23వ అధ్యాయం – త్రయోవింశోధ్యాయం – శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ బహుళ అష్టమి (Shravan Bhulashtami) నాడు ఆచరించవలసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) వ్రతం గురించి వివరించాడు. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు కూడా నశిస్తాయని పేర్కొన్నాడు. సప్తమి (Sapthami) రోజున స్వల్ప ఉపవాసం ఉండి, అష్టమి రోజున పూర్తి ఉపవాసం ఉండాలి. శుభ్రమైన ప్రదేశంలో దేవకీదేవి పురిటిగదిని చిత్రించి, అలంకరించాలి. అక్కడ విష్ణు (Lord Vishnu), పూతన, కృష్ణుడు (Lord Sri Krishna), బలరాముడు (Balarama), యశోద (Yashoda), నందుడు వంటి పాత్రల విగ్రహాలను లేదా చిత్రాలను ఏర్పాటు చేయాలి. రాత్రి నిశీధి సమయంలో, కృష్ణుడు జన్మించిన సమయానికి, వాద్యాలు, నృత్యాలతో శ్రీకృష్ణుడిని (Sri Krishna) షోడశోపచారాలతో పూజించాలి. చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ వ్రతం చేయడం వల్ల కోటి ఏకాదశులు చేసిన ఫలం లభిస్తుందని, పుత్రులు, ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివి పొందుతారని ఈశ్వరుడు తెలియజేశాడు.
తరువాత, వ్రతం పూర్తయిన తర్వాత చేయవలసిన ఉద్యాపన విధానాన్ని వివరించాడు. ఉద్యాపన రోజున బంగారంతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేయించి, బ్రాహ్మణులను పిలిచి, మంటపంలో ఆ ప్రతిమను ఉంచి వేద మంత్రాలతో (Veda Mantra) పూజించాలి. దేవకీ సహితుడైన కృష్ణునికి ప్రత్యేకంగా అర్ఘ్యం సమర్పించాలి. రాత్రి జాగరణ చేసి, మరుసటి రోజున హోమం చేయాలి. ఈ వ్రతం సంపూర్ణంగా పూర్తి అయినట్లుగా, కపిల గోవును దక్షిణతో సహా దానం చేయాలని, అది సాధ్యం కానప్పుడు మరొక గోవును దానం (Godanam) ఇవ్వవచ్చని శివుడు తెలియజేశాడు. ఈ వ్రత ఉద్యాపన చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని, ఇహలోకంలో సమస్త సుఖాలు పొంది, అంత్యకాలంలో శాశ్వతమైన వైకుంఠ లోకం (Vaikuntha Loka) చేరుకుంటారని ఈశ్వరుడు సనత్కుమారునికి చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు.
Shravana Masa Mahatmyam Day – 23
శ్రావణమాస మహాత్మ్యము – 23వ అధ్యాయం
🍃🌷త్రయోవింశోధ్యాయము – శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ మునీశ్వరుడా! శ్రావణమాసము నందు సూర్యుడు సింహరాశి (Simha Rashi) యందు ప్రవేశించి యుండగా బహుళాష్టమి (Bahulastami) దినంబున చంద్రుడు వృషభ రాశి యందుండు సమయంబున రాత్రి నిశీధి దమయమందు దేవకీ వసుదేవుల (Devaki Vasudeva) వలన కృష్ణ స్వరూపుడై భగవంతుడు ఆవిర్భవించెను. కావున, ఈ దినము మంచి పుణ్యప్రదమగు కాలము. ఇటువంటి దినంబున విశేష మహోత్సవము చేయతగినది.
సప్తమి దినంబున దంత ధావనాది కృత్యములను దీర్చి, స్నాన సంధ్యావందనాది నిత్యకర్మలను చేసినవాడై, పండ్లు మొదలగు వానిని కొంచెముగా భుజించి, నియమము కలవాడై, ఇంద్రియములను జయించి, లఘు ఉపవాసముతో ఆ రాత్రిని వెళ్ల బుచ్చవలయును, మరియు ఏమియు భక్షింపక శుష్కోపవాసముతోనైనా, కృష్ణాష్టమి (Sri Krishnashtami) దినంబును వెళ్లబుచ్చవలయును.
ఇందువలన ఏడు జన్మంబుల ముందు చేసిన పాపమైనను నశించిపోవును. ఇందు విషయమై సందేహము లేదు. ఉపవాసమనగా పాపము వలన విడువబడి సద్గుణములు కలవాడై సమస్త భోగములను విడిచి యుండుట ఉపవాసమని చెప్పబడునని మునీశ్వరులు వక్కాణించిరి.
అనంతరము నువ్వుల నూనెతో (Til Oil) తలంటుకొని, నిర్మలమగు నదీ జలములో స్నానము చేసి పరిశుద్ధుడై, శుభ్ర వస్త్రములను ధరించి, శుచియగు ప్రదేశ మందు దేవకీ దేవి (Devaki Devi) యొక్క పురిటి గృహమును లిఖించి, అనేక వర్ణములు కలవియు, పరిమళము కల పుష్పములు, కలశములు, ఫలములు, దీపపంక్తులు మొదలగువానిచే మనోహరంగా అలంకరించి, అగరు, కస్తూరి, చందనము, మొదలగు పరిమళ ద్రవ్యములచే పరిమళింప చేసి, విష్ణు వంశమును గోపాల కుల వంశము అచ్చట లిఖించవలెను.
వాద్యములు, నృత్యము, గీతము, నాట్యము మొదలగు మంగళధ్వనులను మ్రోగింపుచు, బంగారము వెండి రాగి ఇత్తడి మొదలగు లోహములతో గాని, మట్టితో గాని కొయ్యతో గాని మణులతో గాని విష్ణుమూర్తి ప్రతిమను పూతకి యను రాక్షసియు బాలహంతయు షష్టియను దానితో గూడ నిర్మించి, లేక రంగులతోనైన నిర్మించి, ఆ ప్రతిమను అక్కడ ఉంచవలయును. మరియు అచ్చట పందిరి పట్టిమంచమును, దాని పైన ఎనిమిది బొమ్మలతో గూడిన పరుపును, దానియందు సర్వలక్షణ సంపన్నురాలును బాలింతరాలు అగు దేవకీ ప్రతిమను ఉంచవలయును.
ఆ శయ్యయందు పాలు తాగుచున్నట్లును, నిద్రించుచున్నట్లును, బాలుడగు కృష్ణుని విగ్రహమును వేయవలయును. ఆ పురిటి గృహమునందే మరియొక పదేశంబున ఆడ శిశువును కనినట్లుగా యశోదా దేవి యొక్క విగ్రహమును కృష్ణ విగ్రహమునకు సమీపముగా లిఖించవలయును, మరియు యక్షులు విద్యాధరులు దేవతలు మొదలగువారు దోసిలి పట్టుకొని కృష్ణమూర్తిని ధ్యానించుచున్న వారలనుగా లిఖించవలయును.
మరియు అచ్చట ఖడ్గము చర్మము మొదలగు ఆయుధములను ధరించియున్నట్లుగా వసుదేవ విగ్రహమును లిఖించవలయును, మరియు కాశ్యపముని (Kashyapa Muni) అంశమగు వసుదేవుని, అదితి యొక్క అంశమగు దేవకీ యశోదలను, ఆదిశేషుని అంశమగు బలరాముని, దక్షప్రజాపతి (Daksha Prajapati) అంశమగు నందుని, చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంశమగు గర్గమునీశ్వరుని, అప్సరసల యొక్క అంశమగు గోపికా స్త్రీలను, సమస్త దేవతల అంశమగు గోపాలకులను, కాలనేమి అంశమగు కంసుని, వానిచే నియోగింపబడిన సమస్త రాక్షసుల యొక్క అంశజులగునట్టియు హస్తమందు ఆయుధ ధారు అయినటువంటి, గార్ధభాసురుడు, ధేనుకాసురుడు, గజాసురుడు, అశ్వాసురుడు మొదలగువారిని లిఖించవలయును, మరియు అచ్చటనే యమునా నది (Yamuna River) యందు మడుగులో కాళీయుడను సర్పవిగ్రహము ఉండునట్లుగాను లిఖింపవలయును.
ఈ ప్రకారము కృష్ణమూర్తి అవతారములో జరిగిన చరిత్రను గురించిన హరి యొక్క విగ్రహములనన్నియు లిఖించి, భక్తి కలవాడై ప్రయత్నముచే పూజా ద్రవ్యములన్నియు సంపాదించి, దేవకీ అను మంత్రమును చెప్పుచు షోడశోపచారములచే పూజింపవలయును.
వేణువు, వీణ మొదలగు సాధనములతో సంగీతము పాడుచుండెడి గంధర్వులతో (Gandharva) చుట్టు కొనబడినదియు, బంగారపు దర్పణము, గరికలు పెరుగు కలశములు మొదలగునవి హస్తముల యందు ఉంచుకొనిన కింకరులచే సేవింపబడినదియు, కుమారుడగు కృష్ణుని తొడల యందుంచుకొని, ఆనందయుక్తమగు ముఖము కలదియై శోభస్కరమగు శయ్యయందు గూర్చున్నదియు, దేవ మాతయగు అదితి అంశము వలన బుట్టిన దేవకీ దేవి పెనిమిటియగు వసుదేవునితో కూడియుండి సర్వోత్కృష్టము గా ప్రకాశించుగాక యని ధ్యానము చేయవలయును.
నేరుగా నామములను జెప్పుచు, మొదట ‘ఓం’ కారమును చివర ‘నమః’ అను పదమును చెప్పవలయును. పూజా విధిని తెలిసుకొనినవాడగుచు, సమస్త పాపములు నశించుట కొరకు దేవకీదేవి, వసుదేవుడు (Vasudeva), కృష్ణమూర్తి, బలరాముడు, యశోద, నందుడు మొదలగు వారలకు వేరువేరుగా పూజచేయవలయును.
పాలసముద్రము నందు జన్మించినవాడును, అత్రి మునీశ్వరుని వంశము నందు జన్మించిన వాడును, రోహిణీదేవికి పెనిమిటియగు ఓ చంద్రుడా ! నీకు నమస్కారము చేసెదను. నాచే ఇవ్వబడిన అర్ఘ్యమును గ్రహింపుమని ప్రార్థించి, భగవంతుని మనస్సున దలచుచు చంద్రోదయ కాలము నందు చంద్రునకు అర్ఘ్యము విడువవలెను.
దేవకీయుక్తుండగు వసుదేవుని, యశోదాయుక్తుండగు నందుని, రోహిణీ యుక్తుండగు చంద్రుని, బలరాముని, కృష్ణుని యధావిధిగా పూజించినవానికి పొందశక్యము గానిదేమియు లేదు. అనగా, సమస్తమును పొందును. కావున, ఈ కృష్ణాష్టమి అనువది కోటి ఏకాదశులను (Ekadashi) చేసిన ఫలమునొసగును. గాన, కృష్ణాష్టమీ దినంబున రాత్రి పూర్వమందు చెప్పినరీతిగా పూజించి, తెల్లవారిన పిమ్మట, నవమీ దినంబున కృష్ణునకును భగవత్స్వరూపిణియగు శక్తికిని సమానముగా ఉత్సవము జేయవలెను.
అనంతరము కృష్ణమూర్తి, నాయందు అనుగ్రహము కలవాడగు గాక అని గోవులు, ధనము, బంగారము, భూములు మొదలగు తనకిష్టమగు వానినన్నియు దానములనిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనం పెట్టవలెను.
గోవులకును, బ్రాహ్మణులకును మేలును చేయునటువంటి వాసుదేవునకు నమస్కారము, శాంతియు శుభమును నాకు కలుగుచునుండుగాక అని దేవతకు ఉద్వాసన చెప్పవలయును.
అనంతరము మౌనము కలవాడై, బంధువులతో గూడుకొని భుజింపవలయును. ఈ ప్రకారము ప్రతి సంవత్సరము కృష్ణునకు శక్తికి పూజగావించి, ఉత్సవమును చేసిన వాడు పుత్ర సంతానము ఆరోగ్యము సామ్యములేని ఐశ్వర్యము మొదలగు చెప్పిన ఫలముల నన్నియుపొందగలడు. ఈ లోకంబున ఉండునంత కాలము, ధర్మము నందు ఆసక్తి కలవాడై, జన్మాంతము నందు వైకుంఠ (Vaikunta) లోకమున కేగును.
ఇక ముందు, ఉద్యాపనమును చెప్పెదను వినుము. పంచాంగ శుద్ధిగల దినము నందు ఉద్యాపనము చేయదలచినవాడై పూర్వ దినము నందు ఒక్క పర్యాయమే భుజించి, మనస్సున భగవంతుని ధ్యానింపుచు, ఆ రాత్రి నిద్రించవలయును. మరునాడు ప్రాతః కాలంబున స్నానసంధ్యాది నిత్యకర్మలను నెరవేర్చుకొని వ్రతమును ప్రారంభించుటకు బ్రాహ్మణులను పిలచి, పుణ్యాహవాచనాది క్రియలను చేయించు కొనవలయును.
అనంతరము ఆచార్యునకు, ఋత్విక్కులకు వరుణలను ఇవ్వవలయును. నవటాకు గాని, అందులో సగముగాని, అందులో నాలుగవ వంతుగాని, తన శక్తి కలిగినట్లు బంగారముతో ప్రతిమను చేయించవలెను. శక్తికి లోపము చేయకూడదు. ఆ ప్రతిమను మంటపము నందు ఉంచి, పిమ్మట బ్రహ్మ మొదలగు దేవతలనందరిని ఆవాహనము చేయవలయును.
ఆ మంటపము నందే రాగి కలశమును గాని, మట్టికుండను గాని, బియ్యముతో నిండించి యుంచవలయును. దానిపైన వెండి పళ్లెము గాని, రాగి పళ్లెము గాని, వెదురు పాత్రగాని యుంచవలయును.
విద్వాంసుడగు వాడు ఆ మంటపమందు ఉన్న విష్ణు ప్రతిమ యందు అఖండితమగు నూతన వస్త్రమునుంచి పిమ్మట వేదోక్తమంత్రములతోను, కల్పోక్తమంత్ర ములతోను షోడశోపచార పూజలను గావింపవలెను.
అనంతరము, దేవకీ సహితుడైన కృష్ణునకు అర్ఘ్యం ఇవ్వవలయును. అది ఏవిధముగా అనగా, శంఖములో జలము నుంచి పుష్పములు ఫలములు మంచి గంధము మొదలగువానితో ఆ శంఖమును అలంకరించి, కొబ్బరికాయను, ఆ శంఖమును చేతనుంచుకొని మోకాళ్లను భూమిమీద ఉండునట్లుగా వంచి దేవకీ సహితుడవగు ఓ కృష్ణమూర్తీ ! నీవు కంసుని సంహరించుటకును, భూభారమును హరించుటకును, కౌరవులను నశింపుచేయుటకును, రాక్షసులను వధించుటకును, జన్మించితివి కావున నేనిచ్చునట్టి అర్ఘ్యమును గ్రహింపుము, అని ప్రార్ధించి, అర్ఘ్యము ఇవ్వవలెను. విద్వాంసుడు పూర్వమునందు చెప్పబడిన రీతిగానే చంద్రునకు అర్ఘ్యము ఇవ్వవలెను.
దేవకీ వసుదేవులకు కుమారుడవును, మూడులోకములకు ప్రభుడవునగు ఓ కృష్ణమూర్తీ! నీకు నమస్కారము చేసెదను సంసార సముద్రము నుండి నన్ను రక్షింపుము.
ఈ ప్రకారము, భగవంతుని ప్రార్ధించి, రాత్రి జాగరణము చేసి, మరునాడు ఉదయంబున నిర్మలమగు జలములో స్నానము చేసి, కృష్ణుని పూజించి, మూలమంత్రమును ఉచ్చరింపుచు, పరమాన్నము, తిలలు, నెయ్యి మొదలగువానిచే నూట యెనిమిది పర్యాయములు హోమము చేసి, పిమ్మట పురుష సూక్తముతోను, ‘ఇదం విష్ణుః,’ అను మంత్రముతోను ఆజ్య హోమము భక్తితో చేయవలెను.
అనంతరము పూర్ణాహుతి మొదలగు హోమములు అన్నియు సమాప్తినొందించి, అనంతరము ఆచార్యునకు వస్త్రములు ఆభరణములు మొదలగువానినిచ్చి పూజించి వ్రతము పూర్తినొందుటకు కపిలగోవును దానమివ్వవలెను.
ఎటువంటి గోదానము చేయవలయుననగా, పాలునిచ్చునదియు, మంచి స్వభావముగలదియు, దూడ గలదియు, సుగుణములు కలదియు, బంగారపు కొమ్ములు కలదియు, వెండి డెక్కలుగలదియ, కంచుపొదుగుతో కూడినదియు, తోకయందు ముత్యములు ఉంచబడినదియు, రాగి వీపుతో నుండునదియు, బంగారపు ఘంటలు కలదియు, నూతన వస్త్రముచే గప్పబడినదియు, అగు గోవును సంపూర్ణణమగు దక్షిణతో కూడ ఇచ్చినయెడల వ్రతము సంపూర్తినొందును.
కపిల గోవు సంభవించనప్పుడు, మరియొకటి, ఏ గోవునైనను దానమివ్వవచ్చును. అనంతరము ఋత్విక్కులకు వారికి తగినట్లుగా దక్షిణ ఇవ్వవలయును. అనంతరము ఎనమండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, నిర్మలనుగు మనస్సు కలవాడగుచు – జలముతో నిండి యుండిన నూతన కలశములను దక్షిణలతో సహితముగా వారికి ఇవ్వవలెను.అనంతరము వారి వలన అనుజ్ఞ తీసికొని తాను బంధువులతో కూడ భుజింపవలయును.
బ్రహ్మ మానసపుత్రుడవగు ఓ సనత్కుమారా! ఈ ప్రకారము వ్రతమునకు ఉద్యాపనము చేసిన బ్రాహ్మణుడు ఆ క్షణమునందే పాపము వలన విడువబడును. ఇహలోకంబున పుత్రులు పౌత్రులతో కూడినవాడై ధనము ధాజ్యం మొదలగు ఐశ్వర్యము కలవాడగుచు చాలా కాలము సమస్త సుఖములను అనుభవించి, అంత్యకాలమందు శాశ్వతమగు వైకుంఠ లోకమునకేగును, అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.
ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే — “శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం” నామ త్రయోవింశోధ్యాయస్సమాప్తః…
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము