Thiruppavai Pasuram – Day 12 | తిరుప్పావై పాశురము – 12వ రోజు

Thiruppavai Pasuram 12

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల పన్నెండవ పాశురము ఈ క్రింది విధముగా . . .

పాశురము:

కనైత్తిళఙ్గతైరుమై కన్ఱుక్కిరఙ్గి

నినైత్తుములై వళియే నిన్ఱుపాల్‌శోర,

ననైత్తిల్లమ్‌ శేఱాక్కుమ్‌ నఱ్చల్వన్తఙ్గాయ్‌!

పని త్తలైవీళ నిన్‌వాశల్‌ కడైపత్తి

చ్చినత్తినాల్‌ తెన్నిలఙ్గై క్కోమానై చ్చెత్త

ఇనిత్తా నెలున్దిరాయ్‌ ఈదెన్న పేరు ఱక్కమ్‌

అనైత్తిల్లత్తారు మఱిన్దే లో రెమ్బావాయ్‌

Credits: @BharatiyaSamskruthi

లేగ దూడలను తలుచుకొని గేదెలు (Cows) పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదయైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలివైతివి. 

ఓయమ్మా! మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే (Madhava) నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. 

మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా, ఈ ముప్పేట ధారలతో తడిసి, తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నామమ్మా! ఆనాడు సీతమ్మను (Goddess Sita Devi) అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు (Lord Sri Rama) ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని (Ravan) మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. 

మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది ఏమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దు నిద్దర చాలించి మేలుకో! (నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో) మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను (Gopika)లేపుచున్నారు. 

లక్ష్మణ స్వామివలె శ్రీకృష్ణుని (Sri Krishna) ఎడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకొనే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపుని చెల్లిలిని మేల్కొలుపుతున్నారు. గోపాలురు, గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కల్గనంత వరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు. ఆ కృష్ణ సేవకు యీ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులీ గోకులం వారు. ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని జపంగా చేయటమే ఈ జన్మ సార్ధక మంత్రం, కాబట్టి తైలధారవలెను, నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ తల్లి (యీ మాలికలో) వివరిస్తోంది. 

(హమీరు కల్యాణి రాగము – ఏకతాళము)

ప…ఇకనైనను లేచిరావె! ఏమి మొద్దునిద్దరే? ఇకనైనను నోరు తెరచి మాటాడగ రాగదే?

అ…ప…ఈ కన్నియలందరు నీ వాకిట గుమిగూడిరని ఒకరొకరికి కాదు, ఊరు వాడంతట తెలిసినదే!

1..చ…పాలు పిదుకువారు లేక మహిషీ గణ మరచుచు పాలుద్రాగు లేగలందు భావము ప్రసరించి కారు పాలముంగిలి తడియు సంపదగల వానికి చెల్లెల! తలను మంచు పడుచున్నదె! గడప నాని యున్నామే!

2..చ…దక్షిణ లంకకు ప్రభుడగు రావణు జంపినవానిని అక్షయ మోదము గూర్చిన ఆ ఘన శ్రీరాముని ఏ క్షణమును వీడక కీర్తించుచుండ వినలేదా? 

భగవద్గీత (Bhagavad Gita) రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ, అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి. కానీ అవి ఏవీ కూడా వాడి లోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు. 

వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు. 

ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటి యందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్. 

ఈ క్షణమ్మునైన లేచి రావమ్మా కొమ్మరో! ఇక నైనను లేచిరావె!   

ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం.

Also Read

Leave a Comment