Thiruppavai Pasuram – Day 16 | తిరుప్పావై పాశురము – 16వ రోజు

Thiruppavai Pasuram 16

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల పదహారవ పాశురము ఈ క్రింది విధముగా . . .

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ 

కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 

వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్ 

ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 

మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్

తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా

నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్ 

Credits: @BharatiyaSamskruthi

మన ధనుర్మాస వ్రత (Dhanurmasa Vrata) మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. 

ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది.

ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు.

ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి (Acharya) వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది. 

ఆ భవనంకు ఒక తోరణం ఒక ద్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు.

నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.

“నాయగనాయ్ నిన్ఱ” నాయకుడవై ఉండే “నందగోపనుడైయ” నందగోపుడి “కోయిల్ కాప్పానే!” భవనాన్ని కాపాడేవాడా!

నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ “కొడిత్తోన్ఱుమ్” ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి (Sri Krishna) కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు (Cows) కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. 

మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చేరల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు – ఆ గరుడ ద్వజం. ఇదీ భగవంతుని చేష్ట. “తోరణ వాశల్ ” మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. 

మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని “కాప్పానే” కాపాడేవాడా అని నమస్కరించారు. “మణిక్కదవం ” మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం “తాళ్ తిఱవా” తాళ్ళం తీయవయ్యా. 

ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో “ఆయర్ శిఱుమియరోముక్కు” చిన్న గొల్ల పిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. “అఱై పఱై” వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. 

ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, ” నెన్నలే వాయ్-నేరుందాన్” నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయనచుట్టు తిరగాల్సొస్తుంది, “మాయన్” ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటె “మణివణ్ణన్” ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా. 

ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. “తూయోమాయ్ వందోమ్” చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది “తుయిలెర ప్పాడువాన్” ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని. 

“వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా” అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, “నీ నేశనిలైక్కదవం” శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో (Nanda Gokulam) మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, “నీక్కు” నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం.

Also Read

Leave a Comment