కార్తీక పురాణం | Karthika Puranam – Day 9

కార్తీక పురాణం – 9 వ అధ్యాయం (విష్ణు పార్షద, యమదూతల వివాదము)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. 

విష్ణు పార్షద, యమదూతల వివాదము (క్లుప్తముగా)

ఆజామిళుడు మరణించేటప్పుడు “నారాయణా – Narayana” అని స్మరించడంతో విష్ణుదూతలు వచ్చి అతని ఆత్మను వైకుంఠానికి (Vaikunta) తీసుకెళ్లారు. అయితే యమదూతలు ఆజామిళుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి అని, అతన్ని నరకానికి తీసుకెళ్లాలని వాదించారు.

విష్ణుదూతలు, యమదూతల మధ్య వాదం జరిగింది. విష్ణుదూతలు, “మనిషి జీవితంలో చేసే పాపపుణ్యాలను దేవతలు నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా యమధర్మరాజు (Yamadharmaraju) తన నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఒక వ్యక్తి చివరి క్షణంలో హరినామాన్ని స్మరించినా అతని పాపాలు క్షమించబడతాయి. అందుకే ఆజామిళుడిని మేము వైకుంఠానికి తీసుకెళ్తున్నాం” అని చెప్పారు.

ఆజామిళుడు తన జీవితంలో ఎన్నో పాపాలు చేసినప్పటికీ, చివరి క్షణంలో ‘నారాయణా’ అని స్మరించడం వల్ల మోక్షం పొందాడు. ఇది హరినామ స్మరణ శక్తిని చూపిస్తుంది. అంటే, మనం ఎంత పాపం చేసినా చివరి క్షణంలో హరినామాన్ని స్మరించడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు. “కార్తీక పురాణం – 9వ అధ్యాయము (Karthika Puranam – Day 9) నందు ఈ క్రింది విధముగా … 

“ఓ యమదూతలారా! మేము విష్ణు దూతలము. వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను”యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు “విష్ణు దూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు, రాత్రి౦బవళ్లు సంధ్యకాలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే (Chitragupta) చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు (Veda Shastra) నిందించు వారును, గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృతిని తిట్టి హింసి౦చువారున్నూ, జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలను పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, శిశు హత్య చేయువారును, శరణు అన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండ్లిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారునూ పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి దండి౦పుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ.

అది అటులుండగా ఈ అజామిళుడు (Ajamila) బ్రాహ్మణుడై పుట్టి దురచారములకులోనై కుల భ్రష్టుడై జీవహింసలు చేసి, కామాంధుడై వావి వరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు?” అని యడగగా విష్ణుదూతలు “ఓ యమకి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును మరియు అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువారును, తటాకములు త్రవ్వి౦చువారును, శివ కేశవులను (Shiva Keshava) పూజి౦చువారును సదా హరి నామస్మరణ చేయువారును మరణ కాలమునందు “నారాయణా” యని శ్రీ హరిని గాని, “శివ” అని శివుని గాని స్మరించువారును, తెలిసిగాని తెలియక గాని మరే రూపమునగాని హరి నామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు! కావున అజామిళుడు ఎంత పాపత్ముడు అయిననూ మరణ కాలమున “నారాయణా” అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము” అని పలికిరి.

అజామిళుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది “ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ (Lord Vishnu) పూజ కానీ, వ్రతములుగాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో “నారాయణా” అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లితండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది” అని పలుకుచు సంతోషముగా విమానమును ఎక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసి కానీ, తెలియక కానీ నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని (Sri Hari) స్మరించిన ఎడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి నవమాధ్యాయము – తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.

“ఓం నమశ్శివాయ”

Also Read

Leave a Comment