వ అధ్యాయంలో, ఒక బ్రాహ్మణుడు జ్ఞాన శర్మకు పుత్రుడు కలిగాడు. కానీ, నారద మహర్షి ఆ బాలుడు 12 సంవత్సరాల తరువాత చనిపోతాడని చెబుతాడు. దుఃఖించిన జ్ఞాన శర్మ శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు. శ్రీహరి (Lord Vishnu) కనిపించి, జ్ఞాన శర్మ భార్య పూర్వ జన్మలో మాఘ పూర్ణిమ నాడు పాయసదానం చేయలేదని, అందుకే ఈ గండం ఏర్పడిందని చెబుతాడు.
మాఘమాస స్నానం, వ్రతం గురించి శ్రీహరి వివరిస్తాడు. మాఘమాస స్నానం ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తుంది. మాఘ పూర్ణిమ నాడు గంగోదకంతో పుత్రుడిని తడిపితే గండం తొలగిపోతుందని చెబుతాడు. జ్ఞాన శర్మ శ్రీహరి చెప్పినట్లు చేస్తాడు. బాలుడి గండం తొలగిపోయి, చిరంజీవి అవుతాడు. జ్ఞాన శర్మ, భార్య, పుత్రుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు.ఈ కథ ద్వారా మాఘమాస వ్రతం యొక్క మహిమ తెలుస్తుంది. మాఘమాస స్నానం, వ్రతం చేయడం వల్ల పాపాలు పోయి, పుణ్యం, శ్రీహరి అనుగ్రహం లభిస్తాయి. మాఘ పురాణం – 15 వ అధ్యాయము (Magha Puranam – Day 15) నందు ఈ క్రింది విధముగా …
Magha Puranam – Day 15
జ్ఞాన శర్మ కథ – మాఘపూర్ణిమ
గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను. తపము ఆచరించు బ్రాహ్మణునకు శ్రీహరి (Lord Vishnu) ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నా రాకను కోరి తపము ఆచరించితివి ఎందులకు? నీ మనస్సులోన ఏమి యున్నది చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు ‘స్వామీ ! నాకు పుత్ర వరము నిచ్చి సంతోషము కలిగించితివి, నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారద మహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవు ఇచ్చిన వారము ఇట్ల అయినది, నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తాపమును ఆచరించితిని అని శ్రీహరికి విన్నవించెను.
అప్పుడు శ్రీహరి ‘ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరము నందు గండము కలుగుటకు కారణమును చెప్పెదను వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడి గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరు ఇరువురును భార్యా భర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము, గుణములు కలిగియుండినది. ఆమె భర్త యగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును శ్రద్దగా చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందున్న (తీర్థము) గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందు వలన గండ దోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.
ఓయీ ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘ స్నానము చేయనివరికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ (Brahma), శివుడు (Lord Shiva), లక్ష్మి (Lakshmi Devi), పార్వతి (Parvati), సరస్వతి (Saraswati), ఇంద్రుడు (Indra), వశిష్టుడు (Vashistha) , జనకుడు (Janaka) , దిలీపుడు (Dilipudu), నారదుడు (Narada Muni) వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.
బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుడిని శ్రీహరి చెప్పిన విధముగా మాఘ వ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన మృత్యుగండ దోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని కావించి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్ను మునివర్యా ! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.
మాఘ పూర్ణిమ గురించి కూడా చదవగలరు.
Read more Puranas