19వ అధ్యాయం – ఏకోనవింశోధ్యాయం – ఉభయైకాదశీ వ్రత కథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే ఏకాదశి (Ekadashi) వ్రతాల గురించి వివరించాడు. ఈ వ్రతం ఎంతో రహస్యమైనదని, గొప్ప పుణ్యఫలాలు, కోరిన కోరికలు, పాపనాశనం కలిగిస్తుందని చెబుతాడు. దశమి నాడు (Dashami) ఏకభుక్తం, ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం, ద్వాదశి నాడు (Dwadashi) భోజనం చేస్తానని సంకల్పం చెప్పుకోవాలి. ఈ మూడు రోజులు శాంతంగా, నేల మీద పడుకొని, కామక్రోధాలను విడిచిపెట్టాలి. ఏకాదశి నాడు “శ్రీధర శ్రీధర” అని స్మరిస్తూ, శ్రీధరుని (Sridhara – విష్ణువు) షోడశోపచారాలతో పూజించాలి. కలశం, ప్రతిమను ఏర్పాటు చేసి, రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశి నాడు ఉదయం పూజ చేసి, ఆ కలశం, ప్రతిమను గురువుకు దానం చేయాలి. శుక్ల పక్ష ఏకాదశి నాడు శ్రీధరుడిని, బహుళ పక్ష ఏకాదశి నాడు జనార్దనుడిని పూజించాలి. ఈ వ్రతం ఆచరించిన వారికి సాటిలేని పుణ్యం లభిస్తుందని శివుడు తెలియజేస్తాడు.
అదే అధ్యాయంలో ద్వాదశి నాడు ఆచరించవలసిన పవిత్రారోపణ వ్రతం గురించి కూడా శివుడు వివరించాడు. ఈ వ్రతం దేవి వ్రతం మాదిరిగానే ఉంటుంది, కానీ కొన్ని నియమాలు వేరుగా ఉంటాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, స్త్రీలు, శూద్రులు అందరూ తమ భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతంలో విష్ణువును (Lord Vishnu) గురించి పవిత్రం సమర్పించేటప్పుడు బ్రాహ్మణులు మంత్రాలు చదువగా, స్త్రీలు, శూద్రులు కేవలం విష్ణు నామంతో సమర్పించవచ్చు. కృతయుగంలో మణులు, త్రేతాయుగంలో (Treta Yuga) బంగారం, ద్వాపరంలో (Dwapara Yuga) పట్టు, కలియుగంలో (Kali Yuga) ప్రత్తి దారంతో పవిత్రం తయారు చేయాలి. వ్రతం చివరలో హోమం చేసి, పవిత్రమును బ్రాహ్మణునికి దానం చేయాలి లేదా నదిలో వదలాలి. ఈ వ్రతం ఆచరించిన వారికి ఇహలోకంలో సుఖాలు, చివరికి మోక్షం లభిస్తాయని శివుడు సనత్కుమారునికి తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 19
శ్రావణమాస మహాత్మ్యము – 19వ అధ్యాయం
🍃🌷ఏకోనవింశోధ్యాయము – ఉభయైకాదశీ వ్రత కథనం, ద్వాదాశీ వ్రత కథనం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు….
ఓ మునీశ్వరా ఇకముందు శ్రావణ మాసములో రెండు పక్షముల యందు వచ్చునటువంటి ఏకాదశుల ముందు చేయ తగిన కృత్యమును చెప్పెదను సావధాన మనస్సు గలవాడవై వినుము.
ఓ చిన్నవాడా! శ్రేష్ఠంబైన ఈ ఏకాదశి వ్రతమును ఇది వరలో ఎరికిని నేను చెప్పియుండలేదు. రహస్యముగా ఉన్నది, కాబట్టి, ఈ ఏకాదశీ వ్రతము విశేషమగు పుణ్యమును ఇచ్చునదిగాను, మహాపాతకములను నశింపుచేయునదిగాను, మనుష్యులకు కోరిన కోరికల నిచ్చునది గాను, ఉపపాతకములను అన్నింటిని నశింపుచేయునది గాను, శ్రేష్ఠబగు వ్రతములు అన్నింటిలోను గొప్పదిగాను, శుభముల నొసగునది గాను, సమస్తమైన మహామునుల చేతను చెప్పబడెను.
కాబట్టి, ఓ మునీశ్వరా! ఈ ఏకాదశీ వ్రతమును నీకు చెప్పెదను, సావధాన చిత్తము గలవాడవై వినుము. దశమి దినంబున ప్రాతఃకాలంబున స్నానము చేసి, పరిశుద్ధుడై, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, వేదమును (Vedam) చదివిన వారు, పురాణమును (Puranam) తెలిసినవారు, ఇంద్రియములను జయించినవారు, ఈ మొదలగు సత్పురుషుల వలన అనుజ్ఞ గైకొని, దేవదేవుండగు భగవంతుని షోడశోపచారముల చేత పూజించి, పద్మముల వంటి నేత్రములు గల ఓ నారాయణ మూర్తీ! ఈ దినంబున ఏక భుక్తంబును, ఏకాదశీ దినంబున ఉపవాసంబును చేసి ద్వాదశీ దినంబున భుజించెదను. ఓ భగవంతుడా! నన్ను రక్షింపుమని ప్రార్థించవలెను.
ఓ చిన్నవాడా! ఈ మూడు దినముల యందు నియమముగా ఉండి, గురువులు, దేవతలు అగ్నిహోత్రము – వీరి సన్నిధానము నందే నివసింపుచు కామ ద్రోధాది దుష్ట గుణములను విడిచి, శాంత స్వభావము గల వాడగుచు, ఈ మూడు దినముల యందును భూమియందే పరుండవలయును.
ఓ చిన్నవాడా! ఆనంతరము ఏకాదశి నాడు ఉదయముననే లేచి, విష్ణువు నందు చిత్తము గలవాడై తుమ్మినను దగ్గినను “శ్రీధర శ్రీధర” అని స్మరణ చేయుచు, పాషండులు మొదలగు వారిని చూచుట, వారితో సంభాషించుట, వారి మాటలను వినుట, ఈ మొదలగు వాటిని మూడు దినములు విడిచి, ముక్తికి కారణమగు ఏకాదశీ వ్రతమును చేయవలయును.
అనంతరము మధ్యాహ్న కాలంబున నదులు మొదలగు పవిత్రములగు జలంబున స్నానము చేసి, క్రోధాది దుర్గుణములను విడిచి, పంచగవ్య (Panchagavya) ప్రాశన చేసి, సూర్యునకు (Lord Suya) నమస్కారము చేసి, భగవంతుని శరణును పొంది, తన కులాచార సంబంధమగు కృత్యములను నెరవేర్చి ఇంటికి రావలెను.
అనంతరము శ్రద్ధా భక్తులతో గూడినవాడై, పుష్పములు, ధూపములు, దీపములు అనేక విధములగు నైవేద్యములు మొదలగువానిచే శ్రీధరుని పూజించవలయును.
ఒక కలశమునకు మంచి గంధము పూసి, దానికి నూతనమగు రెండు వస్త్రములను జుట్టి, దానిలో రత్నములు బంగారము ఉంచి, శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములచే ఒప్పబడుచుండెడి విష్ణుమూర్తి (Vishnumurthy) ప్రతిమను పూర్వమందు చెప్పబడిన కలశమునందుంచి, యధావిధిగా పూజించి, ఆ రాత్రియంతయు సంగీతము వాద్యములు హరికధా కాలక్షేపములు మొదలగు వానిచే వెళ్ల బుచ్చి, ద్వాదశి నాడు తెల్లవారగానే లేచి స్నాన సంధ్యావందనాది నిత్యకృత్యములు నెరవేర్చి, శ్రీధరుని యందే చిత్తము గలవాడై, ఆ ప్రతిమను తిరిగి పూజించి దక్షిణతో గూడ ఆ కలశమును ప్రతిమను ఆచార్యునకు దానమియ్యవలయను.
ఓ మునీశ్వరా! శ్రీధరుడు సంతోషించుగాక, నాకు విశేషమగు ఐశ్వర్యమును ఇచ్చు గాక యని ప్రార్ధించి, జగత్ప్రభువగు విష్ణుమూర్తిని పూజించి, నవనీతము మొదలగునవన్నియు బ్రాహ్మణునకు ఇచ్చి, మరియు ఇతరులగు బ్రాహ్మణులకు కూడ భోజనము పెట్టి తన శక్తి కొలది దక్షిణను ఇయ్యవలయును.
అనంతరము, భృత్యులు మొదలగు వారికిని భోజనము పెట్టి, గోవులకు పచ్చిక మొదలగు మేత వేసి, అనంతరము స్నేహితులు బంధువులు మొదలగు వారితో గూడి తాను భుజింపవలెను.
ఓ సనత్కుమారా! ఈ ప్రకారము శ్రావణ శుక్ల ఏకాదశీ వ్రతము చెప్పబడినది. ఈ ప్రకారముగానే శ్రావణ మాసములో బహుళ ఏకాదశి యందును వ్రతము చేయవలయును.
రెండు ఏకాదశుల యందును కృత్యములు సమానమే గాని, నామములు మాత్రము వేరు. అది ఏవిధముగా అనగా, శుక్ల పక్ష ఏకాదశి (Shukla Paksha Ekadashi) యందు పూజించినప్పుడు శ్రీధరుడు అనియు, బహుళ పక్ష ఏకాదశి (Bahula Paksha Ekadashi) యందు పూజించునప్పుడు జనార్దనుడు (Janardhana) అనియు పూజింపవలయును.
శుక్ల పక్షంబున శ్రీధరుడనియును, బహుళ పక్షంబున జనార్దనుడనియు విష్ణుమూర్తి వేరువేరు నామముల చెప్పబడుచున్నాడు కాబట్టి, ఈ విధమగు రెండు ఏకాదశీ వ్రతములను నీకు చక్కగా విమర్శించి చెప్పితిని.
దీనితో సమానమగు పుణ్యవ్రతము ఇదివరకు ఎక్కడను లేదు, ఇక ముందును కలుగబోదు. కావున, యిది నీవు రహస్యముగానుంచుము, దుష్టువ్వుభావులకు చెప్పగూడదు.
🌻ఈశ్వర ఉవాచ:
ఓ మునీశ్వరుడా! ఇక ముందు, ద్వాదశి యందు విష్ణువును గురించి పవిత్రారోపణ వ్రతమును చెప్పెదను వినుము. ఈ పవిత్రారోపణ విషయమై ఇది వరకు దేవీ సంబంధమగు పవిత్రారోపణమునకు చెప్పబడినట్లుగానే కృత్యములన్నియును సమానము. దీని యందు గల విశేషములు మాత్రము చెప్పెదను, సావధాన మనస్సు గలవాడవై వినుము.
దీనియందు వ్రతము చేయటకు తగిన అధికారి విషయమును గురించి చెప్పబడినది కావున దానిని గురించి చెప్పెదను.
బాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు స్త్రీలు, శూద్రులు అందరును తమ ధర్మముల యందు ఉండు వారలై, భక్తితో కూడుకొని ఈ పవిత్రారోపణ వ్రతమును చేయవచ్చును.
విష్ణువును గురించి పవిత్రమును అర్పించునప్పుడు బ్రాహ్మణుడు ఆతోదేవీ అను మంత్రమును చెప్పుచు అర్పింపవలయును. స్త్రీలు, శూద్రులు విష్ణువు యొక్క పేరును చెప్పుచు పవిత్రమును అర్పింపలయును.
శివుని గురించి పవిత్రారోపణ వ్రత విషయములో కద్రుద్రాయ అను మంత్రమును చెప్పి బ్రాహ్మణుడు పవిత్రమును అర్పించవలయును. శివుని నామములను చెప్పి స్త్రీలు శూద్రులు పవిత్రమును అర్పించవలయును. కృత యుగములో మణులతో గూర్చబడిన పవివిత్రమును, త్రేతాయుగములో బంగారపు పవిత్రమును, ద్వాపరయుగములో పట్టు పవిత్రమును, కలియుగములో ప్రత్తి సంబంధముగు పవిత్రమును అర్పణ చేయవలెను.
ఈ పవిత్రారోపణమును యతీశ్వరులు మనస్సునందే చేయవలయును, ఈ పవిత్రములను వెదురు పాత్ర యందుంచి శుభ్రమగు నూతన వస్త్రములచే గప్పి ఓ ప్రభువా! నేను పాత్రను వస్త్రముచే కప్పిన రీతిగానే నా వ్రత లోపములు అన్నియును కప్పివేయుము, నీవు సంతసించుటకు ఈ పవిత్రారోపణ వ్రతమును చేసితిని, ఓ స్వామి! నా యందు దయగలవాడవై నే చేయు వ్రతమునకు విఘ్నము కలిగింపకుము అని ప్రార్తించవలెను.
ఓ దేవా! ఎల్లప్పుడు సమస్త విధములచే నీవే నాకు దిక్కు, ఓ స్వామీ! నేను ఈ పవిత్ర స్వరూపుడనై నిన్ను సంతోషింపజేయువాడన అగుదును. ఓ స్వామీ! వ్రతమునకు విఘ్నమును కలిగించెడి కామము, క్రోధము మొదలగు దుర్గుణములు నాకు కలుగునీయకుము. ఇది మొదలు సంవత్సరము పూర్తి అగుపర్యంతము నీవు నన్ను రక్షింపుము, నీకు నమస్కారము చేసెదను.
ఈ ప్రకారము దేవతను ప్రార్థించి వెదురుచే నిర్మింపబడిన శోభస్కరమగు పాత్రయందుంచబడిన పవిత్రమును ఇట్లు ప్రార్ధించవలెను. ఓ పవిత్రమా! నేను సంవత్సర పర్యంతము చేసిన పూజను పవిత్రము చేయు కొరకు ఇప్పుడు విష్ణు లోకము నుండి వచ్చితివి. నీకు నమస్కారము.
ఓ స్వామీ! విష్ణు తేజస్సు వలన కలిగినదియు, మనోహరమైనదియు, సమస్త పాపములను పోగొట్టునదియు, సమస్త కోరికలనొసగునదియు ఈ పవిత్రము నీ శరీరమందుంచెదను. ఓ స్వామీ! నారాయణ మూర్తీ! నిన్ను పూజించుట కొరకు ఆవాహన చేసితిని కావున నీకు నమస్కారము చేసెదను నాకు ప్రత్యక్షమగుము ప్రాతఃకాలంబున ఈ పవిత్రమును నీకు అర్పణ చేసెదను.
అనంతరం పుష్పాంజలినిచ్చి ఆ రాత్రి జాగరణ చేయవలయును. ఇట్లు ఏకాదశి నాడు ఆవాహన చేసి ద్వాదశి నాడు ఉదయంబున తిరిగి పూజింపవలెను.గంధం, గరికెలు, అక్షతలు మొదలగువానితో అలంకరింపబడిన పవిత్రమును పుచ్చుకొని, ఓ స్వామీ! నన్ను పవిత్రమును చేయుటకును, సంవత్సర పర్యంతము నేచేసిన పూజ సఫలమగుటకును, నేను అర్పణ చేయునటువంటి పవిత్రమును గ్రహింపుము.
ఓ స్వామీ! నేను చేసిన పాపమును పోగొట్టి నన్ను పవిత్రునిగా చేయుము, ఓ దేవతా సార్వభౌమా! నీ అనుగ్రహము వలన పరిశుద్ధుడనగుదును అని ప్రార్ధించి, మూల బీజాక్షరములతో సంపుటి చేయబడిన మంత్రములతో పవిత్రమును స్వామికి అర్పణచేయవలెను. మహా నైవేద్యము, నీరాజనము మొదలగునవి జరిపి, పిమ్మట అగ్నిహోత్రమునందు మూలమంత్రముతో నెయ్యి, పరమాన్నము మొదలగు వానిని హోమము చేయవలయును.
ఈ మూలమంత్రంతోనే పవిత్రమునకు ఉద్వాసన చెప్పి, ఓ పవిత్రమా! సంవత్సర పర్యంతం నే చేసిన పూజను సఫలమగునట్లు చేసితివి. నీవిప్పుడు విష్ణు లోకమునకు వెళ్లుము, అని చెప్పి ఆ పవిత్రమును తీసి బ్రాహ్మణునికై ఇయ్యవలయును, లేక ఉదకంలోనైనా విడువవలయును. ఈ విధమగు విష్ణుని గురించిన పవిత్రారోపణ వ్రతమును నీకు చెప్పితిని, ఈ వ్రతమును చేసినావారు ఇహలోకమున సుఖములనొంది, అనంతరం మోక్షమునొందుదురు అని సనత్కుమార మునీశ్వరునితో సాంబ మూర్తి చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – “ఉభయైకాదశీ వ్రత కథనం”, “ద్వాదాశీ వ్రత కథనం” నామ ఏకోనవింశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము