కార్తీక పురాణం | Karthika Puranam – Day 1

కార్తీక పురాణం – 1 వ అధ్యాయం (కార్తీక మాసం మహత్యం)

Karthika Puranam Day 1

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. అజామీళుడు, అంబరీషుడు వంటి పురాణ పురుషుల కథలు కూడా ఈ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. కార్తీక పురాణం స్కంద పురాణం (Skanda Purana) మరియు పద్మ పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. 

నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు, కార్తీక మాసపు మహత్యం గురించి సూత మహర్షిని (Suta Maharshi) అడిగారు. సూత మహర్షి, ఈ పురాణం బ్రహ్మదేవుడు (Lord Brahma), విష్ణువు, శివుడు మరియు లక్ష్మీదేవికి (Lakshmi Devi) వివరించినట్లు చెప్పారు. ఈ పురాణాన్ని వినడం వల్ల మనుషులు ధర్మమార్గాన్ని అనుసరిస్తారు మరియు పరలోకంలో సుఖాన్ని పొందుతారు అని తెలిపారు. పురాణం ప్రకారం, పార్వతి దేవి (Parvati Devi) శివుడిని అన్ని వర్ణాల వారికి సమానంగా ఉపయోగపడే ఒక వ్రతాన్ని చెప్పమని కోరింది. శివుడు ఆమెకు కార్తీక వ్రతం గురించి వివరించాడు.

శివుడు (Shiva) పార్వతి దేవికి, వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక వ్రతాన్ని వివరించినట్లు చెప్పాడు. జనక మహారాజు కార్తీక మాసపు పవిత్రత గురించి తెలుసుకోవాలని వశిష్ట మహర్షిని అడిగాడు. వశిష్ట మహర్షి, కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల మానవులు అన్ని పాపాల నుండి విముక్తి పొందవచ్చు అని వివరించారు. ఈ వ్రతాన్నిఆచరించడానికి వయసు, కులం, లేదా ఆర్థిక స్థితి ముఖ్యం కాదు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఉదయం లేచి స్నానం చేసి, దేవుళ్లను పూజించాలి. కార్తీక పురాణాన్ని (Karthika Puranam) చదవడం మరియు దీపారాధన చేయడం కూడా ముఖ్యమైన అంశాలు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని వశిష్ట మహర్షి చెప్పారు. కార్తీక పురాణం – 1వ అధ్యాయము (Karthika Puranam – Day 1) నందు ఈ క్రింది విధముగా …

ఒకరోజు నైమిశారణ్యం నందు శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులు అయిన సూతమహర్షితో ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాన ఇతిహాసాలను, వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. “కార్తీక మాసం పవిత్రతను, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి” అని కోరారు. 

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు…

”ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మ దేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయం నందు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీ దేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు…

పూర్వం ఒక రోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశ మార్గం నందు విహరిస్తుండగా, పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా, సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కుల మత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతము ఏదైనా ఉంటే వివరించండి” అని కోరింది. అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతము ఒకటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు” అని ఆ దిశగా చూపించాడు…

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడిగాడు “ఓ మహామునివర్యా, మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులము అయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?” అని కోరగా…. 

వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోర వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది..? ఈ నెల గొప్పదనమేమిటి..? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా..?” అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజా! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. 

నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు” అని కార్తీక వ్రతవిధానం చెప్పసాగాడు… 

”ఓ జనక మహారాజా ! ఎవరు అయినా, ఏ వయసు వారైనా పేద, ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్య భగవానుడు తులా రాశిలో ఉండగా వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. 

ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయకుండా నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు వ్రతవిధానం గురించి చెబుతూ –

”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికి పోయి, స్నానమును ఆచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్య భగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృ దేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. 

ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా నది, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. 

ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోకానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం వేళ సంధ్యావందనం చేసి, శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ, తులసి కోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి,  స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. 

ఈ విధంగా వ్రతంను ఆచరించిన మహిళలు, మగవారు గతంలో, గత జన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా, వారికి కూడా సమాన ఫలితం వస్తుంది. 

ఇది స్కంద పురాణంలోని వశిష్ట మహాముని చెప్పిన “కార్తీక మహత్యం” లోని మొదటి అధ్యాయం సమాప్తం.

మొదటి రోజు పారాయణం సమాప్తం.

నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

Also Read

Leave a Comment