కార్తీక పురాణం | Karthika Puranam – Day 25

కార్తీక పురాణం – 25 వ అధ్యాయం (దూర్వాసుడు అంబరీషుని శపించుట)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

దూర్వాసుడు అంబరీషుని శపించుట

అంబరీషుడు పండితుల సలహాను పట్టించుకోకుండా, ద్వాదశీ (Dwadashi) నియమాన్ని పాటిస్తూనే జలపానం చేశాడు. అతని ఈ నిర్ణయానికి కారణం, బ్రాహ్మణునికి అతిథిని ఇవ్వకుండా ఉండటం పాపమని భావించడమే.

అంతలోనే స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు (Durvasa Maharishi) అంబరీషుడు తనను వేచి ఉండకుండా భోజనం చేసినందుకు చాలా కోపగించుకున్నాడు. అంబరీషుడు తన తప్పును అంగీకరించి క్షమాపణ కోరినా, దుర్వాసుడు కోపంతో అంబరీషుడిని తీవ్రంగా శపించాడు. అంబరీషుడు అనేక జన్మలు తీరే శాపాన్ని అనుభవించవలసి వస్తుందని శపించాడు.

అంబరీషుడు దుర్వాసుని శాపానికి భయపడి ప్రార్థించగా, శ్రీమహావిష్ణువు అంబరీషుని హృదయంలో ప్రవేశించి దుర్వాసుడి శాపాన్ని తగ్గించాలని కోరాడు. కానీ దుర్వాసుడు వినకుండా మరింత కోపంగా శపించడంతో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం (Sudarshana Chakra) దుర్వాసుడిని వెంబడించడంతో భయపడిన దుర్వాసుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులను (Lord Maheswara) శరణు కోరాడు. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. చివరకు దుర్వాసుడు అంబరీషుడిని వేడుకోవడంతో విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. “కార్తీక పురాణం” – 25వ అధ్యాయము (Karthika Puranam – Day 25) నందు ఈ క్రింది విధముగా …

“అంబరీషా! పూర్వ జన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము” అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు “ఓ పండితోత్తములారా! నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జల పానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి ఉరకుందును” అని వారి ఎదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ “ఓరీ మదాంధా! నన్ను భోజనమునకు రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశ జూపి పెట్టకుండా తాను తినిన వాడు మల భక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదువే గాని శ్రీ హరి భక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీ హరిని అవమానించుటయే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహా భక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమాన పరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి.

అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజ కుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?” అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో “మహానుభావా! నేను ధర్మహీనుడను, నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడుడని” అతని పాదములపై పడెను. దయా శూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని “దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణునిగాను, ఎదవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవు గాక” అని వెనుక ముందు ఆలోచించక శపించెను.

ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహా విష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి “మునివర్యా! అటులనే – మీ శాపమనుభవింతు” నని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయును అని తలంచి ప్రాణముపై ఆశ కలిగి, అచటి నుండి “బ్రతుకు జీవుడా” అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము (Chakrayudha) దూర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహా మునులను, దేవలోకమున కెరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని (Lord Brahma), కైలాసమునకు (Kailas) వెళ్లి పరమేశ్వరునీ ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము (25వ అధ్యాయం) ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.

Also Read

Leave a Comment