కార్తీక పురాణం | Karthika Puranam – Day 22

కార్తీక పురాణం – 22వ అధ్యాయం (పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

పురంజయుడుచే కార్తీక పౌర్ణమి వ్రతము (క్లుప్తముగా)

వశిష్టుని ఉపదేశాన్ని పాటిస్తూ పురంజయుడు కార్తీక పౌర్ణమి (Karthika Pournami) రోజున శుచిగా స్నానం చేసి, దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని పూజించాడు. పూజ అనంతరం, ఒక వృద్ధ బ్రాహ్మణుడు పురంజయుడిని కలుసుకొని, తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి యుద్ధానికి సిద్ధపడమని దీవించాడు.

పురంజయుడు ఆ బ్రాహ్మణుని మాటలను నమ్మి యుద్ధానికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుని (Lord Sri Narayana) అనుగ్రహంతో పురంజయుడు శత్రువులను ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఈ విజయానికి కారణం కార్తీక పౌర్ణమి (Pournami) రోజున చేసిన పూజ మరియు శ్రీమన్నారాయణుని అనుగ్రహమేనని తెలుసుకున్నాడు.

శ్రీమన్నారాయణుని కటాక్షం ఎంతటి శక్తివంతమైనదో ఈ కథ ద్వారా తెలుస్తుంది. విషం తాగినా అమృతమే అవుతుంది అని, శ్రీహరి నామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులు అవుతారని, కార్తీక మాసంలో దీపారాధన (Deeparadhana) చేసిన వారికి సర్వ విపత్తులు తొలగిపోతాయని ఈ కథ వివరిస్తుంది.

బ్రాహ్మణ జన్మ ఎంతటి పవిత్రమైనదైనా విష్ణు భక్తి లేకపోతే ఫలితం ఉండదు. కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది. శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతాడు. “కార్తీక పురాణం” – 22వ అధ్యాయము (Karthika Puranam – Day 22) నందు ఈ క్రింది విధముగా …

మరల అత్రి మహాముని అగస్త్యునకు (Agastya Muni) ఇట్లు చెప్పదొడగెను. పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని (Sri Hari) గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అటువంటి సమయములో విష్ణు భక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు, మెడ నిండా తులసి మాలలను (Tulasi Mala) ధరించి పురంజయుని సమిపించి “రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురైయున్న నీ సైన్యమును కూడా తీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును”, అని దీవించి అదృశ్యుడయ్యెను. “యితడు ఎవరో మహానుభావుని వలెనున్నాడు అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి, యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బ తిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రు రాజుల సైన్యములు నిలువలేక పోయినవి. అదియును కాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి “పురంజయా! రక్షింపుము రక్షింపు” అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రు భయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే అగును. ప్రహ్లాదునకు (Prahlada) తండ్రి విషాన్ని ఇవ్వగా “శ్రీ హరి” అని ప్రార్ధించి త్రాగగా అమృతము అయినది కదా! శ్రీ హరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసము అంతయూ నదీ స్నానమును ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును.

వేదాధ్యయన మొనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు౦డును. సంసార సాగర ముత్తరించుటకు దైవ భక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు (Vyasa), అంబరీషుడు, శౌనకాది మహాఋషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీ హరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనొసంగి కాపాడుచుండెను.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృ దేవతలు (Pitru Devatalu) సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావి౦శోధ్యాయము – ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.

Also Read

Leave a Comment