Shravana Masa Mahatmyam Day – 29 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 29

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాంద పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు శ్రావణమాసంలో వివిధ వ్రతాలను ఆచరించడానికి అనువైన తిథులు, సమయాలను వివరించాడు. నక్తవ్రతం చేసేవారు పగలు ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేయాలని, మాస ఉపవాసం పాటించేవారు పాడ్యమి (Padyami) నాడు సంకల్పం తీసుకుని, ఉపవాసం ఉండి మరుసటి రోజు పారాయణం (Parayanam)చేయాలని పేర్కొన్నాడు. వివిధ వార వ్రతాలకు పూజా సమయాలను నిర్దేశిస్తూ, సోమవారం పూజ సాయంకాలం, శుక్రవారం పూజ ఉషఃకాలంలో చేయాలని తెలిపాడు. అలాగే, వివిధ తిథి వ్రతాలకు ప్రత్యేక సమయాలను ప్రస్తావించాడు. ఉదాహరణకు, గణపతి వ్రతానికి (Ganapati Vrat) తదియతో కూడిన చతుర్థి, నాగపూజకు షష్ఠితో కూడిన పంచమి (Panchami) శ్రేష్ఠమని, కృష్ణాష్టమికి (Sri Krishna Janmashtami) అర్ధరాత్రి అష్టమి ఉండాలని ఈశ్వరుడు వివరించాడు.

అదేవిధంగా, పవిత్రారోపణ, ఉపాకర్మ, రక్షాబంధనం వంటి వ్రతాలకు అనువైన తిథులు, సమయాలను శివుడు స్పష్టంగా వివరించాడు. ఉపాకర్మకు (Upakarma) శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ (Purnima) ఉత్తమమని, రక్షాబంధనానికి అపరాహకాలంలో పూర్ణిమ ఉండాలని పేర్కొన్నాడు. సంకష్టహర చతుర్థికి (Sankashtahara Chaturthi) చంద్రోదయ సమయంలో చవితి (Chaviti) ఉండాలని, అయితే తదియతో కూడిన చవితిని మరింత పుణ్యప్రదమని పేర్కొన్నాడు. పిఠోర, పోల వ్రతాలకు అమావాస్య (Amavasya) సమయాలను, దర్భలు సేకరించే సమయాన్ని కూడా వివరించాడు. చివరిగా, ఈ అధ్యాయాన్ని చదివిన లేదా విన్న వారికి శ్రావణమాసంలోని అన్ని వ్రతాలు చేసిన ఫలం లభిస్తుందని ఈశ్వరుడు ఈశ్వర సనత్కుమార సంవాదాన్ని ముగించాడు.

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:

శ్రావణమాసంలో ఏ తిథి నాడు ఏమి ఆచరించాలో చెప్పడం అయింది. ఇప్పుడు ఆ వ్రతాల పాలనకు తిథులు సమయాన్ని ఎలా నిశ్చయించుకుని ఆచరించాలో తెలియజేస్తాను.

నక్తవ్రతం ఆచరించేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యాలన్నది ప్రధాన నియమం. వ్రతాలకు ఉద్యాపన చేసుకోవడానికి సంబంధిత తిథులలో చెయ్యడం ఉత్తమం. ఒక వేళ ఆ తిథులలో కుదరనప్పుడు పంచాంగ శుద్ధి ఉండే రోజున ఆచరించాలి.

శ్రావణమాసమంతా ఉపవాస వ్రత పాలన చెయ్యాలనుకున్నవారు ముందుగా శుక్ల పాడ్యమి నాడు ఉపవాసానికి సంకల్పం చెప్పుకుని ప్రారంభించి , రెండవ రోజు (విదియ) పారాయణం చెయ్యాలి. మరల ఆ మరుసటి రోజు ఉపవాసం ఉండి తరువాతి రోజు పారాయణం చెయ్యాలి. ఇలా క్రమంగా చెయ్యడం మాస ఉపవాస వ్రతం అనిపించుకుంటుంది. పారాయణం రోజున హవిష్యాన్నం (నేతిలో వేయించి ఉడికించిన బియ్యం) స్వీకరించడం ఉత్తమం.

ఏకాదశి (Ekadashi) తిథికి పారాయణం జరిగాక మునుపు చెప్పినట్లు మూడు రోజులు ఉపవాసం చెయ్యాలి.

🌻వారవ్రతాలకు సమయపాలన:

రవివార వ్రతానికి ప్రాతఃకాలమే పూజా సమయంగా భావించాలి. సోమవార వ్రతానికి సాయంకాల పూజ ప్రధానం. మంగళ, బుధ, గురువార వ్రతాలకు ప్రాతః కాలమే పూజ చెయ్యవలసినదిగా పరిగణించాలి. శుక్రవారం పూజ ఉషఃకాలం నుండి సూర్యోదయం లోపుగా ప్రారంభించి రాత్రి జాగరణ నియమం పాటించాలి. శనివారం నరసింహుని (Lord Narasimha) పూజ సాయంకాలం చెయ్యాలి.

శనివారం శనికి సంబంధించిన దానం మధ్యాహ్నం చెయ్యాలి. హనుమంతుని (Lord Hanuman) పూజకు కూడా మధ్యాహ్నసమయమే ఉత్తమం. రావిచెట్టు పూజ ప్రాతఃకాలంలో చెయ్యాలి. 

🌻తిథి వ్రత పాలన నియమాలు:

రోటక వ్రతం ఆచరించడానికి సోమవారం – పాడ్యమి కలిసి వస్తే, పాడ్యమి కనీసం మూడు ముహూర్తాల కాలం అయినా ఉండాలి. లేకపోతే ముందురోజు ఉన్న పాడ్యమినే గ్రహించాలి. ఔదుంబర పూజకు విదియ తిథి సాయంత్రానికి ఉండాలి. రెండు రోజులు విదియ తిథి వస్తే, తదియతో కలిసి ఉన్న విదియనే గ్రహించాలి. స్వర్ణగౌరీ వ్రతం (Swarnagauri Vratham) చవితితో కూడిన తదియను పరిగణలోకి తీసుకుని ఆచరించాలి. గణపతి వ్రతానికి తదియతో కూడిన చవితి ఉత్తమం. నాగపూజ విషయంలో షష్ఠితో కలిసిన పంచమి నాడు చెయ్యడం శ్రేష్ఠం. సూపౌదన వ్రతానికి ఉదయం షష్ఠి (Shashti) ఉండి. సాయంకాలానికి సప్తమి ఉన్నది పాటించాలి.

శీతలావ్రతానికి మధ్యాహ్నసమయానికి సప్తమి ఉండాలి. అమ్మవారికి పవిత్రారోపణ వ్రతానికి రాత్రి సమయానికి అష్టమి ఉన్నది గ్రహించాలి. నక్త (ప్రదోష) సమయానికి నవమి ఉన్నది కుమారీ వ్రతానికి ప్రశస్తమైనది. ఇదే విధంగా ఆశా దశమి వ్రత పాలనకు కూడా నక్త సమయానికి దశమి ఉండాలి. ఏకాదశీ వ్రత పాలనకు వైష్ణవులు అరుణోదయానికి దశమివిద్ధ అయినదానిని గ్రహించాలి. స్మార్తులకు మాత్రం అరుణోదయానికి ఏకాదశి ఉన్నదే గ్రాహ్యం. రాత్రి భాగానికి చివరి ప్రహరలో సగ భాగ సమయం అరుణోదయం అని చెప్పబడుతుంది (ఒక ప్రహర = సుమారు మూడు గంటలు). ద్వాదశి ఉన్నప్పుడు నారాయణుని పవిత్రారోపణ వ్రతం చెయ్యాలి.

మన్మథుని పూజకు రాత్రి సమయానికి త్రయోదశి ఉండాలి. అది కూడా రెండవ యామానికి కూడా వ్యాపించనదిగా ఉంటే మరీ శ్రేష్ఠం. శివుని పవిత్రారోపణకు రాత్రి చతుర్దశి ఉన్నది గ్రహించాలి. అది కూడా అర్ధరాత్రికి ఉన్నదైతే ఉత్తమం. ఉపాకర్మ లేదా ఉత్సర్జనకు శ్రవణా నక్షత్రం, పూర్ణిమ కలసి ఉన్నది మంచిది. ఒక వేల రెండవ రోజున ఉదయం మూడు ముహూర్తాలు పూర్ణిమ ఉంటే అదే స్వీకరించాలి. ఋగ్వేదులు మాత్రం ముందురోజే చెయ్యాలి. తైత్తిరీయ యజుర్వేద శాఖవారికి మాత్రం తరువాత రోజు మూడు ముహూర్తాలు శ్రవణంతో కూడిన పూర్ణిమ ఉన్నప్పటికీ ముందు రోజే కర్మను ఆచరించాలి. 

ఉపాకర్మ తరువాత చేసే దీపదానం , స(ర్ప)ర్వ బలికి కూడా ఈ విధంగానే సమయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దీపదానం, స(ర్ప)ర్వ బలికి సాయంకాలానికి పూర్ణిమ ఉన్నట్లైతే అది ప్రశస్తమైనది. వారి వారి గృహ్యసూత్రాలను అనుసరించి ఏ సమయం ఉత్తమమైనదో ఆ సమయంలో ఆచరించవచ్చు.

హయగ్రీవ జయంతి (Hayagriva Jayanti) ఉత్సవానికి మధ్యాహ్నానికి పూర్ణిమ ఉన్నది గ్రహించాలి. రక్షాబంధనానికి అపరాహకాలానికి పూర్ణిమ ఉండాలి. సంకష్టహర చతుర్థి వ్రత పాలనకు చంద్రోదయానికి చవితి ఉన్నదే గ్రాహ్యం. రెండు రోజులలోను చంద్రోదయ వ్యాపిని చవితి ఉంటే, ముందు రోజునే వ్రతపాలన చెయ్యాలి ఎందుకంటే తదియతో కలసి ఉన్న చవితి అత్యంత పుణ్యఫలప్రదం.

గణేశ చతుర్థి (Ganesha Chaturthi), గౌరీ చతుర్థి, బహుళ చతుర్థి – ఈ మూడు తప్ప ఇతర దేవతల వ్రతపా లనకు పంచమితో ఉన్న చవితినే గ్రహించాలి. అర్ధరాత్రికి అష్టమి ఉన్న రోజునే కృష్ణాష్టమి జరుపుకోవాలి. పిఠోర వ్రతానికి మధ్యాహ్నానికి ఉండే అమావాస్యను గ్రహించాలి. వృషభ(పోల) పూజకి సాయంకాలానికి ఉండే అమావాస్య శుభప్రదం. దర్భలను సేకరించడానికి సంగమకాలానికి అమావాస్య ఉండాలి. (సంగమకాలం – ఒకరోజుని అయిదు భాగాలుగా చేస్తే అందులో రెండవ భాగం).

కర్కాటక సంక్రమణానికి ముందుండే మూడు ఘడియలు పుణ్యకాలం, సింహసంక్రాంతికి తరువాత వచ్చే పదహారు ఘడియలు పుణ్యకాలం. కొన్ని సంప్రదాయాల ప్రకారం ముందుండే పదహారు ఘడియలు పుణ్యకాలం. అగస్త్య అర్ఘ్యం పుణ్యకాలం గురించి వ్రత వివరణ చెప్పిన అధ్యాయంలోనే ఇవ్వడం జరిగింది.   

ఎవరైతే ఈ అధ్యాయాన్ని చదువుతారో లేదా వింటారో వారికి అన్ని వ్రతాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది.

♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.     

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి ముప్పైయవ అధ్యాయం >>

Also Read

Leave a Comment