Thiruppavai Pasuram – Day 14 | తిరుప్పావై పాశురము – 14వ రోజు

Thiruppavai Pasuram 14

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల పదనాల్గవ పాశురము ఈ క్రింది విధముగా . . .

ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్

శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్

శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్

తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్

ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్

నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్

శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం

పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

Credits: @BharatiyaSamskruthi

మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా (Vedam) మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. 

మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం – Ramayan, మహా భారతం – Maha Bharat, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. 

లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు (Sri Krishna)దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

“శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్” ఎర్ర కలవలు వికసిస్తున్నాయి “ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్” నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో (Gopabalika) అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, “ఉంగళ్ పురైక్కడై” నీ ఇంటి పెరటి “త్తోట్టత్తు వావియుళ్” తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు (Lotus) కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. 

ఇక్కడ “నీ” అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టించుకోలేదు లోపల గోపబాలిక.

“శెంగల్పొడి క్కూరై” కాషాయాంభరధారులు “వెణ్బల్ తవత్తవర్” తెల్లటి పలు వరుసలు కల్గిన యోగులు “తంగళ్ తిరుక్కోయిల్ ” ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి “శంగిడువాన్” తాళాలు తెరువడానికి “పోగిన్ఱార్” వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞాన ముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ “ఎంగళై” మమ్మల్నందరిని “మున్నం ఎరుప్పువాన్” ముందే లేపుతాను అని “వాయ్ పేశుమ్” వాగ్దానం చేసావు. “నంగాయ్!” పెద్ద పరిపూర్ణురాలివే! “ఎరుందిరాయ్” లేవమ్మా “నాణాదాయ్!” నీకు సిగ్గు అనిపించటం లేదా “నావుడైయాయ్” పెద్ద మాటకారి దానివి.

జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహర విధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో “శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ” ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కలసి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం.

Also Read

Leave a Comment