Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము పద్దెనిమిదవ రోజు

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల పద్దెనిమిదవ పాశురము ఈ క్రింది విధముగా . . .
Thiruppavai Pasuram – Day 18
తిరుప్పావై 18వ రోజు పాశురము
పాశురము:
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
Credits: @BharatiyaSamskruthi
భావము:
ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి (Goddess Lakshmi Devi), ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి.
రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం.
మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు, లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను “శ్రీ” అంటారు.
లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు.
అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన భాదలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఖిఃస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఖంగా భావించటం.
వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, “వాత్సమ్” అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, “ల” అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా “అగలగిల్లేన్ ఇరయుమ్” అర క్షణం కూడా అమ్మ స్వామిని (Swamy) విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి (Godess Sita Devi) పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్శ్రేయోదాయకం.
అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామిగా (Varahaswamy) వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన రాముడయితే (Sri Ram) అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో (Bhagavatam) మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తుంచేది. అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ నాజ్ఞజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి (Krishna Avatar) నీళాదేవే పురుషకారం అంటారు. ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.
“ఉందు మదకళిత్తన్” మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు “ఓడాద తోళ్ వలియన్” ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అలాంటి “నంద గోపాలన్” నందగోపాలుని “మరుమగళే!” కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. “నప్పిన్నాయ్!” ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. “కందం కమరుం కురలి” సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ.”కడై తిఱవాయ్” గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.
“కోరి అరైత్తన కాణ్” కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా “ఎంగుం ” అన్నీ కోళ్ళు కూస్తున్నాయి “వంద్” తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.
నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. “మాదవి ప్పందల్ మేల్” మాదవి లత ప్రాకిన పందిరి మీద “పల్గాల్” అనేక సార్లు “కుయిల్ ఇనంగళ్” కోకిలల గుంపులు “కూవిన కాణ్” కూస్తున్నాయి.
బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, “పందార్ విరలి” బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.
“ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ” నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. “శెందామరై క్కైయాల్” నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో “శీరార్ వళై ఒలిప్ప” నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, “మగిరింద్” అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో “వందు తిఱవాయ్” నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.
ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం..
Also Read
- Thiruppavai Pasuram Day 1 | తిరుప్పావై పాశురము – 1వ రోజు
- Thiruppavai Pasuram – Day 2 | తిరుప్పావై పాశురము 2వ రోజు
- Thiruppavai Pasuram – Day 3 | తిరుప్పావై పాశురము – 3వ రోజు
- Thiruppavai Pasuram – Day 4 | తిరుప్పావై పాశురము – 4వ రోజు
- Thiruppavai Pasuram – Day 5 | తిరుప్పావై పాశురము – 5వ రోజు
- Thiruppavai Pasuram – Day 6 | తిరుప్పావై పాశురము – 6వ రోజు





