Shravana Masa Mahatmyam Day – 20 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 20

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణమాసంలో శుక్లపక్ష త్రయోదశి (Tryodashi) నాడు ఆచరించవలసిన మన్మథ పూజ గురించి వివరించాడు. ఈ పూజలో మన్మథుడిని అశోక పుష్పాలు, పద్మాలు, సుగంధ ద్రవ్యాలు, ఎర్రని అక్షతలు, తాంబూలంతో షోడశోపచారాలతో పూజించాలి. మన్మథుడి బాణాల ప్రభావం వల్ల బ్రహ్మ (Lord Brahma) , విష్ణువు (Lord Vishnu), ఇంద్రుడు వంటి దేవతలు కూడా తమ ధర్మాన్ని విస్మరించారని, జితేంద్రియులు చాలా తక్కువ మంది ఉంటారని శివుడు చెబుతాడు. ఈ వ్రతం చేయడం వల్ల కోరికలు కలవారికి వీర్యం, బలం, సకల లక్షణాలు గల అందమైన భార్యలు లభిస్తారని, పుత్రులు కలుగుతారని పేర్కొన్నాడు. అపేక్షలు లేనివారికి మనోవికారాలు తొలగిపోతాయని తెలియజేశాడు.

తరువాత, చతుర్దశి (Chaturdashi) వ్రతం గురించి వివరిస్తూ, అష్టమి (Ashtami) నాడు పవిత్రారోపణ వ్రతం చేయలేనివారు చతుర్దశి నాడు సాంబమూర్తికి పవిత్రం సమర్పించాలని శివుడు సూచించాడు. పవిత్రం చేసే విధానం దేవి, విష్ణు వ్రతాలకు చెప్పినట్లుగానే ఉంటుందని, కానీ శివునికి ప్రత్యేకంగా 11, 38 లేదా 50 పోగులు గల పవిత్రం చేయాలని చెబుతాడు. అలాగే 12, 8 లేదా 4 అంగుళాల లింగాన్ని (Siva Lingam) పూజించాలని, పూజావిధి పూర్వం చెప్పిన విధంగానే ఉంటుందని పేర్కొన్నాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్వం చెప్పబడిన ఫలాలన్నీ లభిస్తాయని తెలియజేస్తూ, సనత్కుమారునికి ఈ రహస్య వ్రతాలను విన్నవించి, ఈ అధ్యాయాన్ని ముగించాడు.

🍃🌷వింశోధ్యాయము –  “త్రయోదశీ వ్రత కథనం”, “చతుర్దశీ వ్రత కథనం”:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి  చెప్పుచున్నాడు…

ఓ సనత్కుమారా! త్రయోదశీ దినమందు చేయదగిన విధానమును చెప్పెదను వినుము. ఈ త్రయోదశీ వ్రతము నందు షోడశోపచారములచే మన్మధుని పూజింపవలయును.

ఆశోక పుష్పములు, మాలతీ పుష్పములు, పద్మములు, దేవప్రియ పుష్పములు, కుంకుమ పువ్వులు (Saffron), పొగడ పుష్పములు, మరియు మత్తత కలిగించెడు నికర పుష్పములు, ఎర్రని అక్షతలు, పచ్చని గంధములు, శోభస్కరమగు సుగంధద్రవ్యంఋలు, బలకరమగు ద్రవ్యములు, రేతస్సును వృద్ధి చేసెడు ఇతర ద్రవ్యములు, మొదలగువానిచే మన్మధుని పూజించవలయును.

అనంతరము నైవేద్యము చేయవలయును. పిమ్మట తాంబూలమును ఇవ్వవలయును, తాంబూలములో ఉంచు ద్రవ్యములేవి అనగా… చికిని పోక చెక్కలు, కవిరి ఉండలు, జాజిపత్రి, జాజికాయలు, లవంగములు, ఏలకులు (Elachi), ఎండిన కొబ్బరి యొక్క చిన్న చిన్న ముక్కలు, పచ్చకర్పూరము, కుంకుమపువ్వు, మగధ దేశమందు పుట్టినటువంటివి, బంగారు వంటి వర్ణము కలవి గాని, తెల్లని వర్ణము కలవిగాని, ఎర్రగా నుండునవి గాని, మృదువైనవియు, దృఢమగు తమలపాకులతో (Betel Leaves) కూడ తాంబూలమును ముఖము నందు సువాసన కొరకు ఇయ్యవలయును.

మైనముతో నిర్మింపబడిన వత్తులతో మన్మధునకు దీపమును ఇచ్చి పిమ్మట పుష్పాంజలులను సమర్పింపవలయును.

ఆ మన్మధుని నామములను స్మరించుచు ప్రార్ధన చేయవలయును. కావున, ఆ మన్మధుని నామములను నీకు చెప్పెదను.  సమస్తమైన వారికంటె అధికమగు సౌందర్యము కలవాడును, విష్ణుమూర్తి కుమారుడును, ప్రద్యుమ్నుడను (Pradyumna) పేరుగల మన్మధుడు నన్ను రక్షించుగాక.

మీనకేతన, కందర్ప, అనంగ, మన్మధ, మార, కామ, ఆత్మసంభూత, ఝుష కేతు, మనోభవ ఆను నామములచే చెప్పబడు మన్మథుడు నన్ను రక్షించుగాక. 

రతీ దేవిని (Rati Devi) ఆలింగనము చేసికొనుట వలన ఆమె ఉన్నతమగు కుచములందు కస్తూరిచే అలంకరింపబడిన మకరికా పత్ర రచనలు మన్మధుని భర్త స్థలంబు నందు చిహ్నితములైనవి అట్టి మనోహరుడుగు నన్ను రక్షించుచుండు గాక.

పుష్పములు ధనస్సుగా గలవాడును, శంబరాసురునకు శత్రువును, పుష్పములు బాణములుగా గలవాడును, రతీదేవికి పెనిమిటియు, మకరము ధ్వజముగా గలవాడును, అయిడుపుష్పములు బాణములుగా గలవాడును, సుందరుడునగు మన్మధుడు (Manmatha) నన్ను రక్షింపుచుండుగాక.

దేవతుల యొక్క కార్యమును సాధించుటకు నీవు సాంబమూర్తి యొక్క తపోవిఘ్నము చేయగా, నిన్ను తృతీయ నేత్రాగ్నిచే భస్మము చేసెను, కావున నీవు చేయునట్టి కృత్యములనన్నియు పరోపకారమునే చెప్పుచున్నవి.

నీకు యుద్ధము నందు వసంతుడు సహాయుడు అనుట మాటమాత్రమే గాని నీవు స్వయముగానే జయింప గలవాడవు. నీ మనస్సును సంతోష పెట్టుట యందు దేవేంద్రుడు (Devendra) రాత్రింబగలును ప్రయత్నము చేయుచుండును.

ఎందువలననగా, ఎవరైనను కఠినముగ తపస్సు చేయగా తన ఇంద్ర పదవిని కోరుదురనే భయముచే వారి తపోవిఘ్నము చేయుటకు ఎల్లప్పుడు నీ సహాయమును కోరుచుండును. నీ కంటె ఇతరమగు మరియొకడు థైర్యము కలవాడై ఎవడును సాంబమూర్తితో విరోధము పెట్టుకోగల వాడగును.

బ్రహ్మానందముతో సమానమగు ఆనందమును కలిగించుట యందు నీ కంటె ఇతరుడెవడును లేడు. ప్రపంచమును మోహింప చేయునట్టి సేనలలో నీతో సమానమగు పరాక్రమము కలవాడు లేడు.

అనిరుద్ధునకు (Aniruddha) తండ్రియు, కృష్ణమూర్తి కుమారుడును, దేవతలకు ప్రభువును మరియు పర్వతము వలన పుట్టిన మంచి గంధము, అగరు మొదలగు వానిచే పరిమళించువాడవునై యుంటివి..

శరత్కాల చంద్రుడు సహాయముగా గలవాడును ప్రపంచోత్పత్తికి కారణుడును అగు ఓ మన్మధుడా! ప్రపంచమును జయించుటయందు మలయ మారుతము నీకు సహాయము.

ఓ స్వామీ! నీ యొక్క బాణము మిక్కిలి గొప్పదియు, వ్యర్ధము కానిదియు మిక్కిలి దూర ప్రదేశమునకైనను వెళ్లునదియు, ఎంతమాత్రమును దయలేకుండా మర్మములను నొప్పించునదియు, ఎచ్చటను అడ్డు లేనిదియు, మృదువైనను తన పేరును వినినంత మాత్రముననే అమితమగు మనోవ్యాధిని కలిగించునదియు తనకు సమానమగు పదార్ధమును చూచినంత మాత్రముననే పొందుటకు సాధనమైయుండను.

ప్రపంచమును జయించుటకు మనుష్యుల యొక్క అలంకారమే నీకు ముఖ్యమగు సాధనము. ఓ ప్రభువా! గొప్పవారగు సమస్తమైన దేవతలను నీవు పరిహరించుచున్నావు.

నీకు అందరును లోబడిరి, అది ఏ విధముగాననగా… బ్రహ్మదేవుడు తన కూతురు యందు వాంఛ గలవాడాయెను, విష్ణుమూర్తి (Lord Vishnu) బృంద యను స్త్రీ యందు ఆసక్తి గలవాడాయెను. సాంబమూర్తి పరభార్య రతుడగుట వలననే ఆయనను స్పృశింపగూడదు అనిరి, మరియు తన శక్తి యందే బహుకాలము సంభోగము చేసెను, దేవేంద్రుడు దుష్ట ప్రవర్తన కలవాడై గౌతమ మునీశ్వరుని భార్యతో సంభోగించెను, ద్విజులకు రాజు అని చెప్పబడుచుండెడి చంద్రుడును తన గురువగు బృహస్పతి (Bhaspati) యొక్క భార్యను బలాత్కారముగానే తీసుకొని వెళ్లెను, విశ్వామిత్ర (Vishwamitra) మునియు అనేక పర్యాయములు తపోభ్రష్టుడై ఎట్టి  దుష్కృత్యములు చేయలేదు…

ఓ మన్మధుడా! ఈ మొదలగు వారిని కొందరినే ముఖ్యమగు వారిని చెప్పితిని, విశేషముగా చెప్పవలయుననిన మితియే లేదు కావున, నీ పుష్పబాణములకు లోబడక జితేంద్రియులగు వారు కొంచెముగానే యుందురు.

ఓ స్వామీ! అందువలన నే చేసిన ఈ పూజచే, నీవు నన్ను అనుగ్రహింపుము. శ్రావణ శుక్ల త్రయోదశీ (Shravan Shukla Triodashi) యందు మన్మధుని పూజించిన ఎడల ప్రవృత్తి మార్గము నందు కోరిక గలవానికి వీర్యమును బలమునిచ్చుచున్నాడు, అపేక్షారహితునకు వికారములను పోగొట్టుచున్నాడు.

కోరికలు గలవాడై మన్మధుని శ్రావణ మాసములో పూజించిన ఎదల మన్మధుడు సంతోషించినవాడై, ఉన్నతమగు కుచములు కలవారునూ, శరత్కాలము నందు సంపూర్ణుడగు చంద్రుని వంటి ముఖము గలవారును, పద్మముల వంటి నేత్రములు కలవారును, పొడవైన మృదువగు నల్లని వెంట్రుకలు ముంగురులు కలవారును, చక్కని ముక్కు కలవారును, ఆరటి స్తంబముల వంటి తొడలు కలవారును, రమ్యమగు పిక్కలు కలవారును, ఏనుగు నడకలను మించిన నడక గలవారును, రమ్యములగు రావియాకుల వంటి యోనులు కలవారును, పెద్దవియగు పిరుదులు కలవారును, శంఖము వంటి కంఠము కలవారును, చక్కని మొలచే ప్రకాశించువారును, దొండపండు వంటి ఆధరోష్టము కలవారును, సింహ నడుము వంటి నడుము కలవారును, ఆనేకమగు అలంకారములచే ప్రకాశించువారును, మనోహరులగు స్త్రీలను భార్యలనుగా సమకూర్చును.

మరియు శుక్ల పక్ష త్రయోదశి యందు పూజించిన ఎదల చిరకాలం జీవించువారును, మంచి గుణములు కలవారును, సుందర రూపులును, యోగ్యులునగు అనేక పుత్రులను ఒసగువాడగును.

ఓ మన్మధుడా! త్రయోదశి యందు చేయతగినదియు, శుభప్రదమగు కృత్యమును చెప్పితిని, ఇక ముందు చతుర్దశి యందు చేయతగిన కృత్యమును చెప్పెదను. 

ఓ మునీశ్వరుడా! ఆష్టమి యందు దేనిని గురించి పవిత్రారోపణ వ్రతమును చెప్పితినో… అప్పుడు ఆ వ్రతమును చేయకుండినట్లైన ఎడల చతుర్దశి యందు చేయవలయును.

చతుర్దశి యందు చేసినప్పుడు సాంబమూర్తికి పవిత్రమును అర్పించవలయును పవిత్ర విధానమంతయు దేవిని గురించియు, విష్ణుమూర్తి గురించియు చెప్పిన విధముగానే జరుపవలయును. ప్రార్ధనాదుల యందు చెప్పతగిన నామముల విషయమై శైవ శాస్త్రముల యందు జాబాలాదులచే చెప్పబడిన గ్రంధముల నందునున్న రీతిగాను మరియు వాటికి అనుసరణగా తనకు గలిగిన ఊహ ప్రకారముగాను కల్పన చేసి చెప్పవలెను. 

ఇక్కడ కొంచెము విశేషము కలదు, దానిని చెప్పెదను వినుము. పదకొండు పోగులు గాని, ముప్పది ఎనిమిది పోగులు గాని, యాబది పోగులు గాని పవిత్రమునకు పోయవలయును. ముడులు సమాన ఎడము కలుగునట్లుగానే ముడి వేయవలయును, పండ్రెండు అంగుళములు గాని, ఎనిమిది అంగుళములు గాని, నాలుగు అంగుళములు గాని పొడవు ఉండునట్టి లింగమును పూజింపవలయును. శివుని సంతోషము కొరకు పూజావిధి యంతయు పూర్వము చెప్పబడిన రీతిగానే చేయవలయును.

ఓ చిన్న వాడా! దీనికి కలుగు ఫలమంతయు పూర్వము చెప్పబడిన విధముగానే కలుగును. కాబట్టి, ఇది యంతయు నీకు చెప్పితిని మరియు ఏదియైనను వినుటకు కోరిక కలిగిన ఎడల దానిని అడుగుము చెప్పెదను, అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – “త్రయోదశీ” వ్రత కథనం, “చతుర్దశీ వ్రత కథనం” నామ వింశోధ్యాయస్సమాప్తః.                      

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి ఇరవై ఒకటవ అధ్యాయం >>

Also Read

Leave a Comment