కార్తీక పురాణం – 13 వ అధ్యాయం (కన్యాదాన ఫలం)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skanda Purana) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
కన్యాదాన ఫలం (క్లుప్తముగా)
వశిష్టుడు తన కథనాన్ని ఇలా కొనసాగిస్తూ, కన్యాదానం (Kanyadanam) యొక్క మహిమను వివరించారు. “ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో (Karthika Masam) చేయవలసిన పుణ్యకార్యాలలో కన్యాదానం అత్యంత ప్రధానమైనది. కన్యాదానం చేయడం వల్ల లభించే ఫలం అనంతం.
సువీరుని కథ
“పూర్వం వంగ దేశంలో సువీరుడు (Suveera) అనే రాజుండేవాడు. శత్రువులతో యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి, దరిద్రంగా జీవించేవాడు. తన కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ, తన రెండవ కుమార్తెను ధనం కోసం అమ్మాలని అనుకున్నాడు. ఒక సన్యాసి అతనిని కన్యాదానం చేయాలని సలహా ఇచ్చాడు. కానీ, సువీరుడు ధనము కోసం మాత్రమే ఆలోచించేవాడు కాబట్టి, సన్యాసి మాట వినలేదు. ఫలితంగా అతను మరియు అతని పూర్వీకులు నరకయాతన అనుభవించారు.”
కన్యాదానం యొక్క మహిమ
“కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతం. కన్యాదానం చేసిన వారికి స్వర్గలోక (Heaven) ప్రాప్తి కలుగుతుంది. అలాగే, కన్యాదానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. కన్యాదానం చేయకపోతే నరకయాతన అనుభవించాలి. సువీరుడు తన కుమార్తెను అమ్మడం వల్ల అతను మరియు అతని పూర్వీకులు నరకానికి వెళ్ళారు. కానీ, అతని వంశంలోని మరొక వ్యక్తి కన్యాదానం చేయడం వల్ల వారందరూ మోక్షం పొందారు. “కార్తీక పురాణం” – 13వ అధ్యాయము (Karthika Puranam – Day 13) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 13
“కన్యాదాన ఫలం“
తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దాని కంటే ఒక నిరు పేద బ్రాహ్మణుడి (Brahmin) కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒక వేళ ఉపనయనానికి (Upanayana) అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు త్రవ్వించినా, పైన చెప్పినట్లుగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే, తను తరించడమే కాకుండా తన పితృదేవతలను (Pitru Devata) కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను వినుము” అని ఇలా చెప్పసాగాడు…
సువీర చరితం
పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన “సువిరుడను” ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉండేది. ఒక సారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీనితో అతను భార్యతో కలిసి అరణ్యానికి (Forest) పారిపోయి, ధన హీనుడై, నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కంద మూలాలు భక్షిస్తూ గడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రీయ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా, శుక్ల పక్ష చంద్రుడి మాదిరిగా రోజు రోజూ అభివృద్ధి కాసాగింది. అతి గారాబంతో పెరగసాగింది.
అలా రోజులు గడుస్తుండగా, ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినమున వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అంద చందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు “ఓ మునిపుత్రా” ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమును ఇచ్చినట్లయితే నా బిడ్డను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దానితో, ఆ ముని పుత్రుడు చేతిలో పైసా లేకున్నా, బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని (Kubera) మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులను ఇద్దరినీ అత్త వారింటికి పంపాడు.
అలా ముని కుమారుడు తన భార్యను వెంటపెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు ముని కుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ, భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంత కాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్త వయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురు చూడసాగాడు.
ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ (Narmada River) తీరానికి స్నానార్థం వస్తుండగా, దారియందున్న సువీరుడిని కలుసుకున్నాడు. “ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజ వంశంలో పుట్టిన వాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యా పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి” అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు “ఓ మహానుభావా! నేను వంగ దేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్ర శోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యా వియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందు వల్ల రాజ్యభ్రష్టుడనైనా, ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, అతని వద్ద కొంత దానం తీసుకున్నాను. దానితో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా,
“ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా, ధర్మసూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహా పాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్యను విక్రయం చేసే వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థము అగుటయే కాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు.
కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తి కొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మ బుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగా స్నానం, అశ్వమేథ యాగ (Ashwamedha Yagna) ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాపఫలాన్ని తొలగించుకున్న వాడివి అవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.
అందుకు ఆ రాజు చిరునవ్వుతో, “ఓ మునివర్యా! దేహ సుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కు మూసుకుని, నోరు మూసుకుని, బక్కచిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు.
ఆ మాటలు విని ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమ లోకంలో అసిపత్ర వనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడు ఐన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మ యుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతు కీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతట శ్రుత కీర్తి “నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞ యాగాదులు చేశాను. అయినా, నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.
వినయంగా ఇలా చెబుతున్నాడు “ప్రభూ, నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధి శాలివి. ప్రాణ కోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమ ధర్మరాజు శ్రుతకీర్తిని చూచి “ఓయీ, నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా, నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులు అయినా, నరకాలను అనుభవించక తప్పదు. నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే.
అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంనందు సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీ వాళ్లు ఆ పుణ్య ఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. “పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృ గణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.
శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాప విముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.
”ఓ జనక మహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు (Sri Vishnu) సాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.
ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త:
పదమూడో రోజు పారాయణం సమాప్తం.
Also Read