మాఘ పురాణం | Magha Puranam – Day 13

మాఘ పురాణం – 13 వ అధ్యాయము

Magha Puranam – Day 13

మాఘ పురాణం (Magha Puranam) 12వ అధ్యాయంలో, పేద బ్రాహ్మణుడు సుశీలుడు దారి తప్పి అడవిలో ఓ రాక్షసుడిని చూస్తాడు. రాక్షసుడు తన పాపాల వల్ల రాక్షస రూపంలో శిక్ష అనుభవిస్తున్నట్లు చెప్పి సుశీలుని సహాయం కోరుతాడు. సుశీలుడు మాఘమాస స్నానం, పూజా విధానాలు చెప్పి, రాక్షసుడి వారసుడు భాష్కలుని వద్దకు పంపుతాడు. భాష్కలుడు సుశీలుడు చెప్పినట్లు చేయగా, రాక్షసుడు రాక్షస రూపం నుండి విముక్తి పొంది పుణ్యలోకం చేరుకుంటాడు. మాఘమాస స్నానం పాపాలను హరిస్తుంది, పూర్వీకులకు తర్పణం చేయడం వారికి మంచి చేస్తుంది, ధర్మం, పూజాదికాలు మోక్షానికి దారి అని ఈ కథ చెబుతోంది. మాఘ పురాణం – 13 వ అధ్యాయము (Magha Puranam – Day 13) నందు ఈ క్రింది విధముగా …

Magha Puranam – Day 13

సుశీలుని కథ

రాజా ! మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని యెట్టి వానికి అయినను కలిగించును. దీనిని తెలుపు మరిఒక్క కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున (Godavari River) సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలదు. అతను ఒకనాడు ప్రయాణము చేయుచు దారి తప్పి భయంకర అరణ్యమున ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను, ఉన్నతములగు వృక్షములతోను, పులి మొదలగు భయంకర జంతువులతోను కూడి ఉండెను. అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస ఆకారము కలిగియుండెను. అక్కడి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుతూ ఉండెను. అతడికి కదలునట్టి అవకాశము లేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇలాంటి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేద మంత్రములను చదువడం ఆరంభించెను. హరినామ (Lord Vishnu) సంకీర్తనము చేయసాగెను.

కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితి యేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వ జన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవి అన్నియూ పాపకర్మలే గోకర్ణ (Gokarna) తీరమున మధు వ్రతమను గ్రామమున గ్రామాధికారిగా  ఉంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను, ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను,  పరుల సొమ్మును అపహరించుతూ ఉండెడివాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని ఏమియు ఇవ్వలేదు. స్నాన, దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవ పూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీలాంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ  మాత్రము పూర్వ స్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహు విధములుగ ప్రార్థించెను.

సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారు కూడా నాలాంటివారే, వారి సంతానము కూడా అటువంటి వారే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వ జన్మలోని వంశములో ఉన్న వానిని భాష్కలుడను వానిని వెదకుచు పోయెను.

సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూసిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును తెలియ చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని (Lord Shiva), కేశవుని కాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక, పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు. 

స్నానము ఏడు విధములు. అవి

  • మంత్రములను చదువుచు చేయు స్నానము, మంత్రస్నానము.
  • మట్టిని రాచుకొని చేయు స్నానము, మృత్తికా స్నానము.
  • భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము, ఆగ్నేయస్నానము.
  • గోవులు నడుచుచూ ఉన్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము, వాయవ్య స్నానము.
  • నదులు, చెరువులు మున్నగువానిలో చేయు స్నానము, వరుణ స్నానము.
  • ఎండగ నున్నప్పుడు వానలో చేయు స్నానము, దివ్య స్నానము.
  • మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము, మానస స్నానము.

ప్రాతః కాలమున స్నానము చేయలేనటువంటి అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠి వారు తదితరులు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును, జుట్టును ముడి వేసికొని స్నానము చేయవలెను.

స్నానము చేయునప్పుడు కౌపీనము (గోచి) ఉండవలయును. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము మరియు దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా ఇష్ట దైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను.  బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానము అయిన తరువాత మూడుమార్లు తీర్థమును స్వీకరించి, ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను, మూడుమార్లు ప్రదక్షిణము చేయవలెను, నదీ స్నానము చేసిన తరువాత తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును, పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.

స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్ట దైవమును స్మరించుచు నీటిలో మరల మునగ వలయును. సూర్యుని, గంగను, దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి (Ratha Saptami), ఏకాదశి (Ekadashi), మహా శివరాత్రి (Maha Shivaratri) మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.

Read more Puranas

Leave a Comment