కార్తీక పురాణం | Karthika Puranam – Day 16

కార్తీక పురాణం – 16 వ అధ్యాయం – (స్తంభ దీపం మహిమ)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

16వ అధ్యాయం కథ (క్లుప్తముగా) 

వశిష్ఠ మహర్షి తన కథనాన్ని కొనసాగిస్తూ, కార్తీక మాసంలో చేయవలసిన పుణ్యకార్యాల గురించి వివరించారు. ముఖ్యంగా, కార్తీక పౌర్ణమి (Karthika Pournami) రోజున స్తంభ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఒక అద్భుతమైన కథను చెప్పారు.

కార్తీక మాసంలో నెల రోజులు తాంబూల దానం చేయడం, దీపం వెలిగించడం వంటి పుణ్యకార్యాలు చేస్తే పాపాలు తొలగిపోయి వైకుంఠం (Vaikuntam) చేరుకోవచ్చు అని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజున స్తంభ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితం అనంతం.

ఒకప్పుడు ఒక శిథిలావస్థలో ఉన్న దేవాలయంలో మునులు కార్తీక మాసం పూజలు చేస్తున్నారు. వారిలో ఒక ముని స్తంభ దీపం వెలిగించాలని ప్రతిపాదించాడు. అందుకు అనుగుణంగా ఒక మొద్దును తీసుకొని దానిపై దీపం వెలిగించారు. ఆ మొద్దులో నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అతను తన పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ స్థితికి చేరుకున్నాడని చెప్పాడు. కానీ, ఆ స్తంభ దీపం వల్ల అతని పాపాలు తొలగిపోయాయి.

ఈ కథ ద్వారా వశిష్టుడు, కార్తీక మాసంలో స్తంభ దీపం వెలిగించడం వల్ల ఎంతటి పాపాలు ఉన్నా తొలగిపోతాయని వివరించారు. స్తంభ దీపం వెలిగించడం వల్ల వైకుంఠం చేరుకోవచ్చని చెప్పారు. “కార్తీక పురాణం” – 16వ అధ్యాయము (Karthika Puranam – Day 16) నందు ఈ క్రింది విధముగా …

వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు (Damodara) ప్రీతికరమైన ఈ కార్తిక వ్రతమును చేయని వాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతర మందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీకమాసము నందు నెల రోజులు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపమును శ్రీ హరి (Sri Hari) సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును. కార్తికమాస మందు పూర్ణిమ నాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసిన యెడల సంతానము గలుగునని భావము. కార్తికమాస మందు శ్రీ హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ, తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు. 

కార్తికమాసమందు పూర్ణిమ నాడు శ్రీ హరి ఎదుట స్తంభ దీపమును బెట్టువాడు వైకుంఠ పతియగును. కార్తికమాసమందు శ్రీ హరి సన్నిధిలో స్తంభ దీపమును (Piller Diya) బెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు శ్రీ హరి సన్నిధిలోకి స్తంభ దీపము అర్పణ చేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నా తరముకాదు. కార్తికమాసమందు పూర్ణిమ రోజున స్తంభ దీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించిన వాడు నరకమునుండు విడుదల కాడు. స్తంభ దీపమును శాలి ధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో గాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వ కథ గలదు. చెప్పెదను వినుము. 

మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక శ్రీ విష్ణు ఆలయము (Sri Vishnu Temple) గలదు. ఆయాలయము చుట్టును వనముండెను. కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులు అచ్చటికి వచ్చి శ్రీ విష్ణువును షోడశోపచారములతోను మాస మంతయును పూజించిరి. వారు అత్యంత భక్తి యుక్తులై శ్రీ హరి ద్వారములందు దీప మాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాస మందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభ దీపమును బెట్టుదము. ఈ దినము కార్తిక పూర్ణిమ అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభ దీప దానము శ్రీ హరికు అత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టు వారి పాపములు నశించి వైకుంఠ లోకమును పొందెదరు. వారందరు ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి.

ఓ రాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు, ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును చూచిరి. కార్తిక వ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆ స్థాణువునందు శాలివ్రీహితిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను (Harikatha) చెప్పికొనుచుండిరి. ఆ సమయమున దేవాలయము ఎదుట చట చట అనే శబ్దములతో స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆ స్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి, దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది, అయ్యో! అయ్యో!  అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనిరి. ఓయీ! నీవెవ్వడవు? ఏ దోషము చేత మొద్దుగా నున్నావు? ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము.

ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయా శూన్యుడనై దుష్ట వర్తన గలవాడ నైతిని. నేను వేద శాస్త్రములను చదువలేదు. శ్రీ హరి చరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనము నందు కూర్చుండి వేదవేత్తలు, సదాచార వంతులు పుణ్య పురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికి ఎన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు. సర్వకాలమందు వారెకెన్నడును ఏ దానమును ఇవ్వలేదు.

ఒకవేళ ఎప్పుడైనను దానము ఇవ్వక తప్పని యెడల ధనము లేకుండ ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండ లేదు. శాస్త్ర శ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడి వాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకముందు అనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండు వేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆ తరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని.

ఇట్లనేక విధములుగా పాప కర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వ భూతదయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వ పాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తిక మాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును. ఆ పూర్ణిమ యందును స్తంభ దీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమ నాడు పరులచే ఉంచ బడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపము నశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది.

ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేని చేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేని చేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరస మునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.

ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్మ్యే షోడశాధ్యాయ సమాప్తః పదహారవ రోజు పారాయణం సమాప్తం.

Also Read

Leave a Comment