కార్తీక పురాణం | Karthika Puranam – Day 24

కార్తీక పురాణం – 24 వ అధ్యాయం (అంబరీషుని ద్వాదశీ వ్రతము)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

అంబరీషుని ద్వాదశీ వ్రతము (క్లుప్తముగా)

అత్రి మహర్షి అగస్త్యునితో, కార్తీక ద్వాదశీ వ్రతం గురించి ఒక కథ చెప్పారు. పూర్వం అంబరీషుడు (Ambarish) అనే మహారాజు ఉండేవాడు. అతను ఎంతో భక్తిమంతుడు. ప్రతి ద్వాదశి (Dwadashi) రోజున వ్రతం చేసేవాడు. ఒకసారి ద్వాదశి రోజున దుర్వాస మహర్షి (Durvasa Maharishi) అంబరీషుడి ఇంటికి వచ్చాడు. అంబరీషుడు అతనికి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ దుర్వాసుడు స్నానం చేసి రావడానికి ఎంతో సమయం పట్టింది. ద్వాదశీ ఘడియలు దాటిపోతున్నాయి. అంబరీషుడు వ్రతం చేస్తున్నాడు కాబట్టి భోజనం చేయాలా? లేక దుర్వాసుని కోసం వేచి ఉండాలా? అని చాలా సంశయపడ్డాడు.

అంబరీషుడు తన సందేహాన్ని పండితులను అడిగాడు. పండితులు దుర్వాసుడు వచ్చే వరకు వేచి ఉండమని చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణునికి ఆహారం పెట్టడం మన ధర్మం. అయితే అంబరీషుడు దుర్వాసుడు రాకపోతే ద్వాదశీ వ్రతం భంగమవుతుందని భయపడ్డాడు. చివరకు అంబరీషుడు ద్వాదశీ ఘడియలు దాటే ముందు భోజనం చేయాలని నిర్ణయించుకున్నాడు.

అంబరీషుడు తన నిర్ణయానికి కారణాలను వివరించాడు. బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వకపోవడం పాపం. ద్వాదశీ వ్రతాన్ని భంగం చేయడం కూడా పాపం. ఈ రెండు పాపాలలో ఏది పెద్దది అని పండితులను అడిగాడు. పండితులు బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వకపోవడం పెద్ద పాపమని చెప్పారు. అంబరీషుడు దుర్వాసుని కోపానికి భయపడకుండా ద్వాదశీ ఘడియలు దాటే ముందు భోజనం చేశాడు. “కార్తీక పురాణం” – 24వ అధ్యాయము (Karthika Puranam – Day 24) నందు ఈ క్రింది విధముగా …

అత్రి మహాముని మరల అగస్త్యునితో “ఓ కుంభసంభవా! కార్తిక వ్రత ప్రభావము ఎంత విచారించిననూ, ఎంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును. అలకింపుము.

“గంగా నది (Ganga River), గోదావరీ నది (Gadavari River) మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయముల నందు స్నానాదులు అనుసరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజ తత్వమును తెలిపెడి కార్తిక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దాన, ధర్మములు చేయు వారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తిక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి (Ekadashi) రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై అలకింపుము” అని ఇట్లు చెప్పుచున్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే, ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి, బ్రాహ్మణ సమారాధనమును చేయదలచి సిద్దముగా ఉండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును కావున, తొందరగా స్నానమున కేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచి యున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను.

“ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఎంత వరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిధ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును. వ్రత భంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకు ఏమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించి పోకూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన ఎడల, శ్రీ హరి (Sri Hari) భక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును.

ద్వాదశి ఘడియలను విడిచి భుజించిన భగవంతునకు, భోజనమును చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియును కాక, ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు అని అలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే బోగొట్టగలడు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచిదని”, సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లు చెప్పెను.

“ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున ఏకాదశి వ్రతం చేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహా మునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంత వరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రత భంగమును సమ్మతించి ముని వెచ్చే వరకు వేచి యుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన”దని కోరెను.

అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి “మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలు అందరికంటే అధికుడై దేఇంటికి వచ్చిన అతిధి కడజాతి వాడైనాను ‘భోజన మిడుదు’ నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడును, మహ తపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలుగును. అందువలన ఆయుఃక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను” అని విశదపరచిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము (24 అధ్యాయం) ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.

Also Read

Leave a Comment